సాక్షి, హైదరాబాద్ : స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పాత్రికేయుడిగా మౌలానా కనబర్చిన జాతీయవాద స్ఫూర్తి ఎంతో గొప్పదని జగన్ కీర్తించారు.
మౌలానా జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’ గా జరుపుకొంటున్న సంగతిని గుర్తుచూస్తూ.. ఆ మహానుభావుడి ఆదర్శాలను నేటి సమాజమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు.
ఆజాద్ ఆయన కలం పేరు : మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1988, నవంబర్ 11న మక్కాలో జన్మించారు. తల్లిదండ్రులు ఖైరుద్దీన్ అహమ్మద్, ఆలియా బేగమ్‌లు హజ్ యాత్రలో ఉండగా ఆజాద్ పుట్టారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆజాద్ తన తాతగారి(అమ్మవాళ్ల నాన్న) ఇంట్లో(ఢిల్లీ) పెరిగారు. స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా 11 ఏళ్లపాటు పనిచేశారు. విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’గా జరుపుతాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్'. 'అబుల్ కలాం' అనేది ఆయన బిరుదు. ఇక 'ఆజాద్' ఆయన కలం పేరు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా పరమపదించారు.
Comments
Please login to add a commentAdd a comment