మరింత క్షీణించిన జగన్ ఆరోగ్యం
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ దీక్ష చేస్తుండటంతో బాగా నీరసించిపోయారని వైద్యులు తెలిపారు. జగన్కు ఈరోజు ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో షుగల్ లెవెల్స్ బాగా తగ్గాయని ....వైద్యానికి జగన్ సహకరించాలని వైద్యులు కోరారు.
నిరాహార దీక్ష చేస్తుండటంతో నిన్నే జగన్ బాగా నీరసంగా కనిపించారు. అయినప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన వారిని అదే చిరునవ్వుతో పలుకరిస్తూ అభివాదం చేశారు. వృద్ధులు, మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, పిల్లలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరితో నిలబడి ఎంతో ఓపిగ్గా మాట్లాడారు.
మరోవైపు జగన్ ఆమరణ దీక్షకు మద్దతగా దీక్షా శిబిరం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలియజేస్తున్నారు. జగన్ దీక్షకు గ్రేటర్ హైదరాబాద్ పాస్టర్స్ మద్దతు ప్రకటించారు. జగన్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.