నిమ్స్లో దీక్ష కొనసాగిస్తున్న జగన్
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిమ్స్లో తన దీక్షను కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జగన్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. బలవంతంగా ఆయన్ను నిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పోలీసుల సహాయంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
కాగా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు పెద్దసంఖ్యలో దీక్షా శిబిరం వేదికపైకి చొచ్చుకువచ్చి జగన్‌ను బలవంతంగా తరలించడానికి ప్రయత్నించగా ఆయన ప్రతిఘటించారు. తనకు ఏమీ కాదంటూ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. శిబిరం పరిసర ప్రాంతాల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు పోలీసుల ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేదికపైకి చేరుకున్న పోలీసు అధికారులు తొలుత జగన్‌తో చర్చించారు.
ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కసారిగా జగన్‌ను ఎత్తుకుని వేదిక నుంచి అంబులెన్స్ వరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. అన్యాయంగా, నిరంకుశంగా వ్యవహరించి జగన్ దీక్షను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అక్కడున్న నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే జగన్‌ను అంబులెన్స్‌లో ఎక్కించి అక్కడి నుంచి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.