సాక్షి, అమరావతి : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యాలయాలన్ని పండగ వాతావరణాన్ని తలపించాయి.
గుంటూరులో..
గుంటూరు జిల్లా రేపల్లెలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో నేతలు జెండా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని.. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మోపిదేవి వెంకటరమణ కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు అనేక మోసపూరిత వాగ్ధానాలు, ప్రజలను తప్పు దోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తారని.. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై ఉందని మోపిదేవి వెంకటరమణ అన్నారు.
శ్రీకాకుళంలో..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పార్టీ జెండా ఎగురవేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ జెండా ఎగురవేశారు. శ్రీకాకుళం లో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్నారు. తొమ్మిదేళ్లలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రజలకు అత్యంత చేరువ అయిందని ప్రజా సమస్యల పరిష్కారాల కోసం జగన్ పోరాట పటిమను చూపించి విజయం సాధించారన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి రామా థియేటర్ సెంటర్ వరకు కార్యకర్తలు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దాడిశెట్టి రాజా కేకే కట్ చేసి పార్టీ జెండా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే రాష్త్రంలో సంక్షేమ పాలన వస్తుందని దాడిశెట్టి రాజా అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా కనిగిరిలో వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత తొమ్మిదేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిందని... పార్టీని బలోపేతం చేయడంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సఫలీకృతమయ్యారన్నారు. జగన్‌ను సీఎం చేసుకుంటే ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతోందన్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనను వ్యతిరేకించి ప్రజా సమస్యలపై పోరాటానికి వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని పార్టీ నేతలు అన్నారు. అవినీతి అరాచక పాలనను తరిమికొట్టాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ అధ్యక్షుడు బి వై రామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పశ్చిమగోదావరి జిల్లాలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్‌లో నియోకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసిన అనంతరం... కేక్ కట్‌చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమే అని నాయకులు అన్నారు. రాష్ట్రప్రజలకు తమ పార్టీపై పూర్తి విశ్వాసముందని ధీమా వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైఎస్సార్ సీపీ రూపొందించిన సంక్షేమ పథకాల వివరాలను గ్రామ స్తాయిలోకి ప్రతి ఒక్కరికి చేరాలని పార్టీ నేత కోన రఘుపతి కార్యకర్తలకు సూచనలు చేశారు.
వైఎస్సార్ కడప జిల్లాలో..
వైఎస్సార్ కడప జిల్లా రాయచోటిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 9వ వార్షికోత్సవ వేడుకలను ఆ పార్టీ నేతలు ఘనంగా జరుపుకున్నారు . రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డితో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయంలో మహనేత వైఎస్సార్ చిత్రపటానికి, విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తేలుపుకున్నారు. ఎనిమిదేళ్లు ప్రజల పక్షాన నిలబడటంతో పాటు ప్రజా సంక్షేమం కోసం పాటు పడిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేతలు కొనియాడారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలే తన ఎజెండా పనిచేస్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభివర్ణించారు.
విశాఖపట్నంలో..
విశాఖలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు జెండాను ఆవిష్కరించారు. నేతలు, కార్యకర్తలు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్ర ప్రజలు రాజన్న పాలనను కోరుకుంటున్నారని త్వరలోనే వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి వస్తున్న ప్రజాధరణను చూసి టీడీపీ వెన్నులో వణుకు పుడుతోందని నేతలన్నారు.
అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను నియోజకవర్గ సమన్వకర్త గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూనే ఉందన్నారు. మరో నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అమర్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అమర్‌నాథ్ అన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment