అభివృద్ధికి చిరునామా | YS Rajasekhara Reddy Schemes Special Story | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి చిరునామా

Published Mon, Jul 8 2019 12:04 PM | Last Updated on Mon, Jul 8 2019 12:04 PM

YS Rajasekhara Reddy Schemes Special Story - Sakshi

వైఎస్సార్‌ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. తరతమ బేధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాయి. అందులో కొన్ని..

ఆరోగ్య శ్రీ
పేదలు, అల్పాదాయ వర్గాల వారికి పెద్ద పెద్ద జబ్బులకు సైతం ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ రాష్ట్ర ప్రజలకు వైద్య ప్రదాతగా మారింది. 18 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

ఉమ్మడి ఏపీలో కేటాయింపులు: 4,610 కోట్లు
విభజిత ఏపీలో కేటాయింపులు: 3,500 కోట్లు

108 అంబులెన్సుల పథకం
వైద్యం కోసం అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన వారు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఫోన్‌ చేసినా అరగంటలో అక్కడికి అంబులెన్సు చేరుకుని రోగిని ఆస్పత్రికి చేర్చాలనే ఉదాత్త ఆశయంతో వైఎస్సార్‌ 108 పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిద్వారా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులు, గుండె జబ్బు బాధితులను తక్షణం ఆస్పత్రులకు చేర్చి వైద్యం చేయించడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు.

ఉమ్మడి ఏపీలో కేటాయింపులు: 611.94 కోట్లు
విభజిత ఏపీలో కేటాయింపులు: 351 కోట్లు

104 సంచార వైద్యశాలలు
మారుమూల ప్రాంతాలకు అంబులెన్సుల్లో వైద్య సిబ్బంది వెళ్లి రోగులకు సాధారణ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులిప్పించాలనే లక్ష్యంతో వైఎస్సార్‌ ఈ పథకాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ఉండి ఆస్పత్రుల వరకు వెళ్లలేక బాధపడే లక్షలాది మందికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడింది.

ఉమ్మడి ఏపీలో కేటాయింపులు: 467.72 కోట్లు
విభజిత ఏపీలో కేటాయింపులు: 279.89 కోట్లు

రైతులకు ప్రోత్సాహకం
అప్పట్లో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ ప్రకటించింది.  అయితే రుణాలు తీసుకుని చెల్లించిన వారికి ప్రయోజనం దక్కలేదు. వీరికి వైఎస్సార్‌ సొంతంగా నగదు అందించారు.

సంతృప్త స్థాయి పింఛన్లు
2004కు ముందు ఉమ్మడి ఏపీలో కేవలం 19 లక్షల మంది మాత్రమే వృద్ధాప్య, వితంతు పెన్షన్‌ పొందుతుండేవారు. అది కూడా మూడు నెలలకొకసారి కేవలం రూ. 70 మాత్రమే వచ్చేది. ఈ జాబితాలోని వ్యక్తులు ఎవరైనా చనిపోతేనే కొత్త వారికి అవకాశం వచ్చే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖరరెడ్డి అర్హులందరికీ (సంతృప్త స్థాయిలో) ప్రతి నెలా ఒకటో తారీఖుకే రూ. 200 పింఛన్‌నుఅందించారు.

 

పొదుపు సంఘాలకు పావలా వడ్డీ
వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా రుణ గ్రహీతల నుంచి 12.25 శాతం నుంచి 14.25 శాతం వరకూ వడ్డీ వసూలు చేసేవి. రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలకు ఈ అధిక వడ్డీ పెను భారంగా ఉండేది. వీరికి వడ్డీ భారాన్ని తగ్గించాలని అప్పట్లో వైఎస్‌ సర్కారు సాహసోపేతంగా పావలా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ పథకం స్ఫూర్తితో ప్రస్తుతం సున్నా వడ్డీ పథకం కూడా అమలులోకి వచ్చింది.  13 జిల్లాల ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 7.68 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, అందులో 2.90 లక్షల సంఘాలు వైఎస్‌ సీఎంగా ఉన్న 2004–09 మధ్యలోనే ఏర్పడడం గమనార్హం.

అభయ హస్తం..
పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తిరస్కరిస్తున్న నేపథ్యంలో వారికి తగిన ఆదాయ భద్రత కల్పించాలనే ఆశయంతో వైఎస్సార్‌.. ‘అభయ హస్తం’ పథకాన్ని రూపొందించారు. తర్వాత కొద్ది రోజులకే ఆయన మరణించినా పథకం కొనసాగింది.  డ్వాక్రా మహిళలు ప్రతి రోజూ రూపాయి చొప్పున, ప్రభుత్వం వారి పేరిట ప్రతి రోజూ రూపాయి చొప్పున ఇన్సూరెన్సు సంస్థకు చెల్లించాలనేది ఈ పథకం ఉద్దేశం. ఇలా చెల్లించిన వారికి 60 ఏళ్ల వయసు తర్వాత ఒక్కొరికి గరిష్టంగా రూ. 2,600 పెన్షన్‌  అందించడం ఈ పథకం ఉద్దేశం.

విద్యాభివృద్ధికి ఎనలేని కృషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయనన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. కేవలం అయిదేళ్ల కాలంలోనే శ్రీకాకుళం, ఒంగోలు, కడప, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వైద్య కళాశాలలను, కడపలో దంత కళాశాలను ఏర్పాటు చేశారు. 

వైఎస్సార్‌ హయాంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాలివీ.. : ఆది కవి నన్నయ వర్సిటీ (రాజమండ్రి), యోగి వేమన వర్సిటీ (కడప), అంబేడ్కర్‌ వర్సిటీ (శ్రీకాకుళం), కృష్ణా వర్సిటీ (మచిలీపట్నం), రాయలసీమ వర్సిటీ (కర్నూలు), విక్రమ సింహపురి వర్సిటీ (నెల్లూరు), శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ (తిరుపతి), శ్రీ వెంకటేశ్వర వేదిక్‌ వర్సిటీ (తిరుపతి), వైఎస్సార్‌ హార్టికల్చర్‌ వర్సిటీ (పశ్చిమగోదావరి), జేఎన్‌టీయూ (కాకినాడ), జేఎన్‌టీయూ (అనంతపురం), రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ (హైదరాబాద్‌), దామోదరం సంజీవయ్య లా వర్సిటీ (విశాఖ), స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (విజయవాడ), తెలంగాణ వర్సిటీ (నిజామాబాద్‌), మహాత్మాగాంధీ వర్సిటీ (నల్గొండ), పాలమూరు వర్సిటీ (మహబూబ్‌నగర్‌), శాతవాహన వర్సిటీ (కరీంనగర్‌), జేఎన్‌ ఆర్కిటెక్చర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీ (హైదరాబాద్‌), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (హైదరాబాద్‌).

పారిశ్రామిక పరుగులు
వైఎస్‌ఆర్‌ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడుల సాధనలో సగటున 54 శాతం వృద్ధి నమోదైంది. పెట్టుబడుల ఆకర్షణలో ఉమ్మడి ఏపీ దేశంలోమొదటి స్థానానికి చేరుకుంది. ఆ స్థాయి వృద్ధిరేటు వైఎస్‌కు ముందుగానీ, తర్వాతగానీ నమోదు కాకపోవడం గమనార్హం. ఐటీ, ఇన్‌ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ ఇలా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే, బయోటెక్నాలజీ పార్క్, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థికమండళ్లు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, కైజెన్‌ టెక్నాలజీస్‌ వంటివి ప్రారంభమయ్యాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌
విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్య అందించే ఆశయంతో వైఎస్సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రూ. 2 వేల కోట్లతో ప్రాంభించారు. ఆ తర్వాత  2012–13కు రూ.5 వేల కోట్లకు చేరింది. ప్రతి సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో 30 లక్షలకు పైన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల లబ్ధిపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లో 16 నుంచి 17 లక్షల మంది విద్యార్థులు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు అర్హులుగా నిలిచారు. అయితే తెలుగు దేశం ప్రభుత్వం అరకొర నిధులు ఇచ్చి పథకాన్ని నీరుగార్చింది.

పోటీపడి‘మన్నవరం’ సాధన
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) విద్యుత్తు ఉపకరణాల తయారీ ప్రాజెక్టును తమ రాష్టానికే సాధించుకోవాలని కర్ణాటక, తమిళనాడు పోటీ పడగా పట్టుబట్టి వైఎస్సార్‌ దీనిని రాష్ట్రానికి తలమానికంగా తీసుకొచ్చారు. అప్పటి ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో కొట్లాడి రాష్ట్రానికి మన్నవరం ప్రాజెక్టు తెచ్చిన ఘనత వైఎస్సార్‌ కే దక్కింది. హైదరాబాద్‌కు బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సు (బిట్స్‌) క్యాంపస్‌ను తెచ్చినఘనతా దివంగతమహానేతదే.

ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు
నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో బాసర (తెలంగాణ), నూజివీడు (కోస్తా),  ఇడుపులపాయ (రాయలసీమ)లో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. వీటిలో చదివిన వేలాది మంది ఇçప్పుడు  ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) కూడా ఆయనే ఏర్పాటు చేయించారు. అప్పట్లో విదేశాలకు వెళ్లడానికి వీసా కావాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వారు కూడా చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో వైఎస్‌ ఎంతో కృషి చేసి హైదరాబాద్‌కు అమెరికన్‌ కాన్సొలేట్‌ జనరల్‌ కార్యాలయాన్ని
తీసుకొచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement