
కుంగిపోవద్దు
‘కష్టాలు కలకాలం ఉండవు. వాటిని తల్చుకుని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి.
► కష్టాలు కలకాలం ఉండవు
► వాటిని ధైర్యంగా ఎదుర్కొందాం
► గుంతకల్లు అసెంబ్లీ సెగ్మెంటులో బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ
► గుత్తి నుంచి గుంతకల్లు వరకు పోటెత్తిన అభిమానులు
► మండే ఎండను సైతం లెక్క చేయక అడుగడుగునా స్వాగతం
(గుంతకల్లు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘కష్టాలు కలకాలం ఉండవు. వాటిని తల్చుకుని కుంగిపోవద్దు. ధైర్యంగా ఉండండి. నేను అన్నివిధాలా అండగా ఉంటా. త్వరలోనే మంచి రోజులొస్తాయ’ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం ఆయన గుంతకల్లు నియోజకవర్గంలోని గుత్తి, గుంతకల్లు మండలాల్లో నాలుగు కుటుంబాలను పరామర్శించారు.
యాత్ర సాగిందిలా...
మంగళవారం రాత్రి గుత్తిలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత వీకే సుధీర్‌రెడ్డి ఇంట్లో బస చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 8.30 గంటలకు తన దగ్గరకు వచ్చిన పార్టీ గుంతకల్లు నియోజకవర్గం నేతలతో కొద్దిసేపు మాట్లాడారు. స్థానికంగా ఉన్న వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్లందరినీ పలకరించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించారు. సరిగ్గా 9.30 గంటలకు రైతు భరోసా యాత్రకు బయలుదేరారు.
మార్గమధ్యంలోని గుత్తి ఆర్టీసీ బస్టాండులోకి వెళ్లి సమ్మె చేస్తోన్న ఆర్టీసీ కార్మికులను కలిసి..సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత జూనియర్ కళాశాల సెంటర్ మీదుగా లచ్చానుపల్లి బయలుదేరారు. స్వస్థతశాలలో ప్రార్థనలు ముగించుకుని ఎదురొస్తోన్న మహిళల అభ్యర్థన మేరకు ఆగి.. కొద్దిసేపు వారితో సంభాషించారు.
స్వస్థతశాలలో ప్రార్థనలు
వైఎస్ జగన్ లచ్చానుపల్లి దారిలోని స్వస్థతశాలలో మహిమ సువార్త మహాసభలకు హాజరయ్యారు. ఫాదర్ అద్భుతరావు నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ప్రార్థనలకు హాజరైన వారికి అభివాదం చేశారు. అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. ‘అక్కా..చెల్లెమ్మా’ అంటూ ఎదురొచ్చిన మహిళలను పలకరించి.. వారి సాధక బాధకాలపై ఆరా తీశారు. లచ్చానుపల్లి పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు జగన్‌ను చూసి పరుగు పరుగున కాన్వాయ్ దగ్గరకు చేరారు.
‘ఏమ్మా డ్వాక్రా రుణాలు తీరాయా? ఏమవ్వా...పింఛను వస్తోందా’ అని అడిగారు. వచ్చే నెల 5,6 తేదీల్లో పింఛన్లు, డ్వాక్రా రుణాలపై పోరాటం చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం దీక్ష చేపట్టనున్నామని చెప్పారు. స్థానికంగా ఏమైనా ఇబ్బందులుంటే గుంతకల్లు వెళ్లి వెంకట్రామిరెడ్డి అన్నను (పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త) కలవాలని గ్రామస్తులకు సూచించారు.
కరెంటు షాక్‌తో తన భర్త పెద్దన్న చనిపోయినా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మూడు నెలలుగా వృద్ధాప్య పింఛను అందడం లేదని, రేపు మాపంటూ అధికారులు తిప్పించుకుంటున్నారని మేకల చెన్నంనాయుడు అనే వృద్ధుడు వాపోయాడు. వీరిద్దరికీ ధైర్యం చెప్పి సమస్య పరిష్కరించాలని వెంకట్రామిరెడ్డికి సూచించారు.
ఉదయం 11 గంటలకు లచ్చానుపల్లికి చేరుకుని.. 2014 ఆగస్టు 9న ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మధ్యాహ్నం 12.20 గంటలకు అక్కడి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్.. రోడ్డుకి ఇరువైపులా తన కోసం ఎదురు చూస్తున్న అభిమానుల్ని పలకరించారు.
దారి పొడవునా స్వాగతం
వైఎస్ జగన్ లచ్చానుపల్లి నుంచి వైటీ చెరువుకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఓబులాపురం అడ్డరోడ్డు దగ్గర పెద్దఎత్తున అభిమానులు, రైతులు తప్పెట్లతో స్వాగతం పలికారు. పొలాల్లో నీళ్లు పెడుతున్న కూలీలు పరుగున వచ్చి జగన్‌తో కరచాలన ం చేసేందుకు ప్రయత్నించారు. కొంగనపల్లి, పాత కొత్తచెరువు గ్రామస్తులు కూడా ఘన స్వాగతం పలికారు. గుంతకల్లు మండలం వైటీ చెరువు గ్రామంలో 2014 జూన్ 30న ఆత్మహత్య చేసుకున్న రైతు కూరాకుల సుధాకర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
సాయంత్రం నాలుగుకు గుండాల గ్రామానికి చేరుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 20న ఆత్మహత్య చేసుకున్న రైతు నెట్టెప్ప కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత గ్రామ పెద్ద తోట జంపయ్య ఇంటికెళ్లి ఆయన యోగక్షేమాలపై ఆరా తీశారు. అనంతరం గుంతకల్లు చేరుకున్నారు. మిల్లుకాలనీకి చెందిన బండ్ల సారాబీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైనాన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకుంది.
ప్రమాదానికి కారణమైన వాహన యజమానిపై ప్రయివేటు కేసు వేసి.. నష్టపరిహారం రాబడదామని ఆమెను ఓదార్చారు. గుంతకల్లుశివారులోని అంబేద్కర్‌నగర్‌లో అరగంటకు పైగా మహిళలు, వృద్ధులతో మాట్లాడారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్‌తో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.
వెల్లువెత్తిన అభిమానం
గుంతకల్లులో వైఎస్ జగన్‌పై అభిమానం వెల్లువెత్తింది. తండోపతండాలుగా తరలివచ్చిన అభిమానులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి జగన్‌ను చూసేందుకు ఆసక్తి చూపారు. వాల్మీకి నగర్, 12వ వార్డుల్లో అరగంటకు పైగా ఆగిన జగన్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పాత శివాలయం సమీపంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీలర్ చాకలి మధుబాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొత్తమ్మీద గుత్తి నుంచి గుంతకల్లు వరకూ భరోసా యాత్ర దిగ్విజయంగా సాగింది.
పెద్దఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు జగన్‌ను అనుసరించారు. ఆయన రాత్రి 9.15 గంటలకు పార్టీ నేత వెంకట్రామిరెడ్డి ఇంటికి చేరుకున్నారు. మూడో రోజు భరోసా యాత్రలో వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు.
నేటి రైతు భరోసా యాత్ర ఇలా...
అనంతపురం అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాల్గో రోజు రైతు భరోసాయాత్ర గురువారం ఉదయం గుంతకల్లు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నల్లదాసరపల్లికి చేరుకుంటారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కురుబ ఉసేనప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం తిమ్మాపురం గ్రామానికి వెళ్లి... రైతు కసాపురం పుల్లయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం డ్వాక్రా సభ్యులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.