అసెంబ్లీ తీర్మానంపై మాట తప్పారేం? | YS Vijayamma asks Union government on Assembly resolution | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ తీర్మానంపై మాట తప్పారేం?

Published Sun, Jan 5 2014 2:01 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

అసెంబ్లీ తీర్మానంపై మాట తప్పారేం? - Sakshi

అసెంబ్లీ తీర్మానంపై మాట తప్పారేం?

విభజన విషయంలో ప్రజాప్రతినిధులెవరికీ సరైన సమాచారం ఇవ్వకుండా, ఎనిమిదిన్నర కోట్ల మందికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు.

యూపీఏకు వైఎస్ విజయమ్మ ప్రశ్న
 విభజనకు ఎందుకు వ్యతిరేకమో చెబుతూ
 స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలసి లేఖ


 సాక్షి, హైదరాబాద్: విభజన విషయంలో ప్రజాప్రతినిధులెవరికీ సరైన సమాచారం ఇవ్వకుండా, ఎనిమిదిన్నర కోట్ల మందికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎందుకు హడావుడి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్ష నాయకురాలు వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని డిసెంబర్ 9, 2009లో కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటించిన విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయనగానే అసెంబ్లీ తీర్మానం ప్రస్తావన లేకుండా యూపీఏ ప్రభుత్వం ఎందుకు మాట తప్పుతోందని మండిపడ్డారు. ఈ విభజన ప్రక్రియను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి విజయమ్మ శనివారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. విభజనను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలియజేస్తూ పార్టీ శాసనసభాపక్షం రూపొం దించిన 11 పేజీల లేఖను స్పీకర్‌కు అందించారు. ఈ లేఖపై మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, ప్రసన్నకుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, భూమన కరుణాకర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులతో కలసి   విజయమ్మ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. విభజనకు సంబంధించిన  సంప్రదాయాలను, పద్ధతులను యూపీఏ ప్రభుత్వం ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. శాసనసభలో ‘సమైక్య తీర్మానం’ చేసిన తర్వాతే చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ హయాంలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా కూడా సంబంధిత రాష్ట్రాల చట్ట సభల్లో తీర్మానాలు ఆమోదించాకే విభజనపై ముందుకెళ్లారని చెప్పారు. అటువంటి  విధానాన్ని ఇక్కడెందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పదిహేను రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఉన్నా ఎందుకు పట్టించుకోవడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. ఒక ప్రాతిపదిక ఆధారంగా గత సంప్రదాయాల మేరకు ప్రక్రియ జరిగిన తర్వాతే విభజనపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

 కలిసుంటేనే అభివృద్ధి..

 ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎయిర్‌పోర్టులు, సీ-పోర్టులు కలిసి ఉన్నప్పుడే సాధ్యమవుతుందని విజయమ్మ అన్నారు. 42 ఎంపీ స్థానాలతో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం, విభజన జరిగితే 17 ఎంపీలు ఒకవైపు, 25 ఎంపీలు మరోవైపు ఉండి బలహీనమై ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చిదంబరం గారిని అడుగుతున్నా? తమిళులకు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు. అదేమాదిరిగా తెలుగువారికి కూడా మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాన్ని ఎందుకు విభజిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.  ‘‘విభజన వల్ల తెలంగాణ కూడా బాగా నష్టపోతుంది. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ను నిలబెట్టుకోవాలన్నా రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాణ హిత నిర్మించాలి. కానీ దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అని చెబుతున్న యూపీఏ ప్రభుత్వం నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారన్నది చెప్పలేదు? సర్కారియా, పూంఛి కమిషన్, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అన్నీ కూడా ఒక సంప్రదాయం ప్రకారం... తీర్మానాలు చేసిన తర్వాతే విభజన చేయాలని చెప్పాయి. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆధ్వర్యంలో 2010 ఫిబ్రవరిలో భోపాల్‌లో ఏర్పాటైన 74వ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో కూడా రెండో ఎస్సార్సీ పెట్టాల్సిన అవరముందన్నారు’’ అని తెలిపారు.

 నీటి పంపకాల మాటేమిటి?

 కలిసి ఉన్నప్పుడే నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంటే ఇక విభజించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలకు యూపీఏ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందని విజయమ్మ ప్రశ్నించారు. దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రం ప్రాజెక్టులు నిర్మించుకుని, ఎత్తు పెంచుకుంటుంటే, ఇక్కడ చంద్రబాబు మాత్రం ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. 2000 సంవత్సరంలోపే మనం కూడా ప్రాజెక్టులను నిర్మించి ఉంటే ఈరోజు ఆల్మట్టి ప్రాజెక్టు మాదిరే మనకు కూడా నికర జలాల కేటాయింపు జరిగేదన్నారు. ‘‘ఈ రోజు మిగులు జలాలపై హక్కును కోల్పోవాల్సి వచ్చింది.. 2056 టీఎంసీలను బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు ఇచ్చిందంటే అది చంద్రబాబు చేసిన పాపమే. ఇలాంటి పరిస్థితుల్లో విభజన జరిగితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉప్పునీరు తప్పితే మంచి నీరు ఎక్కడిది? దీనికి యూపీఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని ఆమె అన్నారు. ‘‘మన అదృష్టమో, దురదృష్టమోగానీ ఏ పరిశ్రమ వచ్చినా అన్నీ హైదరాబాద్‌లోనే నిర్మించాం.. 60 ఏళ్లు కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ లాంటి మరో రాజధానిని కేవలం పదేళ్లలో నిర్మించుకోవడం సాధ్యమేనా? సీమాంధ్రలో విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప మరేముంది? వారి జీవనాధారానికి ఏ దారి చూపిస్తారు? సీమాంధ్రలో సంక్షేమం, ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఎలా ఇస్తారు?’’ అంటూ కేంద్రంపై విజయమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement