సమైక్యం కోసం చివరి దాకా పోరాడా: తిరుపతి సభలో వైఎస్ జగన్
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుపతిలో నిర్వహించిన వైఎస్ఆర్ జనభేరికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్న పార్టీ వైఎస్ఆర్ సీపీ ఒక్కటేనని, వారి దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి దాకా పోరాడమని చెప్పారు.
రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచేందుకు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సమైక్య శంఖారావం యాత్ర చేశానని గుర్తు చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కయి రాష్ట్రాన్ని విడగొట్టారని జగన్ ధ్వజమెత్తారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు వీలుగా తమ పార్టీ ఎంపీలతో ఓట్లు వేయించారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు సహకరించి పెద్దమ్మ అంటూ ఒకరు.. చిన్నమ్మ అంటూ మరొకరు చెప్పుకొంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు.