న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఫిరాయింపుల వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకు వెళ్లామని ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను పాటించే దిశగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రి పదవి నుంచి తొలగించేలా గవర్నర్‌కు తగు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రపతికి విన్నవించామన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో రాష్ట్రపతికి వివరించి, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయనకు కోరినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఒక వినతిపత్రం సమర్పించినట్లు వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు.
రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక వ్యవహారం నడుస్తోందని, అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఫిరాయింపుదారుల్లో కొందరికి ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారన్నారు. అలా మంత్రి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ...ఫిరాయింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ పరిస్థితులను నివారించకుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు అనైతిక వ్యవహారాలపై అన్ని పార్టీల నేతలను కలుస్తామని వైఎస్ జగన్ తెలిపారు.
ప్రస్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది, రేపు మరో పార్టీకి ఇదే పరిస్థితి ఎదురు కావచ్చని అందరి దృష్టికి తీసుకు వెళతామన్నారు. బీజేపీని ప్రభావితం చేసే ప్రతి పార్టీ నేతను ఖచ్చితంగా కలుస్తామని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఆడియో, వీడియోల్లో దొరికిపోయారని, బ్లాక్‌మనీ విచ్చలవిడిగా సంపాదించి, ఆ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను కొంటున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు అవినీతిని కాగ్ కూడా తప్పుపట్టిందన్నారు.
ఇటుక నుంచి మట్టి వరకూ, మట్టి నుంచి మద్యం వరకూ, మద్యం నుంచి బొగ్గు వరకూ బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకూ, కాంట్రాక్టర్ల నుంచి జెన్‌కో వరకూ జెన్‌కో నుంచి గుడి భూములు వరకూ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలో మార్పు రావాలని, లేకుంటే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుందన్నారు. ఫిరాయింపుల విషయంలో అందరినీ కలిసి మార్పుతెచ్చే ప్రయత్నం చేస్తామని వైఎస్ జగన్ అన్నారు.