'బినామీ వ్యక్తులతో భూములు కొనిపించారు'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసమీకరణను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్ జగన్ నిడమర్రులో మాట్లాడుతూ.. బలవంతంగా భూములు లాక్కోవడం సరికాదన్నారు. నిజంగా రాజధాని కట్టాలనుకుంటే వినుకొండలో 18 వేల ఎకరాలున్నాయన్నారు. ఇక్కడ 20 కి.మీ దూరంలో అటవీ భూములు కూడా ఉన్నాయన్నారు. సుజనా చౌదరి వంటి బినామీ వ్యక్తులతో భూములు కొనిపించారన్నారు. 42 మంది తమ ఎమ్మెల్యేలు రైతులకు తోడుగా ఈ ప్రాంతంలో పర్యటించారని.. ఎవరూ కూడా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ తెలిపారు.
ఇక్కడే రాజధాని కడితే ఆ భూములు రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతోనే బినామీలతో భూములు కొనిపించారన్నారు. బినామీలకు మేలు చేసేందుకు రైతుల నోట్లో మన్ను కొడుతున్నారన్నారు. ప్రతీ గ్రామంలో రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు లాక్కొని రోడ్డున పడేస్తున్నారన్నారు. నాలుగు పంటలు పండే భూముల్లో బిల్డింగ్ లు కడతారా?అని జగన్ ప్రశ్నించారు.
ఈక్రమంలోనే కొంతమంది మహిళలు వేదికపై జగన్ వద్ద తమ గోడు వెళ్ల బోసుకున్నారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదన్నారు. తమ పొలం తమకే కావాలని.. ప్రాణం పోయే వరకూ భూములు ఇచ్చేది లేదని ఆ మహిళలు హెచ్చరించారు. ఇక్కడ రుణమాఫీ జరగలేదు కానీ, భూ మాఫీ జరుగుతుందని ఓ బీ ఫార్మసీ విద్యార్థిని అభిప్రాయపడింది.