సాక్షి, గుంటూరు :వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు పొందిన మనమంతా ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టి ఆ మహానేత రుణాన్ని తీర్చుకుందామని ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి పిలుపునిచ్చారు. నరసరావుపేటలో గురువారం రాత్రి జరిగిన వైఎస్సార్ జనభేరి కార్యక్రమంలో ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చే రారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువనేత జగన్‌కు అండగా ఉందామని, రాజన్న ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకెళదామని చెప్పారు. రాజశేఖరరెడ్డి కంటే తెగువ, ధైర్యం, కష్టపడే తత్వం ఎక్కువగా ఉన్న నాయకుడు జగన్ అని, అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తే దేశానికి, రాష్ట్రానికి, మన ప్రాంతానికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.
తిరస్కరించిన వారి కోసమే కిరణ్ పార్టీ..
వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఖాళీలు లేక, టీడీపీలో చేరలేక మిగిలిపోయిన వ్యక్తుల కోసమే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడుతున్నారని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు, సోనియాలు ఏకమైనా కిరణ్‌కుమారెడ్డి పార్టీ పెట్టినా జగన్ ను ఏమీ చేయలేరన్నారు. పార్టీ కృష్ణా, గుంటూరు జిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబానికి తీరని అన్యాయం చేసిందన్నారు.
బాబు వస్తే జాబు పోయే..
జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా జగన్‌ను ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకోలేరన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ ఉ మ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జాబు కావాలంటే బాబురావాలని టీడీపీ నినాదంగా తీసుకుందని, వాస్తవానికి జాబు పోవాలంటే చంద్రబాబు రావాలని ఎద్దేవాచేశారు. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తల్లిలాగా తనను ఆదరించినందుకు జగన్‌కు రుణపడి ఉన్నానన్నారు. నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటున్నారని, వాస్తవానికి వారికి కూడు, గూడు, గుడ్డ అందించడమే ముఖ్యమని పేర్కొన్నారు.
ఫ్యాన్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులురావి వెంకటరమణ మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు పాల్పడ్డాయని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనరు విజయచందర్ మాట్లాడుతూ, చంద్రబాబు, సోనియా, బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని వల్లకాడు చేశాయని విమర్శించారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయ కర్త కోన రఘుపతి మాట్లాడుతూ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనన్నారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్ అని అభివర్ణించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దాది వెంకట లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి లేకుండా మూడున్నరేళ్లపాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వైఎస్ జగన్ వ్యాట్ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా నరసరావుపేటలో ధర్నా చేసి వ్యాపారుల కష్టాలు తీర్చాడన్నారు.
తాను తీసిన గోతిలోనే..
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీ తాను తీసిన గోతిలో తానే పడిందన్నారు. గుంటూరు తూర్పు సమన్వయకర్త షేక్ షౌకత్ మాట్లాడుతూ ఇటలీ సోనియా తెలుగు వారిని రెండు ముక్కలు చేసిందని విమర్శించారు. పెదకూరపాడు నియోజకవర్గం సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడి వద్ద పనిచేస్తున్నందుకు ప్రతి కార్యకర్త గర్వపడాలన్నారు. గుంటూరు నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలు ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోటీ అన్నారు. తెనాలి నియోజకవర్గం సమన్వయకర్త కిలారు రోశయ్య మాట్లాడుతూ చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని నమ్ముకొని రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యాడన్నారు. సభలో పార్టీ నేతలు మేరిగ విజయలక్ష్మి, బండారు సాయిబాబా, నర్సిరెడ్డి, సయ్యద్‌మాబు, దేవళ్ల రేవతి, కావటి మనోహర్‌నాయుడు తదితరులు ప్రసంగించారు.