జనం కోసమే జగన్ దీక్ష
పట్టం గట్టిన ప్రజల నోట్లో మట్టికొడుతున్న చంద్రబాబు సర్కారుపై సమరానికి సిద్ధం కావాలని వైఎస్సార్ సీపీ నేతలు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకే పార్టీ అధినేత జగన్ నిరశనదీక్షకు ఉద్యుక్తులవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఊరూరా ప్రచారం చేసి, సర్కారు నిజస్వరూపాన్ని ప్రజలకు విప్పిచెప్పి, పాలకులకు గుణపాఠం చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
సాక్షి, రాజమండ్రి :వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరిలో పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేపట్టే రెండురోజుల నిరశన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్ష సందర్భంగా కార్యాచరణపై చర్చించేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు.. రాజమండ్రి హోటల్ జగదీశ్వరిలో సోమవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జగన్ దీక్షకు ఉపక్రమిస్తున్నారని చెప్పారు. చేసిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే గోడును ప్రధాన ప్రతిపక్షానికి చెప్పుకోవాలని రైతులు చూస్తున్నారన్నారు. అధికారంలోకి రాక ముందు చంద్రబాబు ఏం చెప్పారు, వచ్చాక ఏం చేస్తున్నా చేస్తున్నదేమిటి అన్నదానిపై నాడు, నేడు అంటూ ఊరూరా ఫ్లెక్సీలు కట్టి ఎండగట్టాలన్నారు.
ఇది కోతల సర్కారు : సాయిరెడ్డి
పార్టీ ప్రధాన కార్యదర్శి, త్రిసభ్య కమిటీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలకు మధ్యలో ఉంటుందన్న ఉద్దేశంతోనే నిరశన దీక్షకు జగన్ తణుకును ఎంపిక చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని సమష్టి కృషితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్, పెన్షన్లు ఇలా అన్నింటిలో కోత పెడుతోందని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
గుణపాఠం నేర్పుదాం : ధర్మాన
పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన మాట్లాడుతూ పార్టీ జగన్ దీక్ష ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలబడలేక పోతోందని ప్రజలను నమ్మించాలని కుయుక్తులు పన్నుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తి, ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగట్టాం. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తత్తరపాటుకు గురయ్యారు. అందుకే కొత్త గేమ్‌కు తెరలేపింది. ఈ దీక్షలను విజయవంతం చేయడం ద్వారా ప్రజల పక్షాన మనం గట్టిగా నిలబడతామన్న ప్రజల విశ్వాసానికి బలం చేకూర్చాలి’ అన్నారు.
వాగ్దానాలను మూటకట్టారు : జ్యోతుల
జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల మాట్లాడుతూ రైతుల ఆశలపై నీళ్లు జల్లి, నిరుద్యోగ యువతకు నిరాశ మిగిల్చి, ఇచ్చిన వాగ్దానాలను మూట కట్టేసిందని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కంటక విధానాలను తిప్పికొట్టే ధైర్యం మాకుందని పార్టీ శ్రేణులు చాటి చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రతి కార్యకర్తా బాధ్యతాయుతమైన సైనికుల్లా వ్యవహరించి అధినేత దీక్షను విజయవంతం చేయాలని, టీడీపీ నేతల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఊరూరా ప్రచారం చేయండి : బోస్
మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ చంద్రబాబు మోసాన్ని గ్రామ గ్రామాన ప్రజలకు విడమరిచి చెప్పాలని, రైతాంగాన్ని ఉద్యమం దిశగా నడిపించాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ దీక్షను విజయవంతం చేసేందుకు తమ జిల్లా శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నారన్నారు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జగన్ దీక్షకు మద్దతు పలికేందుకు గుంటూరుజిల్లాలో కూడా రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.
తణుకు మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ బాండ్లంటూ ప్రభుత్వం ఇచ్చిన కాగితాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని బ్యాంకులు తిప్పి పంపుతున్నారన్నారు. చంద్రబాబు మోసపూరిత వ్యక్తిత్వాన్ని రైతులు ఇప్పుడు గమనిస్తున్నారన్నారు. నరసాపురం పార్లమెంటు నియోజక వర్గ నాయకుడు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు జగన్ దీక్షను విజయవంతం చేయాలన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు గతాన్ని విస్మరించి, నమ్మిన రైతులు మరోసారి నిండా మునిగారన్నారు. గతంలో క్రాప్ హాలిడే ద్వారా రైతు ఉద్యమమంటే ఏంటో జిల్లా రైతులు చూపించారన్నారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా సాగుతున్న దీక్షను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. తణుకు కో ఆర్డినేటర్ చీర్ల రాధయ్య మాట్లాడుతూ ఎన్నికల తర్వాత జగన్ చేస్తున్న తొలి దీక్షను విజయవంతం చేసేందుకు తామంతా సిద్దంగా ఉన్నామన్నారు.
సమావేశంలో పార్టీ కార్యదర్శి తలశిల రఘురాం, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, చిర్ల జగ్గిరెడ్డి, పూడి ముత్యాలనాయుడు, మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామినాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, కుడుపూడి చిట్టబ్బాయి, గొల్ల బాబూరావు, తానేటి వనిత, తెల్లం బాలరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రాష్ట్ర కార్యద ర్శులు కొల్లి నిర్మల కుమారి, గుండా వెంకటరమణ, సంగిశెట్టి అశోక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, సంయుక్త కార్యదర్శి కర్రి నారాయణ, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, వివిఢధ అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆకుల వీర్రాజు, కొండేటి చిట్టిబాబు,
వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, తోట సుబ్బారావునాయుడు, చెల్లుబోయిన వేణు, తోట గోపి, తలారి వెంకట్రావు, పార్టీ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చల్లా మధుసూదనరెడ్డి, వివిధ విభాగాల కన్వీనర్లు అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, మార్గాని గంగాధర్, శెట్టిబత్తుల రాజబాబు, గారపాటి ఆనంద్, గుర్రం గౌతమ్, రాజమండ్రి కౌన్సిల్‌లో ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, సాకా ప్రసన్నకుమార్, అప్పారి విజయకుమార్, పెట్టా శ్రీనివాస్, వట్టికూటి రాజశేఖర్, డీసీసీబీ డెరైక్టర్ శంకరరావు, గోపాలపురం మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, అత్తిలి సీతారామస్వామి, ట్రేడ్‌యూనియన్ జిల్లా కార్యదర్శి అల్లి రాజబాబు, పార్టీ నాయకులు పి.కె .రావు, మిండగుదిటి మోహన్, తాడి విజయభాస్కరరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు, ఆర్‌వీవీ సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.