జగన్ బయటకు వచ్చాక తన పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: జగన్ బయటకు వచ్చాక తన పోరాటాన్ని కొనసాగిస్తారని ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు. జగన్‌కు బెయిల్ మంజూరైన అనంతరం ఆమె తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఇకపై ఆయనకు ప్రజలతో మమేకం కావడానికి ఇబ్బందులేమీ ఉండవన్నారు. సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినందువల్ల జగన్ హైదరాబాద్‌లో ఉన్నా జిల్లాల నుంచి పార్టీ వారు వచ్చి ఆయనను కలుస్తారని, పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.
‘నిజంగా దేవుడు చాలా గొప్పవాడు... ఆయన దయతో ఇవాళ జగన్ బయటకు వస్తున్నారు. ఈరోజు కూడా బెయిల్ వస్తుందో లేదో అనే ఉత్కంఠతో గడిపాం... కోర్టులో ఆదేశాలు వెలువడటానికి ముందు కూడా మా న్యాయవాది బెయిల్‌కు ఫిఫ్టీ- ఫిఫ్టీ అవకాశాలు మాత్రమే ఉన్నాయన్నారు. తీర్పు వెలువడుతున్న తరుణంలో నా కాళ్లు వణికాయి. నేనూ వణికిపోయాను. ఏడెనిమిదిసార్లు జగన్ బెయిల్ కోసం న్యాయస్థానాలకు వెళ్లాం కదా... ఏమవుతుందో అనుకున్నాం... బెయిల్ వచ్చింది...’ అని ఆమె ఆనందంతో అన్నారు.
నాలుగైదు రోజులుగా వ్యతిరేక మీడియాలో వచ్చిన కథనాలు తమను కలవరపాటుకు గురిచేశాయని చెప్పారు. ‘బెయిల్ వచ్చిందని నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పినపుడు ఆమె ఏడ్చేసింది... మా అత్తగారు కూడా ఉద్వేగానికి లోనయ్యారు’ అని భారతి ఉద్వేగంతో చెప్పుకొచ్చారు. వాస్తవానికి నాలుగు నెలల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే తమకు సానుకూలంగా పరిణమించాయన్నారు. అపుడు మాకు బెయిల్ రాలేదని బాధ కలిగినప్పటికీ కేసుల దర్యాప్తు పూర్తయిన తరువాత బెయిల్ ఇచ్చే విషయం ట్రయల్ కోర్టు(సీబీఐ కోర్టు) పరిశీలించవచ్చునని అత్యున్నత న్యాయస్థానం అపుడు ఇచ్చిన ఆదేశాలే ఇపుడు బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశాయన్నారు.