నగరి(చిత్తూరు): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఆమె తన కొడుకు ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజించేందుకు పాల్పడుతున్నారని విమర్శించారు. సమైక్య శంఖారావంలో భాగంగా నగరి సభకు విచ్చేసిన అశేష జన వాహినిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ' సోనియా గాంధీది మన దేశమూ కాదు..మన భాష కూడా తెలీదు. రాష్ట్రాన్ని మాత్రం అడ్డగోలుగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందాం. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుని కోటను నిర్మిద్దాం' అని వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని, తాగడానికి నీళ్లు కూడా లేవని అక్కా చెల్లెళ్లు అడుగుతుంటే బాధగా ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని ఛార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కనీసం విద్యార్థులకు ఫీజులు కూడా సరిగా చెల్లించడం లేదని సర్కారు పని తీరును తప్పుబట్టారు. సోనియా గాంధీ గీసిన గీతను సీఎం కిరణ్ కుమార్ దాటను గాక దాటరని జగన్ అన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతూ ప్యాకేజీలు అడగటం సిగ్గు చేటన్నారు.