సంతృప్తికర స్థాయిలో అమ్మఒడి | YS Jaganmohan Reddy comments about Amma Vodi Scheme in a high level review meeting | Sakshi
Sakshi News home page

సంతృప్తికర స్థాయిలో అమ్మఒడి

Published Tue, Jan 7 2020 3:45 AM | Last Updated on Tue, Jan 7 2020 7:55 AM

YS Jaganmohan Reddy comments about Amma Vodi Scheme in a high level review meeting - Sakshi

పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ప్రవేశ పెడుతున్నందున తొలి ఏడాది స్ఫూర్తి నింపేలా 75 శాతం హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75 శాతం హాజరు నిబంధన పాటించాల్సిందేనని  పిల్లల తల్లిదండ్రులకు తెలియజెప్పాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో అమ్మ ఒడి పథకం అందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నిబంధనలంటూ ఇబ్బంది పెట్టకుండా వాస్తవాలను పరిశీలించాలని చెప్పారు. అమ్మ ఒడి, నాడు–నేడు కార్యక్రమం, మధ్యాహ్న భోజనం పథకంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తొలి ఏడాదిలో ‘అమ్మ ఒడి’ పథకానికి సంబంధించి 75 శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనాథ పిల్లలకు సంబంధించి ‘అమ్మ ఒడి’ డబ్బును సగం అనాథాశ్రమానికి, మిగతా సగం పిల్లల పేరు మీద డిపాజిట్‌ చేయాలన్నారు. కొన్ని కుటుంబాల్లో విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నందున మినహాయింపు ఇవ్వాలని క్షేత్ర స్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి, అర్హులైన వారికి తప్పనిసరిగా ఈ పథకం వర్తింప చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో తప్పుల కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. వెంటనే పరిశీలించి అర్హులుగా గుర్తించాలని చెప్పారు. ఈ పథకం కింద సుమారు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు వివరించారు.

టెక్టŠస్‌ బుక్స్, యూనిఫారాల పంపిణీ ఆలస్యం కాకూడదు
స్కూళ్లు తెరిచే నాటికి పాఠశాలల పిల్లలకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారాలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. స్కూల్‌ కిట్‌లో భాగంగా మూడు జతల దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్, ఒక జత షూ, సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు అందించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఆరు తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంలో భాగంగా ఉపా«ధ్యాయులకు ఇస్తున్న శిక్షణ గురించి అధికారులు సీఎంకు వివరించారు. స్వయం శిక్షణ కోసం వెంటనే యాప్స్‌ కూడా తయారు చేయించాలని సీఎం సూచించారు. 

నాడు–నేడు కింద అన్ని వసతులు కల్పించాలి
ప్రభుత్వం చేపడుతున్న నాడు–నేడు పనుల్లో నాణ్యతలో రాజీ పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచి బాత్‌రూములు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన బెడ్లు, అల్మారాలు, చదువుకునేందుకు టేబుల్స్‌ ఉండాలని స్పష్టం చేశారు. మొదటి దశలో 15,715 పాఠశాల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఇవి జనవరి 15 నుంచి ప్రారంభం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. రెండు, మూడు దశల్లో స్కూళ్లు, హాస్టళ్లు, అన్ని జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. 

మరింత నాణ్యతతో మధ్యాహ్న భోజనం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యతతో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి గత సమీక్షా సమావేశాల్లో సీఎం ఆదేశాల మేరకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. మెనూలో తీసుకు వస్తున్న మార్పుల గురించి చెప్పారు. మధ్యాహ్న పథకంలో నాణ్యత పెంచడం కోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3 వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామన్నారు. దీంతో మొత్తంగా నాణ్యత పెంచేందుకు రూ.343.55 కోట్లు అదనంగా ఖర్చు అవుతోందన్నారు. ఈ పథకం కోసం మొత్తం రూ.1,294 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాగా, ఈనెలలో సంక్రాంతి సెలవుల అనంతరం స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు నుంచి నాణ్యమైన మెనూ అమల్లోకి రానుంది.

ఇక మధ్యాహ్న భోజనం మెనూ ఇలా..
సోమవారం : అన్నం, పప్పుచారు, ఎగ్‌ కర్రీ, చిక్కి
మంగళవారం :  పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం: అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement