ప్రణాళిక ప్రకారమే దుష్ర్పచారం
ప్రణాళిక ప్రకారమే దుష్ర్పచారం
Published Fri, Jan 31 2014 1:24 AM | Last Updated on Sat, Aug 18 2018 4:06 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: దేశంలో మొట్టమొదటి సారిగా తక్కువ సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగిందని, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుని తిరుగులేని శక్తిగా మారుతోందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. మరో పార్టీని బలపరి చే విధంగా, ప్రజల్లో ఆయోమయాన్ని సృష్టించడానికి ఆంధ్రజ్యోతి పత్రిక ప్రణాళిక ప్రకారం తప్పుడు కథనాలను ప్రచురిస్తోం దని చెప్పారు. తనపై తప్పుడు వార్తలను ప్రచురిస్తుండడాన్ని ఆయన ఖండించారు.
బొబ్బిలి కోటలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడచిన అయిదారు రోజులుగా ముఖ్యనేతలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీని వీడుతున్నట్లు ఆ పత్రిక ప్రచారం చేస్తుండ డం దురదృష్టకరమన్నారు. ప్రచారం చేసే ముందు ఆ నాయకుల అనుమతి, ఆలోచన తెలుసుకుని కథనాలు రాయాల్సి ఉన్నా సంబంధం లేని అంశాలతో మరో పార్టీకి లబ్ధి చేకూర్చడానికే ఇటువంటివి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ కొంత మందిని ప్రణాళిక ప్రకారం వైఎస్‌ఆర్‌సీపీలోకి పంపించి కీలక సమయాల్లో వాళ్లచేత పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయిస్తోందని ఆరోపించారు. అటువంటి వారిని పార్టీ ఏరివేసి త్వరలో బయటకు పంపించడం ఖాయమన్నారు. ఇటీవల రాష్ట్రంలో పలువురు నాయకులపై ఆంధ్రజ్యోతి వ్యతిరేకకథనాలు రాయడం,
వారు వాటిని ఖండిస్తున్నా ఇంకా అటువంటివి రాస్తుండడం దురదృష్టకరమన్నారు. తాను ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన పనులు నిర్వహిస్తున్నానన్నారు. పార్టీలో జరిగే అనేక అంశాలపై అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తన సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారన్నారు. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో జగన్‌మోహనరెడ్డికి తెలుసని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిపై అచంచల విశ్వాసం ఉన్నందునే ఆయన జైలులో ఉన్నా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరారన్నారు. గత ఉప ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించామన్నారు. అంతకంటే మెరుగైన ఫలితాలు రానున్న రోజుల్లో వస్తాయన్నారు. ప్రజలు కోరుకునే నాయకులనే అభ్యర్థులుగా పెట్టి రాష్ర్టంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు కూడా గెలుచుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తామన్నారు.
రాజకీయ నాటకాలు మానాలి
జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సమైక్య నిర్ణయం వల్ల తెలంగాణలోని కొంత మంది పార్టీ అభిమానులు మనస్తాపం చెందినా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడే చివరకు ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో వైఎస్‌ఆర్‌సీపీ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం, తెలంగాణలో చర్చను అడ్డుకోవడం వంటి రెండు కళ్ల సిద్ధాంతాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. విభజన అంశంపై వైఎస్‌ఆర్‌సీపీకి చాలా స్పష్టత ఉందన్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పటినుంచి పార్టీ వ్యవహరిస్తున్న తీరును అందరూ తప్పుబట్టారని, చివరకు వైఎస్‌ఆర్‌సీపీ బాటలోనే సీఎం కూడా నడిచారన్నారు.
అసెంబ్లీలో ఓటింగ్ జరగకుండా కాంగ్రెస్ పార్టీ వ్యూహాం పన్నిందన్నారు. రాజకీయ నాటకాలు మానకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Advertisement