ఇద్దరూ రాజకీయంగా సమకాలికులు.. ఆపై స్నేహితులు.. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసినవారు. ఇద్దరూ కూడా వారు అనుకున్నది చేసినవారే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ దండగ అన్నారు. అనడమే కాదు.. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగమాలిన వ్యవహారంగా మార్చారు. మరొకరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన వ్యవసాయాన్ని పండగ అన్నారు. తన విధానాలతో.. రైతు సంక్షేమ పథకాలతో సాగును నిజంగానే పండగగా మార్చి చూపించారు. ..
♦ 1995 నుంచి 2004 మే వరకు.. సంస్కరణల పేరు తప్ప సంక్షేమం ఊసేలేని చంద్రబాబు సర్కార్. పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులపై పోలీసులను ఉసిగొల్పి కర్కశంగా అణచివేసిన పాలన. దుర్మార్గపు పాలనకు తగినట్టుగా వర్షాభావం.. దీనితో కరువు కాటకాలు.
♦ 2004 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన. రైతులకు రుణమాఫీ.. రుణ ప్రోత్సాహం.. ఉచిత విద్యుత్.. కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్.. ఇలా చెప్పుకుంటూ పోతే రైతే తొలి ప్రాధాన్యంగా సాగిన పాలనాకాలం. ఒక విధంగా చెప్పాలంటే సంక్షేమానికి ప్రకృతి కూడా సహకరించిన కాలం. వ్యవసాయంలో దిగుబడులు.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చిన సమయం.
♦ మోముపై చెక్కుచెదరని చిరునవ్వు.. పల్లెటూరి మోతుబరి రైతులా పంచెకట్టు. అన్నదాత అంటే అంతులేని అభిమానం. రైతే రాజు అని నమ్మిన నైజం.. చివరి వరకూ వారి సంక్షేమానికి పాటుపడుతూ రైతు పక్షపాతిగా పేరొందారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఆయన మృతిచెంది పదేళ్లవుతున్నా నేటికీ ఆయనపై అభిమానం చెక్కు చెదరలేదు.
ఉచిత విద్యుత్
రైతేరాజు అనిపించుకునేలా దివంగత వైఎస్సార్ పాలన సాగింది. 2004లో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే. దీని వల్ల జిల్లాలో మెట్ట, ఏజెన్సీ రైతులతో పాటు కోనసీమలో కొబ్బరి రైతులు సైతం విశేషంగా లబ్ధిపొందారు. అప్పటి వరకు మోటార్‌కు విద్యుత్ బిల్లు నెలకు రూ.250 నుంచి రూ.500 వరకు ఉండేది. ఉచిత విద్యుత్‌తో వీరందరూ లబ్ధిపొందారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మోటార్లకు ఉచిత విద్యుత్ అందింది. తరువాత ఇది కాస్తా 47,500 వరకు విద్యుత్ కనెక్షన్లకు పెరిగాయి. వైఎస్సార్ మృతి తరువాత కూడా ఈ పథకం కొనసాగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రిగా ఎన్నికైనా ఈ పథకాన్ని కొనసాగించాల్సి వచ్చిదంటే రైతుల్లో ఈ పథకం ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని మరింత సమర్ధవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పగటి పూట 9 గంటలు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు.
రుణమాఫీ
2008–09లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రుణమాఫీ ప్రకటించాయి. మన రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రుణమాఫీ సమర్థంగా అమలు జరిగింది. చంద్రబాబు రుణమాఫీలా దఫదఫాలుగా కాకుండా జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల రైతులకు ఒకేసారి మాఫీ చేశారు. సుమారు రూ.450 కోట్ల మేర రైతులు లబ్ధిపొందారు. అప్పటికే సక్రమంగా అప్పులు చెల్లించిన రైతులకు మేలు చేసేలా ఏకంగా రూ.ఐదు వేల చొప్పున రుణ ప్రోత్సాహాన్ని అందించారు. తద్వారా రుణాలు చెల్లించని రైతులకే కాదు.. రుణాలు చెల్లించిన రైతులకు సైతం మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది.
‘పరపతి’ పెంచిన వైఎస్సార్
మెట్ట ప్రాంతంలో 95 శాతం సొసైటీలు అప్పుల ఊబిలో ఉన్నాయి. అమలాపురం డివిజన్‌లో 116 సంఘాలకు గాను 8 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉండేవి. మిగిలిన సంఘాలు దాదాపు రైతులకు అప్పులు ఇవ్వడం తగ్గించాయి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల్లో 70 శాతం సొసైటీల ద్వారా అందేవి. కాగా చంద్రబాబు పుణ్యమా అని అవి 10 శాతానికి పడిపోయాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత సహకార సంఘాల దశ తిరిగింది. వైద్యనాథన్ కమిటీ సిఫార్సులను అంగీకరించడం, వాటి అమలుకు ప్రభుత్వం నాబార్డుతో ఒప్పందం చేసుకుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో సహకార సంఘాల అప్పులు తీరాయి.
జిల్లాలో ఏటా రైతులకు డీసీసీబీ ఆధ్వర్యంలో సంఘాలు రూ.2,500 కోట్ల వరకూ రుణాలిస్తున్నాయి. వైఎస్సార్ పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో రైతులకు రుణాలు కట్టే వెసులుబాటు కలిగింది. వడ్డీ రాయితీ కోసం రైతులు సకాలంలో రుణాలు చెల్లించడం సంఘాలకు మేలు చేసింది. దీనికితోడు రుణాలను రీషెడ్యూలు చేసుకునే వెసులుబాటు రావడంతో సంఘాలు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసి అప్పును తిరగరాస్తున్నాయి. దీని వల్ల 90 శాతం రుణాలు రికవరీ అవుతున్నాయి. మార్క్‌ఫెడ్‌కు వైఎస్సార్ రూ.500 కోట్ల వడ్డీలేని రుణం ఇవ్వడంతో సంఘాల ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల వ్యాపారం జోరందుకుంది. అంతేకాకుండా సంఘాలు మల్టీపర్పస్ సొసైటీలుగా మారాయి.
వరికి బోనస్.. కొబ్బరికి వ్యాట్ మినహాయింపు..
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. కాని రైతులు అడకున్నా మేలు చేసిన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్ ఒక్కరే. 2008లో కేంద్రంలో అప్పటి యూపీఏ సర్కార్ వరికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర కేవలం రూ.50 మాత్రమే పెంచింది. దీని వల్ల తమకు పెద్దగా మేలు జరగదని రైతులు వాపోయారు. దీనిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అదనంగా మరో రూ.50 బోనస్ ఇచ్చారు. దీనితో ధాన్యం పండించిన రైతులు ఎకరాకు, రెండు పంటలకు రూ.3,750 మేర అదనంగా ఆదాయం పొందారు. 1998 నుంచి సంక్షోభంలో చిక్కుకున్న కొబ్బరి రైతులకు మేలు చేసేలా కొబ్బరిపై ఉన్న రెండు శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను రద్దు చేశారు. వలిచిన కొబ్బరికాయను 2007లో కేజీ రూ.9.88 కొనుగోలు చేసేందుకు జీవో జారీ చేశారు.
సాగు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల చేలల్లో నీరు పారిస్తే వ్యవసాయం అగ్రస్థానంలో నిలుస్తుందని వైఎస్సార్ భావించారు. అందుకు తగినట్టుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్లతో జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంతో తూర్పు గోదావరి రైతులకు జరిగిన మేలు అంతా ఇంతా కాదు. రూ.వందల కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం.. పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
డెల్టా ఆధునికీకరణ
గోదావరి డెల్టా ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్ అంచనాలకు మించి నిధులు మంజూరు చేశారు. 2008లో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువల ఆధనికీకరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.3,361 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించి 2007 నవంబరు 27న జీవో 258 విడుదలైంది. దీనిలో జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. మన జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని పంట కాలువలకు 1,170.21 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.485.65 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారు కాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని 2009లో రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజన తరువాత చంద్రబాబు హయాంలో ఆధునికీకరణపై శీతకన్ను వేశారు. బాబు ఐదేళ్ల పాలనలో బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి.
ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ
60 వేల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరందించడం, వరదల విపత్తు నుంచి ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్ 24న జీవో 569 విడుదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. కాలువల ఆధునికీకరణ, గట్లు పటిష్టం చేసే పనులున్నాయి. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో పనులు ప్రారంభం కాలేదు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏలేరు పనులు ఆరంభమయ్యాయి. రెండో దశ పనులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.168.24 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ఏజెన్సీ ప్రాజెక్టులు
ఏజెన్సీలో ప్రాజెక్టుల నిర్మాణానికి దివంగత వైఎస్సార్ జలయజ్ఞంలో శ్రీకారం చుట్టారు. భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టారు. దీనిలో భూపతిపాలెం ప్రాజెక్టు 2007లో ఆరంభమైంది. దీని తొలి అంచనా వ్యయం రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. ఏజెన్సీలో సాగు నీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు వైఎస్సార్ హయాంలోనే 90 శాతం కాగా, పూర్తి అయిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దీనిని ప్రారంభించారు.
‘పుష్కర’తో మేలు
మెట్టకు మేలు చేసే తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్‌ఆర్ శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.600 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశారు. మెట్టలో జగ్గంపేట నుంచి తుని వరకు కొత్తగా 1.86 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది.
నిధులు మంజూరు చేసి... రబీని గట్టెక్కించి..
2009 జనవరిలో గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 8.96 లక్షల ఎకరాల ఆయకట్టుకు నాట్లు దాదాపు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయలేని దుస్థితి. 12 టీఎంసీలకు పైబడి నీరు అవసరముంది. ఈ సమయంలో జిల్లాకు వచ్చిన నాటి సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రబీపై దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలోని కిన్నరసాని నుంచి 1.4 టీఎంసీలు, సీలేరు నుంచి బైపాస్ పద్ధతిలో అదనంగా 5 టీఎంసీల నీరు, గోదావరిలో వృధా నీటిని పంపింగ్ ద్వారా, మురుగునీటి కాలువలకు క్రాస్‌బండ్లు వేసి తోడకం ద్వారా 6 టీఎంసీల నీరు సేకరించే అవకాశముందని ఇందుకు రూ.7.50 కోట్లు ఖర్చవుతుందని నివేదించారు. ‘సీలేరు, కిన్నెరసాని నుంచి నీటిని తెప్పించే బాధ్యత నాది. మీరు అడిగినన్ని నిధులిస్తాను.. డెల్టాలో ఒక్క ఎకరా కూడా ఎండేందుకు వీలు లేదు’ అని వైఎస్సార్ ఆదేశించారు. అంతే ఆగమేఘాల మీద అన్ని అనుమతులూ వచ్చాయి. ఆ ఏడాది డెల్టాలో రబీ రికార్డుస్థాయిలో పండింది.
కాలువ ద్వారా నీరు వస్తోంది
గతంలో వరుస కరువులతో విసిగిపోయాం. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముసురుమిల్లి ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానప్పటికీ కాలువ ద్వారా నీటిని మళ్లించడంతో పదేళ్లుగా రెండు పంటలు పండించుకుంటున్నాం.
– గిళ్ల వెంకన్న, రైతు ఇందుకూరుపేట, దేవీపట్నం మండలం.
అడిగన వెంటనే జీవోలు
ఒకసారి కొబ్బరికి వ్యాట్ మినహాయించాలని మా ప్రాంతం వ్యాపారులు అడిగారు. వైఎస్సార్ పెద్దగా పట్టించుకోలేదు. రైతులంతా వెళ్లి అడిగాం. దీని వల్ల మీకు మేలు ఏమిటని అడిగారు. పన్నుభారం మాపై పడుతోంది.. మినహాయింపు ఇస్తే మేలు జరుగుతుందని చెప్పాం. వెంటనే జీవో ఇచ్చారు. అలాగే కొబ్బరిని మార్కెట్‌యార్డుల ద్వారా కొనుగోలు చేయాలంటే దానికి లాభసాటి ధర ప్రకటించి కొనుగోలు చేసేలా జీవో ఇచ్చారు. రైతులు అడగడమే ఆలస్యం ఆయన వెంటనే జీవోలు జారీ చేశారు.
– ముత్మాల జమ్మి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment