వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కొయ్యలగూడెం : వర్జీనియా పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేయూలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. కొయ్యలగూడెంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆడిటోరియంలో గురువారం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు అధ్యక్షతన ఎన్‌ఎల్‌ఎస్ పరిధిలోని వర్జీనియా పొగాకు రైతుల సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా కొత్తపల్లి మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని చెప్పారు. సీఎం చంద్రబాబు పాలనలో రైతులు అధోగతి పాలయ్యారని ధ్వజమెత్తారు. 60 వేల హెక్టార్లలో పొగాకు పండించిన రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల రుణాలను మాఫీ చేస్తానన్న చంద్రబాబు దగా చేశారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడం రైతుల బలహీనత అని, నమ్మకం ద్రోహం చేయడం చంద్రబాబు నైజం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పొగాకు రైతులతో పాటు వరి, మొక్కజొన్న, ఆరుుల్‌పామ్, రొయ్య రైతుల కష్టాలకు సీం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు.
రైతుల ఎదురుచూపు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకకోసం రైతులు వేరుు కళ్లతో ఎదురుచూస్తున్నారని తమ గోడును ఆయన ముందు వెళ్లబోసుకునేందుకు వేలాది మంది రైతులు దేవరపల్లి రానున్నారని తెల్లం బాలరాజు అన్నారు. రూ.600 కోట్ల రుణమాఫీ అంటూ టీడీపీ నాయకులు నమ్మించి రైతులు బిచ్చమెత్తుకునే పరిస్థితి కల్పించారని గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకటరావు ఆరోపించారు. సీఎం గద్దెనెక్కాక సుమారు 30 సార్లు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు విమర్శించారు. ఆయనకు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ఉన్న ప్రేమ రైతులపై లేదని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, జిల్లా అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జి, ముప్పిడి సంపత్, నాయకులు చెలికాని రాజబాబు, యడ్ల తాతాజీ, ఇళ్ల భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.