'విజయమ్మ దీక్ష భగ్నానికి కాంగ్రెస్, టీడీపీల కుట్ర'
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర భేరీ దీక్షను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుట్రపన్ని భగ్నం చేశాయని ఆ పార్టీ అధికర ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. శనివారం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
గత అర్థరాత్రి విజయమ్మ దీక్షపై పోలీసులు వ్యవహారించిన తీరు పట్ల జూపూడి ఆగ్రహాం వ్యక్తం చేశారు. సమరభేరి దీక్షతో తీవ్ర అనారోగ్యానికి గురైన విజయమ్మను పోలీసు వ్యాన్లో తీసుకువెళ్లడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ముందుగా అంబులెన్స్ను ఎందుకు సిద్ధం చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కు అయి విజయమ్మ దీక్షను భగ్నం చేశాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతలకు సమన్యాయం కోసం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆ అంశంపై మిగతపార్టీలు గోడమీద పిల్లివాటంలా తయారయ్యాయని అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన మహా ఉద్యమంగా భావిస్తున్నామని జూపూడి ప్రభాకర్ రావు అభివర్ణించారు.