ఎందాకైనా పోరాడతా | we fight back for farmer lands, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఎందాకైనా పోరాడతా

Published Wed, Mar 4 2015 1:50 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎందాకైనా పోరాడతా - Sakshi

ఎందాకైనా పోరాడతా

రాజధాని ప్రాంత రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
 బలవంతంగా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమే
 చంద్రబాబు మోసాలు ఇంకా తగ్గలేదు.. ఈ సర్కారు కూలిపోవడం ఖాయం
 ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాబుకు డిపాజిట్లు దక్కవు
 వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ భూములున్నాయి.. అక్కడ కట్టుకోవచ్చు కదా!
 సన్న, చిన్నకారు రైతుల పొట్టలు కొట్టడం ఎందుకు?
 మా పార్టీ అధికారంలోకి రాగానే లాక్కున్న భూములను వెనక్కు ఇచ్చేస్తాం
 సర్కారుపై ప్రతిపక్ష నేత నిప్పులు.. రాజధాని గ్రామాల్లో విస్తృత పర్యటన
 
 
 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఎంతవరకైనా పోరాటం చేస్తామని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు తీసుకోవడం ముమ్మాటికీ అన్యాయమేనని స్పష్టంచేశారు. ‘‘ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. రాజధాని పేరుతో రైతుల ఇష్టానికి భిన్నంగా సాగు భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. ఈ విధానాన్ని గట్టిగా నిలదీస్తాం. ఈ అన్యాయంపై అందరం కలిసికట్టుగా ఎందాకైనా పోరాటం చేద్దాం. బలవంతంగా భూములు తీసుకోవడం సాధ్యం కాదు. న్యాయస్థానాలున్నాయి. ఏం భయపడొద్దు. చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయంపై రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని విజ్ఞులంతా ఆలోచించాలి’’ అని కోరారు. మంగళవారం జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
 
 పలుచోట్ల రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు ఆవేదనాభరితంగా చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామిక వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటూ రైతులకు భరోసా కల్పించారు. బహుళ పంటలు పండించే భూములను సేకరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ప్రాంత రైతులకు అండగా నిలుస్తామని, పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ‘‘రైతుల ఇష్టం లేకుండా భూములను తీసుకోవడం అన్యాయం. దీన్ని మొదట్నుంచీ మేం ఒప్పుకోవడం లేదు. ముఖ్యమంత్రి మోసాలు ఇంకా తగ్గలేదు. ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. అది రెండేళ్లకో, మూడేళ్లకో చెప్పలేను కానీ ఇన్ని దాష్టీకాలు సాగిస్తున్న ప్రభుత్వం కచ్చితంగా పడిపోతుంది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు. మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇప్పుడు బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి వెనక్కి ఇచ్చేస్తాం’’ అని జగన్ అన్నారు. ‘‘మనసున్న వాడెవడూ భూములు తీసుకోవడానికి ఒప్పుకోడు. చంద్రబాబుకు నిజంగా మానవత్వం లేదు. ఇటువంటి పనిని ఏకంగా ఒక ముఖ్యమంత్రే చేస్తే ఆ మనిషిని ఏమనాలి. రాజధానిని ఇక్కడే కట్టాలి. వాస్తు బాగుంటుందని, రివర్ ఫ్రంట్ రాజధాని కావాలనే దిక్కు మాలిన ఆలోచనతో మూడు, నాలుగు పంటలు పండించే రైతుల పొట్ట గొట్టడం అన్యాయం. రైతు కూలీ కుటుంబంలో భర్త రోజుకు 500, భార్య రూ 300 చొప్పున నెలకు రూ.24 వేలు సంపాదిస్తున్నారు. వీరికి నెలకు 1,500, రెండు వేలు ముష్టి వేస్తామని చంద్రబాబు చెబుతున్నాడు. నిర్దాక్షిణ్యంగా వారి కడుపు కొడుతున్నారు. చంద్రబాబు పుణ్యమా అని రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు, బంగారు రుణాలు మాఫీ కాలేదు. ఇవన్నీ జరక్క పోగా ఇప్పుడు భూములు కూడా లాక్కుంటున్నారు’’ అనిదుయ్యబట్టారు.
 
 సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
 
 రైతుల భూమితో ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా అని జగన్ నిలదీశారు. ‘‘ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ఇంతకుముందు వైఎస్సార్‌సీపీ నాలుగుసార్లు ఇక్కడ పర్యటించింది. 42 మంది ఎమ్మెల్యేలు ధర్నా, పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే ఆర్‌కే నిరాహారదీక్ష కూడా చేశారు. చంద్రబాబును ఇంకా గట్టిగా నిలదీస్తాం. ఇక్కడ ఆయనకు ఒకటి అర్థం కావాలి. రాజధాని కోసమని 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో సగం రోడ్లు, ఇతర అవసరాలకు పోతాయి. 12 వేల ఎకరాలు మాత్రమే రైతులకు చిల్లర వేసినట్లు పడేస్తామంటున్నారు. మిగిలిన 13 వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా..? ఒక సీఎం చేయాల్సిన పనేనా ఇది. రాజధానికి నీక్కావాల్సిన వెయ్యో, రెండు వేల ఎకరాలో తీసుకో. మిగిలిన దాన్ని జోనింగ్ చేసి రోడ్లు వేసి వదిలేయ్. ఆ భూముల్లో రైతులు  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారో, ఏమి చేసుకుంటారో వారిష్టం. రైతులకు స్వాతంత్య్రం ఇవ్వు. మీరెందుకు రైతుల భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి? ఇంతమంది రైతుల కడుపుకొట్టి బలవంతంగా భూములు తీసుకుంటారా? ఇదే జిల్లా వినుకొండలో 18 వేల ఎకరాల డీనోటిఫైడ్ ఫారెస్ట్ భూములున్నాయి. సింగపూర్, జపాన్ లాంటి రాజధానులు కడతానని చెబుతున్న చంద్రబాబు ఇంకా అవసరమైతే ఆ భూముల్లో అమెరికా లాంటి రాజధాని కట్టుకోవచ్చు. ఎవరూ ఏమీ అడగరు. కానీ ఇక్కడే రాజధాని కట్టుకోవాలనుకోవడం సరికాదు. ఇక్కడ మీరు తీసుకోవాలనుకుంటున్న 50 వేల ఎకరాల్లో 20 వేల మంది రైతులున్నారు. అందులో 2 ఎకరాల లోపు ఉన్న రైతులు 10 వేల మంది ఉన్నారు. 3 ఎకరాల లోపు రైతులు 10 వేల మంది ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే. వాళ్ల భూములు లాక్కోవడం అన్యాయం కాదా’’ అని జగన్ ప్రశ్నించారు.
 
 ఉన్న జాబులు ఊడగొడుతున్నాడు..
 
 బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కాక ఉన్న జాబులను ఊడగొడుతున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి. ఉండవల్లి గ్రామంలోని భూముల్లో సంవత్సరానికి నాలుగు పంటలు పండుతాయి. ఒక్క ఉండవల్లి గ్రామంలోనే రెండు వేల ఎకరాలున్నాయి. ఎకరానికి 4 లక్షల చొప్పున ఈ గ్రామం నుంచే సుమారు రూ.80 కోట్లు జమ అవుతోంది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో చెప్పారు. కానీ మూడు పంటలు పండే మంచి భూములను లాక్కుని వారి జాబులు ఊడగొడుతున్నారు. ఎకరం మీద రైతులు నాలుగు లక్షలు సంపాదించుకునే  పరిస్థితిలో వారి భూములు లాగేసుకుంటే తర్వాత వాళ్లంతా ఎక్కడికి వెళ్తారు? మీ నుంచి భూములు బలవంతంగా తీసుకోలేరు. మీ వెంట మేముంటాం. ఎన్నికలకు ముందు మోసాలు, అబద్ధాలతో సీఎం కుర్చీ ఎక్కాడు చంద్రబాబు. ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటూ వీధి గూండాలా తయారయ్యాడు. ఒకవైపు డబ్బుల్లేవంటూనే మరోవైపు సింగపూర్‌లా చేస్తానంటున్నాడు. కేంద్రం కూడా నిరాశపరిచింది. కేంద్ర బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదు. బాబును నేనొక్కటే  అడుగుతున్నా... సీఎంగా పరిపాలన చేస్తాడా? రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిపాలన సాగిస్తాడా? నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా. చంద్రబాబు మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. మీరెవ్వరూ అధైర్యపడొద్దు’’ అని రైతులకు జగన్ ధైర్యం చెప్పారు.
 
 
 బినామీల భూముల ధరలు పెంచేందుకే..
 
 ‘‘చంద్రబాబు.. సుజనా చౌదరి వంటి బినామీల చేత భూములు కొనిపించారు. బాబు రాజధాని లైన్ ఎక్కడ గీస్తే దానికి ఆనుకుని సుజనా చౌదరి భూములు కొన్నారు. తన దగ్గర డబ్బులు ఉన్నాయనీ, భూములు కొంటే తప్పేంటని సుజనా చౌదరి నిస్సిగ్గుగా చెబుతున్నారు. సీఎం తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బినామీలకు మేలు చేయడం కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం ఎంత వరకు న్యాయం. చంద్రబాబు.. ఆయన బినామీల భూములకు ధరలు పెంచుకునేందుకే ఇక్కడ రాజధాని కడుతున్నారు. అందుకే రైతుల నోట్లో మట్టి కొడుతున్నాడు. చంద్రబాబు ఒత్తిడికో, భయానికో భూములిచ్చిన వారెవరైనా ముందుకు రావొచ్చు. తమ నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ముందుకొస్తే వారి తరపున మేం కోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం చేస్తాం. మీ ఎమ్మెల్యే ఆర్కే ఇక్కడే ఉంటారు. ఆయనను కలిసి మీ ఇబ్బంది చెప్పవచ్చు. ఆర్కే మీ తరఫున కోర్టుల్లో కేసు వేసి న్యాయపోరాటం చేస్తారు’’ అని జగన్ చెప్పారు. ‘‘ఈ గ్రామాల్లో రైతుల రుణాలు మాఫీ కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి వచ్చిందా అని అడిగితే బంగారం కాదు వేలం నోటీసులు ఇంటి కొచ్చాయని మహిళలు చెబుతున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు. పర్యటనలో జగన్ వెంట ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), కొడాలి నాని, కోన రఘుపతి, జ్యోతుల నెహ్రూ, మేకా వెంకట ప్రతాప అప్పారావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రక్షణనిధి, జలీల్ ఖాన్, షేక్ ముస్తఫా, ఉప్పులేటి కల్పన, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మాన ప్రసాదరావు,  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, కొలుసు పార్థసారథి, ఎంవీఎస్ నాగి రెడ్డి, మేరుగ నాగార్జున, బాలశౌరి, మర్రి రాజశేఖర్, జంగా కృష్ణమూర్తి, వంగవీటి రాధాకృష్ణ, లేళ్ల అప్పిరెడ్డి, కొత్తపల్లి సుబ్బారాయుడు, తలశిల రఘురాం, పుత్తా ప్రతాపరెడ్డి, ఈవీ మహేశ్వరరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement