సమైక్య వాణిని వినిపించింది జగన్ ఒక్కరే: మేకా శేషుబాబు
Published Sat, Oct 12 2013 2:44 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించి తన వాణిని వినిపించిన వ్యక్తి ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు గుర్తుచేశారు. పాలకొల్లులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం దీక్షలో పాలకొల్లు మండలం పెదమామిడిపల్లి, దిగమర్రు, కొత్తపేట గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. వీరికి సంఘీభావం తెలిపిన అనంతరం ఎమ్మెల్సీ శేషుబాబు మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సమైక్యాంధ్రకే కట్టుబడ్డారన్నారు.
పస్తుతం రాష్ట్రం రావణ కాష్టంగా మారడానికి సమర్థవంతమైన నాయకుడు, ప్రతిపక్షం లేకపోవడమేనన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజన తీర్మానాన్ని అసెంబ్లీలో ఓడిస్తామంటారని, షిండే తీర్మానం అక్కర్లేదని చెబుతారని, ఇలా అర్థంపర్థంలేని ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయి కరువుకాటకాలు తాండవిస్తాయని శేషుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి తనకున్న అధికారాన్ని ఉపయోగించి అసెంబ్లీని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ 2014 ఎన్నికల్లో రాహుల్‌ని ప్రధానిగా చూడాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర విభజనకు సిద్ధపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ముచ్చర్ల శ్రీరామ్, పార్టీ పట్టణ కన్వీనర్ సంగినీడి సూరిబాబు, యడ్ల తాతాజీ, మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్‌రాజు, నడింపల్లి అన్నపూర్ణ, మద్దా చంద్రకళ, కమలా పీటర్‌సన్, మిడతాని సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.
Advertisement
Advertisement