మోపిదేవిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావును పరామర్శించారు. మోపిదేవి అనారోగ్యంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో జగన్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలుకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుటుంబీకులతో కూడా జగన్ మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ సలహాదారు సి.సి.రెడ్డిని కూడా పరామర్శించారు.
మంగళగిరికి చెందిన పార్టీ నేత మున్నంగి గోపిరెడ్డి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తల్లి ఎన్.ధనమ్మ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని వారి వద్దకు కూడా జగన్ వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జగన్‌ను చూడటానికి పెద్ద ఎత్తున జనం తోసుకొచ్చారు. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి కోసం వచ్చిన సందర్శకులు జగన్‌తో కరచాలనం చేయడానికి, పలుకరించడానికి పోటీలుపడ్డారు. పలువురు రోగులు తమ కష్టాలను జగన్‌తో చెప్పుకున్నారు. జగన్‌వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బొబ్బిలి రంగారావు తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌లు కూడా మోపిదేవి, గోపిరెడ్డిలను పరామర్శించారు.