మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు | CM YS Jagan Mohan Reddy Comments About Mid Day Meal Quantity | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దు

Published Sun, Jan 19 2020 4:02 AM | Last Updated on Sun, Jan 19 2020 9:00 AM

CM YS Jagan Mohan Reddy Comments About Mid Day Meal Quantity - Sakshi

ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజన పథకం కోసం ఏటా రూ.1,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆయాలకు రూ.3 వేల వేతనం, సరుకుల ఖర్చులకు గ్రీన్‌ చానల్‌లో ఎప్పటికప్పుడు చెల్లింపులు ఉంటాయి. అన్ని ప్రాంతాల్లో నాణ్యత ఒకేలా ఉండాలి. 
 – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ‘మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలి. ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే. పులివెందులలో తిన్నా.. అమరావతిలో తిన్నా రుచి మారకూడదు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యత కోసం నాలుగు అంచెల విధానంలో తనిఖీలు ఉండాలని సూచించారు. పౌష్టికాహారంతో కూడిన మెనూతో మధ్యాహ్న భోజనం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత తనిఖీతో పాటు ఫీడ్‌ బ్యాక్‌ కోసం పాఠశాల స్థాయిలో పేరెంట్స్‌ కమిటీలో ముగ్గురు తల్లులను నియమించాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా కమిటీలో చోటు కల్పించాలన్నారు. పేరెంట్స్‌ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ కమిటీ నాడు – నేడు, పారిశుధ్యాన్ని కూడా పరిశీలించాలన్నారు. తనిఖీల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించాలని, క్వాలిటీతో పాటు ఫుడ్‌ సేఫ్టీపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకంపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

నాణ్యత కోసం నాలుగంచెల తనిఖీలు ఇలా..
1. పేరెంట్స్‌ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలి.
2. గ్రామ సచివాలయాల ద్వారా తనిఖీలు నిర్వహించాలి.
3. పొదుపు సంఘాలతో తనిఖీ చేయించాలి.
4. సెర్ప్‌ లేదా మరో సంస్థ ద్వారా తనిఖీ చేపట్టాలి. 

ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ 
మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో ఈ యాప్‌ పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీనిని మెనూ పరిశీలన కోసం ఉపయోగిస్తామని వివరించారు. ఆహార నాణ్యత తనిఖీ కోసం ఉపయోగించే దిశగా కూడా  ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. నాణ్యత తనిఖీల పర్యవేక్షణకు వాడితే బాగుంటుందన్నారు. 

డివిజనల్‌ స్థాయిలో గుడ్ల సరఫరాకు టెండర్లు
గుడ్లు సరఫరా చేయడానికి డివిజనల్‌ స్థాయిలో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో కూడా రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామని అధికారులు వివరించారు. రివర్స్‌ టెండరింగ్‌లో పౌల్ట్రీఫారం యజమానులు ఎవరైనా పాల్గొనేలా నిబంధనలు ఉండాలని సీఎం సూచించారు. నేరుగా పౌల్ట్రీ యజమానులే టెండరింగ్‌లో పాల్గొంటే ధర రీజనబుల్‌గా ఉంటుందన్నారు. చిక్కీ (వేరుశనగ, బెల్లంతో తయారయ్యే పదార్థం) సరఫరాకు స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని, నాణ్యత పాటించాలని సీఎం సూచించారు. చిక్కీ తయారీలో వారికి తగిన శిక్షణ ఇస్తామని అధికారులు వివరించారు. 

‘నాడు–నేడు’ వేగవంతం కావాలి
నాడు–నేడు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, రివాల్వింగ్‌ ఫండ్‌ వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం కింద స్కూళ్లలో పెయింటింగ్, డిజైన్స్, తదితరాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. దీని కోసం రెండు, మూడు డిజైన్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు వివరించగా.. రెండు మూడు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద ఫర్నిచర్, పెయింట్స్, బాత్రూం ఫిట్టింగ్స్, ఫ్యాన్లు కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. కాగా, సమీక్ష అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 45 వేలకు పైగా పాఠశాలల్లో 21 నుంచి మధ్యాహ్న భోజనంలో నూతన మెనూ అమలు చేస్తామని చెప్పారు. మరుగుదొడ్ల నిర్వహణపై కూడా శ్రద్ధ పెడతామన్నారు.  

అమ్మఒడి కింద రూ.6,028.98 కోట్లు పంపిణీ
జగనన్న అమ్మఒడి పథకం కింద 42,32,098 మంది లబ్ధిదారులు ఎంపికవ్వగా, ఇప్పటి వరకు 40,19,323 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున మొత్తం రూ.6,028.98 కోట్ల నగదు బదిలీ అయినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశీలనలో ఇంకా 2,12,775 మంది లబ్ధిదారులున్నారని చెప్పారు. ఈ పథకం విద్యా శాఖలో అత్యంత ప్రతిష్టాత్మకం అని, పిల్లలను బడికి పంపిస్తే మేలు జరుగుతుందన్న భరోసా ప్రజల్లో కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఆ తర్వాత ఇంగ్లిష్‌ మీడియం, నాడు – నేడు కార్యక్రమాలని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియం మీద సెల్ఫ్‌ ఎసెస్‌మెంట్‌ యాప్‌ను వర్కవుట్‌ చేస్తున్నామని, వారంలో తుది రూపు వస్తుందని అధికారులు వివరించారు. ఈ నెల 21న ఆయా పాఠశాలల్లో జరిగే సమావేశంలో మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పారిశుధ్య నిర్వహణ గురించి కూడా వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కమిటీలకు కూడా ఉందని, వారి  పిల్లలు చదివే స్కూల్స్‌ శుభ్రంగా ఉండాలనే భావన ఉండాలని సీఎం అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement