గుంతకల్లు, న్యూస్‌లైన్ : అసెంబ్లీ, పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకోకుండా ‘సమైక్య’మంటూ మీ ముందుకు వచ్చి డ్రామాలాడే ప్రజాప్రతినిధులను తరిమి కొట్టి.. ఓటుతో బుద్ధి చెప్పండని అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎన్నికల పరిశీలకుడు, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలో ఆయన మాట్లాడారు.
పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ అడ్డుకోకుండా బయటకు వచ్చి సమైక్యమంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. అలాంటి ప్రజాప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. ఇలాంటి చెత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు రాబోయే ఎన్నికల్లో గెలవకుండా చిత్తు చిత్తుగా ఓడించాలని సూచించారు. ప్రజలంతా రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుంటే కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం విభజన చేయాలంటూ భజన చేస్తున్నారన్నారు. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఏ రాష్ర్టంలోనూ లేదన్నారు.
పైలిన్ తుపాన్‌ను అడ్డుకోలేను కానీ విభజన తుపాన్‌ను అడ్డుకుంటానన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాగానే జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. జీతాలు రాకపోయినా పర్వాలేదు, పిల్లల జీవితాలు బాగుపడాలి అంటూ ఉద్యమం చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులను ఏపీ ఎన్జీవో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు అశోక్‌బాబు నిలువునా మోసం చేసి.. సీఎం తొత్తుగా మారిపోయాడ ని విమర్శించారు. కీలక సమయంలో ఉద్యమించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడేమో విభజనను అడ్డుకోకుండా కాంగ్రెస్ అధిష్టానానికి పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. తనయుడి ని ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోబెట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఏ ఒక్కరూ ‘తెలంగాణ’ ఊసెత్తలేదన్నారు.
అలాంటి దమ్మున్న నేత లేకపోవడం వల్లే ఇప్పుడు పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్నారు. సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారన్నారు. అలాంటి వ్యక్తి స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సమైక్య రాష్ర్ట పరిరక్షణకు, సుపరిపాలనకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎన్నికల చిహ్నం ‘ఫ్యాన్’ గుర్తుతో పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించుకోవాలన్నారు.
కాగా, సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటాన్ని, ఉద్యమాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ గుంతకల్లు పట్టణానికి చెందిన అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ బి.పార్వతీదేవి రూపొందించిన ‘సమైక్య శంఖారావం’ బ్రోచర్‌ను కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. సభలో పార్టీ జిల్లా కన్వీనర్ ఎం. శంకరనారాయణ, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, కళ్యాణదుర్గం సమన్వయకర్త తిప్పేస్వామి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, మాజీ డీఎస్పీ వన్నూర్‌సాబ్, నాయకులు బోయ తిరుపాల్, మీసాల రంగన్న, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమైక్య ద్రోహులకు ఓటుతో బుద్ధి చెప్పండి
Published Fri, Dec 20 2013 3:20 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement