‘హోదా’కు తొలి ప్రాధాన్యం | YS Jaganmohan Reddy First priority To Special Status for Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తక్షణ కార్యాచరణ.. ‘హోదా’కు తొలి ప్రాధాన్యం

Published Sat, May 25 2019 3:18 AM | Last Updated on Sat, May 25 2019 7:59 AM

YS Jaganmohan Reddy First priority To Special Status for Andhra Pradesh  - Sakshi

అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు.

సాక్షి, అమరావతి : అఖండ మెజార్టీతో విజయం సాధించి అధికారం చేపట్టనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. జగన్‌ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వేచి చూడకుండా ఈమేరకు ముందే కసరత్తు ప్రారంభించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడం, రాష్ట్ర అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ఆయన కార్యాచరణకు సంసిద్ధమవుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసిన పలువురు సీనియర్‌ అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాల గురించి ప్రాథమికంగా వివరించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. రెవెన్యూలోటు భారీగా ఉందని వివరించారు. రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ కావడంతో రూ.15 వేలకోట్ల  బిల్లులు పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.

శుక్రవారం తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రభుత్వ ఉన్నతాధికారులు 

ఈ నెలలో ఇక అప్పులు చేయడానికి వీల్లేకుండా దిగిపోయే ముందు టీడీపీ ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా ఇక అప్పు పుట్టే పరిస్థితి లేదని జగన్‌ దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జూన్‌ 1వతేదీన జీతాలివ్వాలంటే తక్షణం రూ.4,500 కోట్లు  అవసరమని ఉన్నతాధికారులు వైఎస్‌ జగన్‌కు తెలిపారు. కేంద్రం తక్షణం ఆర్థిక సాయాన్ని ప్రకటించకుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుందని ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సాయాన్ని సాధించడంతోపాటు ప్రత్యేక హోదా సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణపై జగన్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరుసగా రెండోసారి గెలిచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోదీకి అభినందనలు తెలిపేందుకు ఆదివారం ఢిల్లీ వెళుతున్న వైఎస్‌ జగన్‌ తన పర్యటనను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

అస్తవ్యస్తంగా అర్థిక పరిస్థితి 
నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర నిధులు రాబట్టడం, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం అనే ద్విముఖ వ్యూహంతో కార్యాచరణకు సిద్ధమయ్యారు. శుక్రవారం వైఎస్‌ జగన్‌ను కలసిన పలువురు సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు రాష్ట్ర పరిస్థితిని సంక్షిప్తంగా నివేదించారు. రాష్టఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం తక్షణం ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు నివేదించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. 

అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఇంతగా కుదేలవడానికి దారితీసిన పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ అధికారులను ఆరా తీశారు. చంద్రబాబు సర్కారు విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు గుర్తించారు. ప్రాధాన్య క్రమంలో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా బిల్లులు చెల్లించాల్సిన ఆర్థిక శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఐదేళ్లుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టి, దుర్వినియోగం చేసిన టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత కూడా అదే విధంగా వ్యవహరించడం విస్మయపరుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందు రోజే ఏకంగా రూ.2,325 కోట్ల బిల్లులు అస్మదీయులకు అడ్డగోలుగా చెల్లించేశారు. ఈ నెలలో ఇక అప్పు చేయడానికి కూడా వీలులేకుండా టీడీపీ ప్రభుత్వం ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ.2 వేల కోట్లు అప్పు చేసింది. ఫలితంగా రాష్ట్రానికి ఎక్కడా కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి తక్షణం కేంద్ర ఆర్థిక సహాయం పొందడం మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం జగన్‌ గుర్తించారు. అందువల్లే రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడం, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హోదా సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ దిశగా యోచించారు. 

మోదీతో భేటీని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి
వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్ర మోదీని వైఎస్‌ జగన్‌ ఆదివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియచేయనున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు నెరపుతూ ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను సాధించాలన్నది ఆయన ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జగన్‌ నిర్ణయించారు. నరేంద్రమోదీతో మర్యాదపూర్వక సమావేశంలో రాష్ట్ర పరిస్థితిని ఆయనకు వివరిస్తారని తెలుస్తోంది. గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దిగజారి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రధానికి   వివరిస్తారు. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా వైఎస్‌ జగన్‌ కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకతను కూడా వివరిస్తారని తెలుస్తోంది.  

హోదా సాధనకే ప్రథమ ప్రాధాన్యం 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిదని ఆయన మొదటి నుంచి ఆధారసహితంగా చెబుతూ వచ్చారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా సాధన కోసం ఐదేళ్లు అలుపెరగని పోరాటం చేశారు. హోదా సాధనే తన విధానమని ఎన్నికల్లో ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కేంద్ర బిందువుగానే ఢిల్లీతో తమ విధానాలు ఉంటాయని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా సాధనకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ నిశ్చయించుకున్నారని సమాచారం. 

నేడు గవర్నర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ
శనివారం తాడేపల్లిలో వైఎస్సార్‌ సీపీ శాసనసభా పక్ష సమావేశం అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ వెళతారు. సాయంత్రం గవర్నర్‌ నరసింహన్‌ను కలసి శాసనసభాపక్ష తీర్మానాన్ని అందచేస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గవర్నర్‌తో కూడా వైఎస్‌ జగన్‌ చర్చిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  కేంద్రానికి పంపే నివేదికల్లో ఈ అంశాల ప్రాధాన్యతను వివరించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నట్లు సమాచారం. గవర్నర్‌తో సమావేశం అనంతరం వైఎస్‌ జగన్‌ తెలంగాణా సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశక్యత గురించి  చర్చిస్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, ఇతర ప్రయోజనాలను సాధించడంలో తెలంగాణా ప్రభుత్వ సహకారాన్ని కోరతారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల సాధన దిశగా వైఎస్‌ జగన్‌  కార్యాచరణకు ఉపక్రమించడంపట్ల అధికారవర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement