
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలన్నీ సంతృప్తికర స్థాయిలో అమలు కావాలని, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన శుక్రవారం సీఎంవో అధికారులతో భేటీ అయ్యారు. మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, పథకాల అమలు తేదీ నుంచి నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇదివరకే చెప్పామని, వెంటనే వాటిని పరిష్కరించి, అర్హత ఉన్నవారికి పథకాల ఫలాలు అందేలా చేయాలని అధికారులను ఆదేశించారు.(మరణాల రేటు 2.72 శాతమే: కేంద్రం)
కోవిడ్ కష్టకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ కాపు నేస్తం పథకాలను ముందుగా(జూన్ నెలలో) ప్రారంభించింది. ఆయా పథకాలను దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ పథకాలకు పేర్లు రాని వారిని ఆందోళన చెందకుండా గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సర్కారు సూచించింది. అధికారులతో భేటీలో దీనిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. అర్హులందరికీ పథకాల ఫలాలు దక్కాలని, ఆ మేరకు అప్లికేషన్లు పరిశీలించి నగదు బదిలీ చేయాలని ఆదేశించారు.(సౌర విద్యుత్‌తో వెలుగు రేఖలు)
గత నెలలో ఏయే పథకాలు?
జూన్ 4వ తేదీన ‘వైయస్సార్ వాహనమిత్ర’, 10న ‘జగనన్న చేదోడు’, 20వ తేదీన ‘వైయస్సార్ నేతన్న నేస్తం’, 24న ‘వైయస్సార్ కాపు నేస్తం’ పథకాలను ప్రభుత్వం ముందుగా అమలు చేసింది. వాహనమిత్ర పథకం ద్వారా నాలుగు నెలలు ముందుగా, నేతన్న నేస్తం ద్వారా ఆరు నెలలు ముందుగా లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించింది.
వైఎస్సార్ నేతన్న నేస్తం
వైఎస్సార్ నేతన్న నేస్తం కింద సొంత మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికీ రూ.24వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది. గత డిసెంబరు తర్వాత మగ్గం పెట్టుకున్న వారినీ ఈ పథకం కింద పరిగణలోకి తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.