రాజన్నా... నిను మరువలేమన్నా... | YSR birth anniversary | Sakshi
Sakshi News home page

రాజన్నా... నిను మరువలేమన్నా...

Published Sun, Jul 9 2017 2:31 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM

రాజన్నా... నిను మరువలేమన్నా... - Sakshi

రాజన్నా... నిను మరువలేమన్నా...

మహానేత జయంత్యుత్సవంలో ఘోషించిన ప్రతి గుండె
ఆయన సంక్షేమ పథకాలు నెమరువేసుకున్న జనం
జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్సార్‌ జయంతి
పార్టీలకతీతంగా వైఎస్‌ విగ్రహాలకు నివాళులు
పాలాభిషేకాలు, సేవా కార్యక్రమాలు

జనహితం నీ యోగం... జనం కోసం నీ యాగం... ప్రజా సంక్షేమమే నీ అభిమతం... ప్రతి అడుగూ అభివృద్ధికోసం... అంటూ ప్రతి మనసూ గుర్తు చేసుకుంది.  మా అండ దండవై నిలబడ్డావ్‌... మా గుండె గుండెలో కొలువైనావ్‌... ఓ మడమ తిప్పని యోధుడా మాటిస్తావా... మళ్లీ వస్తానని... అంటూ మహానేతను మనస్ఫూర్తిగా తలచుకున్నారు. ఆర్ద్రత నిండిన హృదయంతో నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లా ప్రజలు అత్యంత ఘనంగా శనివారం నిర్వహించారు. పార్టీలకు అతీతంగా... పేద... గొప్ప తేడా లేకుండా... ప్రతి ఒక్కరూ ఆయన్ను కొలిచారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని వైఎస్సార్‌సీపీ అగ్రనేతలంతా పార్టీ జాతీయ ప్లీనరీకి తరలివెళ్లారు. కానీ జిల్లాలోని కేడర్‌ మాత్రం మహానేత వైఎస్‌ జయంతి ఘనంగా నిర్వహించింది. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ పరిధిలో ఆయన జయంతిని మనస్పూర్తిగా నిర్వహించారు. పేదలకు, వృద్ధులకు దుస్తులు, పండ్లు పంచిపెట్టారు. కేకులు కోసి రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటూ తీపి ఆశను పంచుకున్నారు.

 విజయనగరం నియోజకవర్గంలో మహానేత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపువేణు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, యువజన విభాగం నాయకులు బోడసింగి ఈశ్వరరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమాల్లో భాగంగా స్థానిక వెంకటలక్ష్మీ థియేటర్‌ జంక్షన్‌ వద్ద వైఎస్‌ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. మున్సిపల్‌ కార్యాలయం జంక్షన్, దాసన్నపేట ప్రాంతాలతో పాటు మండలంలోని జొన్నవలస, అయ్యన్నపేట ప్రాంతాల్లో మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి సీఎంగా రాష్ట్రానికి వైఎస్‌ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

 నెల్లిమర్ల నియోజకవర్గంలోని నెల్లిమర్ల మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాల్లోనూ వైఎస్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లిమర్ల పట్టణంలోని రామతీర్థం, మొయిద జంక్షన్‌లో ఉన్న  వైఎస్‌ విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు దంతులూరి శంకర సీతారామరాజు, నెల్లిమర్ల జూట్‌ మిల్లు శ్రామిక సంఘం ప్రధాన కార్యదర్శి పతివాడ అప్పారావు, విశాఖ జూ మాజీ డైరెక్టర్‌ నక్కాన వెంకటరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చీపురుపల్లిలో మండ ల విద్యార్థి విభాగం ప్రతినిధి రెడ్డి జగదీష్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ జయంతిని పురస్కరించుకుని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద మొక్కలు నాటారు.  వైఎస్సార్‌ సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బెల్లాన రవి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. గుర్ల మండలం కెల్ల జంక్షన్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పలువురు విద్యార్థులు పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించారు.

 గజపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలం తామరాపల్లి గ్రామంలో కోడెల ముత్యాలనాయుడు, శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. గజపతినగరంలోని గంగచోళ్ల పెంటలో సర్పంచ్‌ బోని అచ్చెయమ్మ, తాటితూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. గ్రామంలో పండ్లు పంచారు. కురుపాంలో జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, అధికార ప్రతినిధి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. మొండెంఖల్‌ గ్రామంలో ఎంపీపీ ఇందిరాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు.  

 బొబ్బిలి పట్టణంలో డమ్మా అప్పారావు, ఎస్‌.రామకృష్ణ, ఎస్‌.శ్రీధర్‌ ఆధ్వర్యంలో శనివారం వైఎస్‌ఆర్‌ జయంతి నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. సామాజిక సేవాకార్యకర్త బొగ్గుపద్మజ ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పెద్దింటి మనోజ్‌కుమార్‌(బాబీ) ఆధ్వర్యంలో యువత 300మంది పేదలకు బియ్యం, సీహెచ్‌సీలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాలూరు మున్సిపాలిటీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు,  మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ముగడ గంగమ్మ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్‌ పంచారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్‌ జిల్లా నాయకుడు మేడిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. మెంటాడ మండలం కుంటినవలసలో సర్పంచ్‌ ఎర్రా సింహాచలం ఆధ్వర్యంలో వైఎస్సార్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పిట్టాడ, పెదతామరాపల్లిలో కూడా క్షీరాభిషేకాలు జరిపారు. పార్వతీపురం పట్టణంలో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ మంత్రి రవికుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి  పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement