
ఐటీడీఏ ఎదుట బైఠాయించిన ఎమ్మెల్యే కళావతి, గిరిజన సంఘ నాయకులు
శ్రీకాకుళం, సీతంపేట: తుపాను ప్రభావిత ప్రాంతాలుగా గిరిజ న గ్రామాలను గుర్తించాలని డిమాండ్ చేస్తూ జనం రోడ్డెక్కారు. సీతంపేట ఐటీడీఏ ఎదుట సోమవారం భారీ ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, గిరిజన సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సీతంపేట నుంచి ఐటీడీఏ వరకు తొలుత ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ సమావేశ మందిరం ఎదుట నిరసన తెలియజేశారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతితో పాటు గిరిజన సంఘాల నాయకులు అక్కడ బైఠాయిం చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంటనష్టం అంచనా వేయడంలో వైఫల్యం చెందారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో సర్వే ఎందుకు చేయలేదంటూ ప్రత్యేకాధికారి చిన్నరాముడు, తహసీల్దార్ అమల, పరిపాలనాధికారి ఆనందరావులను నిలదీశారు. పీహెచ్‌వో సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అంతా అరవకుండా ఉంటే సమాధానం చెబుతానని పరుషంగా అనడంతో మా గోడు వినిపిస్తుంటే అరుస్తున్నారంటావా అంటూ ఎమ్మెల్యే కళావతితో పాటు గిరిజనసంఘం నాయకులు బి.అప్పారావు, పి.కుమార్, సాంబయ్య, తిరుపతిరావు ఒక్కసారిగా ఆగ్రహం చెందారు. ఒకానొక సందర్భంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పీహెచ్‌వోపై అట్రాసిటీ కేసు పెట్టాలంటూ నినాదాలు చేశారు. గిరిజనులంటే అంతచులకనా అంటూ ఆగ్రహించారు. చివరకు పీహెచ్‌వో క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
సర్వేకు గడువు పెంచాలి....
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ పంటనష్టం సర్వేకు పక్షం రోజులు గడువుపెంచి పూర్తిస్థాయిలో సర్వే చేయకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. గిరిజనులు పండిస్తున్న అన్నిరకాల పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉసిరి, కంది, చింత, పైనాపిల్ తదితర పంటలన్నింటికీ పరిహారం ఇవ్వాలన్నారు. కీసరజోడు, చిన్నబగ్గ, పూతికవలస, కొండాడ, కడగండి తదితర పంచాయతీల పరిధిలో తుపాను కారణంగా భారీగా నష్టం వాటిల్లినా అసలు సర్వే జరగలేదన్నారు. ప్రత్యేకాధికారిని సర్వే కోసం నియమించలేదన్నారు. ఇక్కడ ఐటీడీఏ పీవోను మందస వేయడం ఎంతవరకు సమంజసమన్నారు. మరో అధికారిని సీతంపేటకు నియమించాల్సి ఉన్నా పదిరోజుల తర్వాత నియమించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వీఆర్‌వోలు ఇష్టానుసారంగా సర్వే చేస్తున్నారన్నారు. గ్రామాలకు వెళ్లి గిరిజనులు లేరని వచ్చేస్తున్నారన్నారు. నాగులుగూడకు ఇప్పటి వరకు మంచినీరు లేదన్నారు. కొండపోడు పట్టాలు ఇచ్చి ఆ భూముల్లో పంటలు నాశనమైతే ఎటువంటి పరిహారం ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొండచీపురు, ఉసిరి వంటివాటిని ఎందుకు గుర్తించలేదన్నారు. పడిపోయిన ఇళ్లు, పాకలు ఏవీ పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. వీటిని కూడా లెక్కిస్తామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు జరగలేదన్నారు.
నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి
ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలను తుపాను ప్రభావిత ప్రాంతంగా గుర్తించి నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని గిరిజన సంఘం నాయకులు బి.అప్పారావు,పి.కుమార్, సాంబయ్యలు డిమాండ్ చేశారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా లేదని వెంటనే పునరుద్ధరించాలన్నారు. జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నా ఈ ప్రాంతాన్ని ఇంతవరకు సందర్శించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. సీతంపేట మండలానికి కేటాయించిన ప్రత్యేకాధికారి సరిగా విధులు నిర్వహించడం లేదని ఆరోపించారు. వాటిల్లిన నష్టంపై సమగ్రసర్వే చేయాలన్నారు. తుపాను జరిగిన వెంటనే నివేదిక ఇస్తే ఇంతవరకు పట్టించుకోలేదెందుకంటూ ఐటీడీఏ పరిపాలనాధికారిపై ఆగ్రహం చెందారు. సరిగా సమాధానం చెప్పే అధికారులే లేరంటూ.. ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు వాబయోగి, అఖిలభారత రైతు కూలీసంఘం జిల్లా నాయకుడు బైరీ కూర్మారావు, ఎంపీపీ ఎస్.లక్ష్మి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ జి.సుమిత్రరావు, మహిళా కల్వీనర్ ఎ.కళావతి, మాజీ సర్పంచ్‌లు ఎస్.రాము, గోపాలు, చెంచయ్య, సాయికుమార్,బి. పకీర్, పార్టీ నేతలు కె.నర్రయ్య, ఎన్.అబ్బాస్,ఎస్.రమేష్, వి.చలపతి, రాజ్‌కుమార్, చంద్రశేఖరరావు,ఎం.ఫల్గుణరావు, గిరిజన సంఘం నాయకులు గంగాధర్, శ్రీరాములు, ఎం.తిరుపతిరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment