సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జయకేతనం
అనంతపురం జిల్లాలో సొసైటీల ఎన్నికల్లో రైతుల తీర్పు
ఏడింటిలో ఆరు పీఏసీఎస్‌లు కైవసం
జేసీ బ్రదర్స్, మంత్రి శైలజానాథ్ ఎత్తుల చిత్తు
కాంగ్రెస్-టీడీపీల దోస్తీకి చెంపపెట్టు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీల కుయుక్తులకు చెంపపెట్టులా రైతులు తీర్పునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది క్రితం సహకార ఎన్నికలు జరిగిన విషయం విదితమే. అనంతపురం జిల్లాలో 116 ప్రాథమిక సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు గానూ 109 సొసైటీలకు మాత్రమే నాడు ఎన్నికలు జరిగాయి. శాంతిభద్రతల సాకుచూపి తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, వేములపాడు, శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు, రాప్తాడు నియోజకవర్గంలోని పి.యాలేరు, రామగిరి, కదిరి నియోజకవర్గంలోని తలుపుల, పెనుకొండ నియోజకవర్గంలోని బూదిలి పీఏసీఎస్‌ల ఎన్నికలను నాడు వాయిదా వేశారు. వాటికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా.. ఏడింటికి ఆరు పీఏసీఎస్‌లను వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు.
జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరేందుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో తమ నియోజకవర్గంలోని వేములపాడు, పెద్దవడుగూరు పీఏసీఎస్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గంలోని పుట్లూరు సొసైటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకునే బాధ్యతను జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంత్రి శైలజానాథ్ అప్పగించారు. ముందే కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్-టీడీపీలు సంయుక్తంగా మద్దతుదారులను బరిలోకి దించాయి.
డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు గ్రామాల్లో భయోత్పాతాన్ని సృష్టించారు. అయినప్పటికీ పుట్లూరు, పెద్దవడుగూరు సొసైటీలను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు భారీ మెజారిటీతో గెలుచుకున్నారు. పెద్దవడుగూరులో 13 డెరైక్టర్ల స్థానాలుం డగా ఒక అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికలు జరగలేదు. వేములపాడు సొసైటీని సీపీఐ మద్దతుతో వైఎస్సార్ సీపీ చేజిక్కించుకోనుంది. జేసీ సోదరుల కోటలో ఈ గెలుపు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డిని అభినందిస్తూ భారీ ఎత్తున ఊరేగింపు జరిపారు.
టీడీపీ నేతల దౌర్జన్యం..: టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి, పి. యాలేరు సొసైటీలకు జరిగిన ఎన్నికల్లో పోలీసుల సాయంతో సునీత సోదరుడు బాలాజీ భయోత్పాతం సృష్టించారు. వైఎస్సార్ సీపీ నేతలు ముకుందనాయుడు, అమర్‌నాథ్‌రెడ్డిలు ప్రయాణిస్తోన్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. అయినప్పటికీ పోలీసులు.. వైఎస్సార్ సీపీ నేతలనే అరెస్టు చేశారు. భయోత్పాతాని సృష్టించడం ద్వారా రామగిరి సొసైటీని టీడీపీ మద్దతుదారులు చేజిక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప (టీడీపీ) సొంత మండలం గోరంట్ల పరిధిలోని బూదిలి పీఏసీఎస్‌ను వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు.