‘నేరడి’ ఆశలు పదిలం | Vamsadhara Project Hopes to cement | Sakshi
Sakshi News home page

‘నేరడి’ ఆశలు పదిలం

Published Sun, Dec 7 2014 2:05 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM

Vamsadhara Project Hopes to cement

 నేరడి బ్యారేజ్(భామిని): వంశధార విస్తరణ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా రైతుల ఆశల పంట పండనుంది. సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగు అందించే ఈ ప్రెజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యుపీఆర్‌ఎస్)లో ఈ ప్రాజెక్టుపై శుక్రవారం మోడల్ సర్వే జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. వంశధార ట్రిబ్యునల్ కమిటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందం శర్మ, సభ్యులు ఎం.ఎస్.చతుర్వేది, గులాం మహ్మద్‌లు ప్రాజెక్టు నమూనా ఆధారంగా వరద ప్రవాహాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందింది. ఒడిశా అభ్యంతరాలతో దశాబ్దాలుగా  అంతర్ రాష్ట్ర వివాదంలో ఈ ప్రాజెక్టు నలుగుతున్న విషయం తెలిసిందే.  దీంతో వంశధార ప్రాజెక్టు స్టేజ్-2లో భాగంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య ట్రిబ్యునల్ కమిటీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలు, పూణే రీసెర్చ్ స్టేషన్‌లో జరిపిన అధ్యయనాల ఆధారంగా సమస్య పరిష్కారానికి మార్గం అన్వేషిస్తోంది.
 
  నమూనా పరిశీలనలో వీగిన ఒడిశా వాదన
  పూనేలో జరిపిన నమూనా పరిశీలనలో తమ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న ఒడిశా వాదన వీగిపోయినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మిస్తే.. నదిలో 6 లక్షలపైచిలుక వరద ప్రహించినప్పుడు దాని బ్యాక్‌వాటర్‌తో తమ రాష్ట్రంలోని 10.5 కి.మీ. ప్రాంతం ముంపునకు గురవుతుందని ఒడిశా వాదిస్తోంది. ఈ నమూనా ప్రయోగంలో 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించగా ఎగువన ఒడిశాలోని 6.5 కి.మీ. లోపే ప్రమాదం ఉంటుందని గుర్తించారు. ఈ పరిశీలన ఒడిశా వాదనను బలహీనపరుస్తోంది. ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు సమస్యపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది. తొలిసారిగా ఈ కమిటీ 2013 ఏప్రిల్ 22న పర్యటించి వివాద స్థలాన్ని, ముంపు ప్రాంతాలను పరిశీలించింది.
 
 2013 మే 13 నుంచి 21 వరకు కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఆంధ్రా-ఒడిశా ఇంజినీరింగ్ బృందాలు నేరడి బ్యారేజ్‌కు ఎగువ, దిగువ ప్రాంతాల్లో రీసర్వే చేసి సీడబ్ల్యుఎస్‌కు నివేదించాయి. తిరిగి ఈ ఏడాది మార్చి 21న ట్రిబ్యునల్ కమిటీ నేరడి బ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది. కాగా గత నెల 25 నుంచి ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ ఒడిశాలో ముంపు నష్టాలు, అవసరమైన రక్షణ గోడలు, వరద గట్ల నిర్మాణ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించడంతో విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుందని వంశధార ప్రాజెక్టు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూణేలో జరిగిన మోడల్ సర్వేలో త్రిసభ్య కమిటీతో పాటు వంశదార ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శివరాంప్రసాద్, ఎస్‌ఈ రాంబాబు, డీఈఈలు నాగేశ్వరరావు, వెంకటరమణలు పాల్గొన్నారు.త్వరలో మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో ఇరురాష్ట్రాల అధికారులు సర్వేలు చేయనున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement