
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ వివేకానందరెడ్డి
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
కడప: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడారు. అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే.. కడపలో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబునాయుడు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
అమ్ముడు పోయేందుకు తామేమీ అంగట్లో సరుకులం కాదని.. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు నిరూపించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికలు అవినీతికి, విలువలకు మధ్య జరిగే పోరాటమని, తాము 200కి పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తామని వైఎస్ వివేకానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాలలో త్వరలో ఖాళీ కానున్న శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పోలింగ్ తేదీ మారే సూచనలు కన్పిస్తున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గాలకు చెందిన ఎన్నికల పోలింగ్ కూడా వచ్చేనెల 17న జరగనుండటమే ఇందుకు కారణం.