జలసిరులు.. అందరికీ సొంతం కావాలి
జగన్ మాట
శ్రీకాకుళంలో జిల్లాలో
నిర్మాణంలో ఉన్న వంశధార, మద్దువలస, తోటపల్లి, ఆఫ్‌షోర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం.
బాబు పాలనలో..
వంశధార మొదటి దశకు తొమ్మిదేళ్ల టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తంతో కాలువలు తవ్వడం ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయగలిగారు.
రెండోదశ విషయాన్ని ఆ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదు. ఇక మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేయడమే తప్ప విస్తరణ గురించి పట్టించుకోలేదు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ఆలోచనే రాలేదు.
శ్రీకాకుళం జిల్లాలో 2000 నుంచి 2003 వరకూ కరువు కరాళ నృత్యం చేసినా చంద్రబాబుకు పట్టలేదు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు వర్షాధార మండలాలు. వీటికి సాగు, తాగునీరివ్వాల్సిన మడ్డువలస ప్రాజెక్టు విస్తరణ, తోటపల్లి జలాశయం కాలువల తవ్వకంపై శ్రద్ధ చూపలేదు.
వైఎస్ హయాంలో..
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004లో జలయజ్ఞంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు రూ.933 కోట్లతో వంశధార రెండోదశ పనులకు శ్రీకారం చుట్టారు.
* రూ.310 కోట్లతో వంశధార, నాగావళి నదులకుకరకట్టల నిర్మించారు.
* రూ.57 కోట్లతో మడ్డువలస ప్రాజెక్టు విస్తరించారు.
* రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, రూ.452 కోట్లతో తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు మంజూరయ్యాయి.
నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలను వరదల నుంచి రక్షించేందుకు వీలుగా రూ.310 కోట్ల అంచనాతో కరకట్టల నిర్మాణానికి వైఎస్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తొలివిడతగా రూ.30 కోట్లు మంజూరు చేసింది.
మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు జలయజ్ఞం కింద రూ.160 కోట్లు మంజూరు చేశారు. ఎచ్చెర్ల మండలానికి నీరు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ నిధులు మంజూరు చేశారు.
మహేంద్రతనయ నదిపై రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ జలాశయాన్ని వైఎస్ మంజూరు చేశారు. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నందిగాం, పలాస మండలాలకు సాగునీరుతో పాటు పలాసకు తాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో టీడీపీ హామీ ఇచ్చినా నెరవేరలేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో చేర్చి తొలి విడతగా రూ.20 కోట్లు మంజూరు చేశారు.
తోటపల్లి బ్యారేజ్‌ను జలాశయంగా మార్చే ప్రాజెక్టుకు అప్పట్లో రూ.452 కోట్ల అంచనాతో మంజూరు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, రణస్థలం, లావేరు, వంగరతో పాటు మరికొన్ని మండలాల్లో 48 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టు లభిస్తుంది. రాజశేఖరరెడ్డి హయాంలో రూ.400 కోట్ల వరకు మంజూరు కాగా, 80% పనులు పూర్తయ్యాయి.
వైఎస్ మరణానంతరం..
వైఎస్సార్ మరణం cరువాత సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్ జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు పెద్దగా మంజూరు చేయలేదు. దీంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి.
బడ్జెట్లలో జరిపిన అరకొర కేటాయింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయేవి. ఈ కారణంగానే జిల్లాలో అదనపు ఆయకట్టు సాగులోకి రాలేదు.
ఒడిశా రాష్ట్ర అభ్యంతరం పేరుతో వంశధార రెండోదశ పనులు నిలిపివేశారు. వాస్తవానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే పనులు ఆగిపోయాయి.
వైఎస్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగాలి. పనులు నిలిచిపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాల భూములకు నీరందడం లేదు.
గొట్టా బ్యారేజీ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది.
వంశధార రెండోదశ ప్రాజెక్టుకు అంచనా వ్య యం మరో రూ.150 కోట్లకు పెరిగింది.
నిధులు లేక నాగవళి, వంశధార తీర గ్రామాల్లో కరకట్టల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు నిధులు విడుదల చేయకపోవడంతో కాలువ నిర్మాణాలు నిలిచిపోయాయి.
మహేంద్ర తనయపై ఆఫ్‌షోర్ పనులూ నిలిపివేశారు. తోటపల్లి జలాశయం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడంతో అంచనా వ్యయం రూ.100 కోట్లు పెరిగింది.
అసంపూర్తిగా ఎత్తిపోతల పథకం
వైఎస్ మరణానంతరం ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మా ప్రాంతం లో వంశధార కుడి కాలువపై నిర్మించిన అక్కులపేట ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉంది. దీంతో శివారు భూములకు సాగునీరు అందడంలేదు. పంటలు పండక వలస పోతున్నాం.
- గొరివెళ్లి కృష్ణమూర్తి, రైతు, పొన్నాంపేట, ఆమదాలవలస మండలం
వైఎస్ ఉన్నపుడే ప్రాజెక్టు పనులు జరిగాయి..
మా భూములన్నీ వర్షాధారమే. సాగునీరు లేక భూములన్నీ బీడువారాయి. మా కష్టాలను చూసిన వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తోటపల్లి, మడ్డువలస ఫేజ్-2 సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఆయన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చురుగ్గా జరిగేవి. మరి కొద్దిరోజుల్లో సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయి నీరు రాక పంటలు పండటం లేదు.
- లంకలపల్లి తవిటియ్య, రైతు, కేశవరాయునిపురం, లావేరు మండలం
రెండు పంటలు పండించుకుంటున్నాం
మడ్డువలస ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆశలు చిగురించాయి. కాలువల ద్వారా సాగునీరు సకాలంలో అందుతుండటంతో ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు సకాలంలో మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. అంతకముందు సాగునీరు లేక వ్యవసాయంపై విరక్తి కలిగి వలసపోయాం. వైఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం ఆనందానిచ్చింది.
- కారు లక్ష్ముం, కేఎం వలస, రేగిడి మండలం
‘వంశధార’తో మహర్దశ
వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరుచేసిన వంశధార ప్రాజెక్టుతో మా జిల్లా రైతాంగానికి మహర్దశ పట్టింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నిలిచిపోయాయి. తరువాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. రెండు పంటలకు నీరందించేందుకు తలపెట్టిన రిజర్వాయర్ పనులు జగన్ సీఎం అయితేనే పూర్తవుతాయి.
- చింతాడ అప్పలనాయుడు, రైతు, తురకపేట, ఎల్‌ఎన్ పేట