
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజల గుండెల్లో కొలువై ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహిస్తున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను ఆకట్టుకోలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల హృదయాలను దోచుకున్న నిజమైన నాయకుడు రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాజశేఖరరెడ్డి 69వ జయంతిని జిల్లాలో అన్ని గ్రామాల్లో ప్రజలందరూ పండగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ జంక్షన్ (ఏడురోడ్లు కూడలి) వద్ద ఉన్న దివంగత నేత విగ్రహం వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తెల్లదుస్తులతో హాజరు కావాలని సూచించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి 4.30 గంటలకు పార్టీ జిల్లా నూతన కార్యనిర్వాహక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. వైఎస్ జయంతి కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ జిల్లా కో–ఆర్డినేటర్ మడ్డు రాజారావు అధ్యక్షత వహిస్తారన్నారు.
గొప్పలకు పోతున్న సర్కార్
తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నికల ప్రచారంలో ఏటా 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి నాలుగేళ్లలో మూడు లక్షల ఇళ్లే అరకొరగా నిర్మించిందని తమ్మినేని సీతారాం అన్నారు. దీన్ని కూడా పెద్ద ఆర్బాటం చేయడం సిగ్గుచేటన్నారు. అన్ని వర్గాల వారికీ వివిధ సంక్షేమ పథకాలను అందించిన ఘనం కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి మాత్రమే దక్కిందన్నారు.
9న విద్యార్థుల సమస్యలపై డీఈవోకి వినతి
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచుకున్నప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని సీతారాం చెప్పారు. అలాగే కార్పొరేట్ విద్యా విధానంలో టీడీపీకి చెందిన కీలక మంత్రులు ఇద్దరు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసేలా చట్టాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యలపై ఈ నెల 9వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి ఎం.సాయిరాంకు వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర ఆధ్యర్యంలో వినతిపత్రం అందజేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ మెంబర్ అంధవరపు సూరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రధాన రాజేంద్ర, అధికార ప్రతినిధి శిమ్మ రాజశేఖర్, నాయకులు మామిడి శ్రీకాంత్, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, సుగుణారెడ్డి పాల్గొన్నారు.