వంశధార ప్రాజెక్టు రెండో దశ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్ నిర్ణయం
నేరడి బ్యారేజీపై ఒడిశా అభ్యంతరంతో కాట్రగడ్డ సైడ్ వియర్ పనులకు తెరతీసిన వైనం
వైఎస్సార్ చిత్తశుద్ధి వల్లే వంశధార ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగిందంటున్న సాగునీటి రంగ నిపుణులు
సాక్షి, అమరావతి: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు, నిబద్ధత, దార్శనికత కారణంగానే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో వంశధార ట్రిబ్యునల్ ఏకీభవించిందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేటాయించిన నికర జలాలతోపాటూ మిగులు జలాలపై పూర్తి హక్కును దక్కించుకోవాలంటే.. వాటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఆది నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చారు.
కృష్ణా ఉపనదులపై కర్ణాటక రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ.. కృష్ణా మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలంటూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. దాంతో బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఇచ్చింది. మిగులు జలాలనూ పంపిణీ చేసింది. దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలపై హక్కును కోల్పోవాల్సి వచ్చింది.
చెప్పిందే చేశారు..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలయ/ê్ఞన్ని చేపట్టారు. 85 ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించారు. ఇదే క్రమంలో 1977 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు రెండో దశకు శ్రీకారం చుట్టారు. నేరడి బ్యారేజీపై ఒడిశా అభ్యంతరాలకు సమాధానం చెబుతూనే.. ఆయకట్టుకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్(మత్తడి) నిర్మించాలని నిర్ణయించారు.
రూ.933.90 కోట్లతో వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులను ఫిబ్రవరి 25, 2005న చేపట్టారు. 2005 నుంచి 2009 వరకూ రూ.657.32 కోట్లను వెచ్చించి పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. మిగిలిన పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.1626.23 కోట్లకు పెంచేసింది. పాత కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని వేటు వేసి అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ.. ఇప్పటికీ మిగిలిపోయిన పనులు మందగమనంతో సాగుతోండటం గమనార్హం.
వంశధారలో న్యాయం...
ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాదనలు ఏడేళ్లపాటు విన్న వంశధార ట్రిబ్యునల్ బుధవారం తీర్పు ఇచ్చింది. కాట్రగడ్డ సైడ్ వియర్‌తోపాటూ నేరడి బ్యారేజీకి ఆమోదం తెలిపింది. వంశధారలో 57.50 టీఎంసీలను వినియోగించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వంశధార రెండో దశను చేపట్టకుండా ఉన్నా.. ముందుచూపుతో ఒడిశా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కాట్రగడ్డ సైడ్ వియర్ చేపట్టకుండా ఉన్నా ఈ రోజున వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ వాదనతో విభేదించి ఉండేదని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధితో వైఎస్ వంశధార ప్రాజెక్టు రెండో దశను చేపట్టడం వల్లే వంశధార ట్రిబ్యునల్ రాష్ట్రానికి న్యాయం చేస్తూ తీర్పును ఇచ్చిందని అధికవర్గాలు వెల్లడిస్తున్నాయి.
వైఎస్సార్ కలలు సాకారం
వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ తీర్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వచ్చిందంటే ఈ ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన చూపించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మిస్తే రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ద్వారా హిరమండలం ప్రధాన జలాశయంలోకి వరద నీటిని మళ్లించి పూర్తిస్థాయిలో నిల్వ చేయవచ్చు. తద్వారా శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
వైఎస్సార్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు చాలావరకూ పూర్తయ్యాయి. మిగిలిన పనులూ పూర్తికావాలంటే వైఎస్ మాదిరి దృఢ సంకల్పం, సహృదయంతో పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంతసేపు ప్యాకేజీలు, కమీషన్లు తెచ్చే ఎత్తిపోతల పథకాలపై తప్ప భారీ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వైఎస్ ముందుచూపు.. వంశధార ట్రిబ్యునల్ తీర్పు
Published Thu, Sep 14 2017 9:11 AM | Last Updated on Sat, Jul 7 2018 3:00 PM
Advertisement
Advertisement