మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పేద, మధ్య తరగతి వర్గాలు మందుకు దూరం..దూరం అంటున్నాయి. మద్యానికి బానిసలుగా మారి కుటుంబం పట్ల నిర్లక్ష్యాన్ని కనబరిచే వారిలో సైతం నేడు మార్పు కనిపిస్తుంది. గత, ప్రస్తుత ప్రభుత్వాల ఒక ఏడాది పాలనను పరిశీలిస్తే ఆ తేడా ఇట్టే అర్థమవుతుంది.ఒక వైపు ఎడాపెడా పెంచిన మద్యం ధరలు సామాన్యుడిగుండెల్లో దడను పెంచాయని చెప్పక తప్పదు. మరో వైపు నిర్ణీత వేళల్లోనే విక్రయాలు చేపట్టడం, బెల్టుషాపులకు స్వస్తి పలకడం, పర్మిట్ రూముల పేరుతో మినీబార్లను తలపించేలా ఉండే సిట్టింగ్‌లకు చెక్ పెట్టడంవంటి ఎన్నో నిర్ణయాలు మద్యం నుంచి ప్రజలను దూరంగా తీసుకువెళ్లేందుకు కారణమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఒంగోలు: గతంలో చంద్రబాబు హయాంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండేవి. మంచినీరు లభించకున్నా మద్యం మాత్రం పుష్కలంగా అందుబాటులో ఉండేదనే అభిప్రాయం నాడు సర్వత్రా వినిపించేది. అర్ధరాత్రి సైతం చీకటి వ్యాపారం బహిరంగంగా సాగేది. మద్యం అమ్మకాలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మనుగడే ప్రశ్నార్థకమంటూ నాటి పాలకులు ప్రజల్లో ఒక అపోహను సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో 2018 మే 30వ తేదీ నుంచి 2019 మే 29 వరకు జిల్లాలో 20,06,110 మద్యం కేసులు, 14,72,258 బీరు కేసులు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో పర్మిట్ రూముల పేరుతో ప్రైవేటు మద్యం వ్యాపారుల వద్ద ఫీజు వసూలు చేయడం, మద్యం షాపులకు లాటరీల నిర్వహణ జరిగాయి. దీంతో ప్రైవేటు వ్యాపారులునిర్ణీత వేళలను పట్టించుకోకపోవడం, బెల్టుషాపులు ఇష్టరాజ్యంగా కొనసాగడం వెరసి చివరకు స్వర్ణాంధ్రప్రదేశ్‌కు బదులుగా మద్యాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందనే విమర్శలు మిక్కిలిగా వినిపించాయి.
కానీ నేడు...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా దశలవారీ మద్య నియంత్రణకు కట్టుబడి జిల్లాలో ఉన్న మద్యం షాపులను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే 2019 మే 30వ తేదీ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రైవేటు వ్యాపారుల లైసెన్స్ జూన్ 30వ తేదీతో ముగిసింది. నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తొలి మూడు నెలలపాటు గతంలో వ్యాపారం నిర్వహించుకునే వారికే రెన్యువల్ చేశారు. అంటే సెప్టెంబర్ 2019 వరకు పాత పద్ధతిలోనే మద్యం వ్యాపారాలు జరిగాయి. 2019 మే 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 6,11,326 మద్యం కేసులు, 5,00,777 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. అదే 2019 అక్టోబరు 1వ తేదీ నుంచి 2020 మే 29వ తేదీ వరకు అంటే 8 నెలల కాలంలో 8,05,525 మద్యం కేసులు, 1,90,129 బీరు కేసుల విక్రయాలు మాత్రమే జరిగాయి. అంటే మొత్తం విక్రయాలు 14,16,851 మద్యం, 6,90,906 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పాత పాలసీ అమలులో ఉన్న నాలుగు నెలల కాలంలో 43.14 శాతం మద్యం విక్రయలు జరగ్గా తరువాత 8 నెలల కాలంలో 56.86 శాతం మాత్రమే జరగడం గమనార్హం. ఇక బీరు విక్రయాలను పరిశీలిస్తే తొలి నాలుగు నెలల పాత పాలసీ కాలంలో 72.48 శాతం బీరు విక్రయాలు జరగ్గా, నూతన పాలసీ అమలులోకి వచ్చిన తరువాత 27.52 శాతం మాత్రమే జరగడం గమనార్హం.
ఎంత వ్యత్యాసం: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఏడాది కాలంలో 20,06,851 మద్యం కేసులు, 14,72,258 బీరు కేసుల విక్రయాలు జరిగితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న తొలి ఏడాది కాలానికి 14,16,851 మద్యం కేసులు, 6,90,906 బీరు కేసుల విక్రయాలు జరిగాయి. పర్మిట్ రూముల రద్దు, ప్రైవేటు మద్యం వ్యాపారం స్థానంలో ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకురావడం, 331 మద్యం షాపులకు గాను తొలి విడత 69 దుకాణాలు రద్దుచేసి 262కు పరిమితం చేశారు. తాజాగా మరలా 2020 జూన్ 1వ తేదీ నుంచి మరో 13 శాతం రద్దుచేస్తున్నట్లు ప్రకటించి మరో 40 షాపులు తగ్గించారు. దీంతో ప్రస్తుతం మిగిలి ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్య కేవలం 222 మాత్రమే. వాటికి కూడా నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం విక్రయాలు నిర్వహిస్తుండడం, ధరలు భారీగా పెంచడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ తగ్గిపోయింది. చాలా మంది మద్యం దుకాణాల వైపు చూసేందుకు జంకుతుండడంతో తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఇన్నాళ్లు మద్యం కోసం వెచ్చించిన వారు నేడు కుటుంబ సంక్షేమం కోసం వెచ్చిస్తున్నారు. అందువల్లే చంద్రబాబు ఏడాది కాలంతో పోలిస్తే మద్యం విక్రయాలు 29.38 శాతం పడిపోగా, బీరు విక్రయాలు 53.08 శాతం పడిపోయాయి. దీనిని బట్టే తొలి ఏడాదిలోనే మద్యం ప్రియుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని స్పష్టం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment