
జగన్‌కు బెదిరింపులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తే అడ్డుకుంటామని బెదిరిస్తున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమొక్రసీ పార్టీల నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న ఖమ్మంలో వైఎస్ జగన్ తలపెట్టిన బహిరంగ సభను అడ్డుకుంటామని కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టువంటివని, అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న పార్టీలు, నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధులు గట్టు రామచంద్రారావు, బి.జనక్‌ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సోమవారం భన్వర్‌లాల్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కీ, ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతరులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని, మానుకోట వంటి సంఘటనలు పునరావృతమవుతాయని భయోత్పాతాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టే నేతలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన భన్వర్‌లాల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటుందని, పోలీసు అధికారులను కలవాలని సూచించారు.