హైదరాబాద్: అన్యాక్రాంతమైన తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణలో టీటీడీ అధికారులు అనుసరిస్తున్న వైఖరీపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు బుధవారం మండిపడ్డారు. అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మాట్లాడుతూ... టీటీడీ అధికారులకు వీఐపీ దర్శనంపై ఉన్న శ్రద్ధ... ఆస్తుల రక్షణపై లేదని ఆరోపించారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా టీటీడీకి కోట్ల ఆస్తులున్నాయని గుర్తు చేశారు. వాటిని పరిరక్షించాలన్న ఆసక్తి టీటీడీ అధికారుల్లో కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడి ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు డిమాండ్ చేశారు.