జనజాతర
జగన్‌కు అదే ఆదరణ
అదే ఆప్యాయత
వాడవాడలా స్వాగత తోరణాలే
చిరునవ్వుతో పలకరించిన జననేత
సాక్షి, తిరుపతి:
జిల్లాలో రెండో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర చేపట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ప్రతిపల్లెలో, ప్రతి వాడలో ప్రజలు ఆదరించారు. పూలతో స్వాగతించారు. చిన్నారులు, పెద్దలు, వృద్ధులు తేడా లేకుండా ఆయనను ఆప్యాయంగా పలకరించారు. దీంతో అనుకున్న షెడ్యూలు కన్నా, మూడు గంటలు ఆలస్యంగా పర్యటన సాగినా, ఏ మాత్రం విసుగు లేకుండా ఆయన రాక కోసం ప్రజలు బారులు తీరి నిలబడ్డారు.
మంగళవారం ఉదయం పుంగనూరులో బయలుదేరిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరులోని ప్రతి వీధి జాతరను తలపించింది. వేలాదిమంది అభిమానులు జననేతతో మాట్లాడేందుకు చుట్టుముట్టారు. పుంగనూరు పట్టణం సరిహద్దులో ఉన్న విష్ణుభారతి పాఠశాల విద్యార్థులు స్వాగతం పలికారు. పార్టీ నేత అక్కసాని భాస్కర్ రెడ్డి టపాకాయలు పేల్చారు. తరువాత జగన్‌మోహన్‌రెడ్డి మైనారిటీ నాయకుడు ఖాదర్ ఖాన్ ఇంటికి వెళ్లి, తేనీరు సేవించారు. అక్కడి నుంచి ఉలవలదిన్నె, రాగానిపల్లె మీదుగా బాలాజీ కాలనీ వద్దకు చేరుకోగా, మహిళలు హారతి పట్టి స్వాగ తం పలికారు. శాంతినగర్ వాసులు బ్యాండు మేళం ఏర్పాటు చేశారు. రామపల్లెకు చేరుకోగానే అక్కడ టపాకాయలు పేల్చి స్వాగతం పలికారు. సుగాలిమిట్ట చేరుకుని, అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి సుగాలి సోదరులతో కలసి రిటైర్డ్ ఎంపీడీవో వెంకటరెడ్డియాదవ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విగ్రహావిష్కరణ తరువాత పూజగానిపల్లెలో చర్చికి వెళ్లి కేక్‌కట్ చేశారు. భీమగానిపల్లెకు చేరుకున్న వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మహిళలు హారతులు ఇవ్వ గా, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. గాంధీపురం సర్పంచ్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో పూజగానిపల్లె వద్ద లంబాడీలు ఆహ్వానం పలికారు. ఈడిగపల్లెలో పూలవర్షం కురిసింది. సర్పంచ్ అమరనాథరెడ్డి ఆయనను స్వాగతించా రు. సమీపంలోని గ్రీన్‌వ్యాలీ స్కూల్ విద్యార్థినులు పూలతో ఆహ్వానించారు. 150వ మైలు వద్ద మహిళలు హారతులు పట్టగా, డప్పుల మోతలు, టపాకాయ లు పేలుస్తూ ఆహ్వానించారు. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు, వైఎస్‌ఆర్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆహ్వానించారు. వారి డైరీని జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. భీమనేని రెస్టారెంట్ వద్ద మదనపల్ల్లె సమన్వయకర్త షమీమ్ అస్లాం స్వాగతం పలికారు.
వలసపల్లెలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వలసలపల్లె క్రాస్ మీదుగా మదనపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించిన జగన్‌మోహన్‌రెడ్డికి మొలకలదిన్నె వద్ద పార్టీ నాయకుడు బాబ్‌జాన్ దాదాపు వంద వాహనాలతో స్వాగతం పలికారు. బసినికొండ చేరుకున్న జననేతను ఒక విద్యార్థిని తెలుగుతల్లి వేషధారణతో ఆహ్వానించగా, మహిళలు హారతులు పట్టారు. డప్పు లుకొట్టి సంబరం చేసుకున్నారు. నిమ్మనపల్లె సర్కిల్‌వద్ద టపాకాయలు పేల్చా రు. మదనపల్లెలోని సీఎస్‌ఐ మిషన్ కాంపౌండ్‌లోని మహిళలు జగన్‌మోహన్‌రెడ్డి ని చూసేందుకు బారులు తీరారు. చిత్తూరు బస్టాండ్‌వద్ద వందలాదిమంది చేరుకుని ఎదురుచూశారు. ఆయన రాగానే కొండంత సంబంరంతో జేజేలు పలికారు. మదనపల్లెలో అడుగడుగునా వందలాదిమంది జగన్‌మోహన్‌రెడ్డి కోసం ఎదురుచూశారు. మదనపల్లె పట్టణంలో ఆయనకు దాదాపు ఒకటిన్నర గంట సమయం పట్టింది. బెంగళూరు బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం రెండో విడత సమైక్య శంఖారావానికి తాత్కాలిక విరామం ఇచ్చి ఆయన బెంగళూరు మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, ప్రవీణ్ కుమార్‌రెడ్డి, గాంధీ, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి, యువజన కన్వీనర్ ఉదయ్‌కుమార్, పల్లికొండేశ్వర ఆలయం ట్రస్టు బోర్డు సభ్యుడు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, రెడ్డెప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, నాగరాజరెడ్డి, ఆవుల అమరేంద్ర, మైనారిటీ నాయకుడు అక్తర్ అహ్మద్, పీఎస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.