‘పెత్తందారీ ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు’ | Jupudi Prabhakar Rao Takes On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పెత్తందారీ ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు’

Published Mon, Apr 1 2024 7:43 PM | Last Updated on Mon, Apr 1 2024 8:14 PM

Jupudi Prabhakar Rao Takes On Chandrababu Naidu - Sakshi

అంబేద్కర్‌ ఆలోచనకు చంద్రబాబు భిన్నం.

పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి 

పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నదే ఆయన అహంకారం

చట్టసభల్లోనూ దళిత, బలహీనవర్గాల వాణి వినిపించాలన్నదే సీఎం జగన్‌ తపన

ఇతర కులాలతో ఎస్సీల వివాహాలపై చంద్రబాబు వ్యాఖ్యలు అభ్యంతరకరం

రాజ్యాంగంలో రాసిన కుల వ్యతిరేక పోరాటం వైఎస్‌ఆర్‌ కుటుంబంలో ఉంది

ఎస్సీ, బీసీల్ని పదేపదే అవమానించి.. టిప్పర్‌ డ్రైవర్లకూ వైఎస్సార్‌సీపీ సీట్లు ఇస్తోందన్న.. బాబును క్షమించే ప్రసక్తే లేదు

ఊరూరా తిరగబడి చంద్రబాబు కూటమిని ఓడించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా సిద్ధం

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు  జూపూడి ప్రభాకర్‌రావు

సాక్షి, తాడేపల్లి:  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నం అని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి అని వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు  జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజమెత్తారు. పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు, బీసీల్నీ పదే పదే అవమానించి, టిప్పర్‌ డ్రైవర్లకు వైఎస్సార్‌సీపీ సీట్లు ఇస్తోందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. 

జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..

విభిన్న ప్రచారశైలిలో పెత్తందారీ పార్టీలు
ప్రస్తుత ఎన్నికల రణరంగంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గత ఐదేళ్లల్లో  పేదల పక్షాన నిలబడి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను, చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను చెప్పుకుంటూ పోతుంది. కానీ, ఏరోజూ పేదలను పట్టించుకోనటు వంటి అవతల వర్గం మాత్రం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పెత్తందారీ పోకడలతోనే ప్రచారంలో ఉంది. ముగ్గురు కలిసినా ప్రజలు వాళ్లను ఆదరిస్తారో లేదో కూడా అర్ధం కానటు వంటి పరిస్థితి. అందువల్ల ఆ పార్టీలు ఒకరికొకరు సఖ్యత లేకుండా అవతలగానే ఉండిపోతున్న స్థితి.  పేదల కష్టసుఖాలు, వారి ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడుతుంటే.. మిగతా పార్టీల ఎన్నికల ప్రచారశైలి మాత్రం ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా భిన్నంగా ఉందన్న సంగతి చూస్తున్నాం. 

పెత్తందార్ల ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు
పెత్తందారీ ప్రయోజనాల కోసం ఒక కిరాయి మనిషిలా చేతల్లోనే కాకుండా.. మాటల్లోనూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మొన్న శింగనమల అభ్యర్థి వీరాంజనేయులను ఉద్దేశించి.. టిప్పర్‌ డ్రైవర్‌కు సీటిచ్చి నిశానీలుగా వారిని వాడుకుని, వాళ్లద్వారా సంతకాలు పెట్టించుకుని వైఎస్‌ఆర్‌సీపీ ఏలాలని చూస్తుందంటూ ఎగతాళి చేశారు.

అదే మా పార్టీ అధినేత శ్రీ వైఎస్‌ జగన్‌ మాత్రం.. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా సహస్ర వృత్తులు టిప్పర్‌ డ్రైవరైనా, çప్లంబర్, మేసన్, వెల్డర్, కుమ్మరి, చాకలికి గానీ.. అనేక వత్తులకు గౌరవం తేవడానికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్లనటువంటి ఈ వర్గాలను చట్టసభల్లో నిలబెట్టి వాళ్ల వర్గాల తరఫున వారు మాట్లాడుకునేలా చూడాలని ఆయన  తపిస్తున్నారు.

బాబూ.. నీకూ సీఎం జగన్‌కు ఉన్న వ్యత్యాసమిది
రెండెకరాలతో రాజకీయం మొదలుపెట్టి లక్షల కోట్లకు నువ్వు ఏ విధంగా ఎదిగావో అందరికీ తెలుసు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీలు ఏనాడూ దృష్టి పెట్టలేదు. అయితే, నువ్వు మాత్రం దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాల్లోని పేదలంతా మీ చెప్పుచేతల కింద మోచేతి నీళ్లు తాగుతూ బతకాలని కోరుతున్నావు. ఏంటి మీ పెత్తందారీ అహంకారం..? మీతో సరిసమానంగా ఉండే హక్కు దళితులకు లేదనుకుంటున్నావా..? ఉన్నా ఉపయోగించుకోరాదని నుకుంటున్నారా..? 

ఇప్పుడు మీరునుకుంటున్న పెత్తందారీ పోకడలకు కాలం చెల్లింది. మాకు కొండంత అండగా శ్రీ వైఎస్‌ జగన్‌ ఉన్నారు. అదే నీకూ.. మా జగన్‌ గారి మధ్య ఉన్న వ్యత్యాసం. 

మేం బాగు పడితే మీకెందుకంత కడుపుమంట?
పేద కుటుంబాల పిల్లలకు చదువు ఖరీదు కాకూడదని అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందించే ప్రభుత్వాన్ని అవహేళన చేస్తావా చంద్ర బాబూ..? ఉచిత విద్యను అందించే బడులను బాగుచేసి కార్పొరేట్‌ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లుతో పాటు తరగతి గదుల్లో ఇంగ్లీషు పాఠాలు చెబుతుంటే.. పేదలకు ఇంగ్లీషు బోధన అవసరమా..? అంటూ కోర్టులకెళ్లి మరీ అడ్డుకుంటావా..? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ట్యాబ్‌లిస్తే మీకంత కడుపు మంట ఎందుకు..?

పేద వర్గాలకు కొండంత అండగా సీఎం జగన్‌
మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ మొదట్నుంచీ ఒక విషయం పదేపదే చెబుతున్నారు. పేదలు.. పెత్తందారీ వర్గం మధ్య జరుగుతోన్న యుద్ధమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అన్నారు. రూ.2.70 లక్షల కోట్లను పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించి పేదవర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి జగన్‌గారు. బ్యాంకు అకౌంట్లు పెత్తందారీ అగ్ర వర్ణాలకే కాదు. దళిత, బీసీ, మైనార్టీలకూ ఉంటాయని, అకౌంట్లలో డబ్బులు నేరుగా జమ అవుతాయని నిరూపించిన పేదల పక్షపాతి ప్రభుత్వం ఇది. 

మా సంక్షేమం జోలికొస్తే ఊరుకోబోం
చంద్రబాబూ.. బహిరంగ సభల్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమౌతుందా..? నీకు పిచ్చి పట్టిందో, వయస్సు పెరిగి చాదస్తం పెరిగిందో.. లేదంటే, ఎన్నికలవగానే పారిపోదామనుకుంటున్నావో అర్ధం కావట్లేదు. కానీ, మా నాయకుడు జగన్‌ గారు చేస్తోన్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల జోలికొస్తే మాత్రం దళిత, బీసీ, మైనార్టీల వర్గాలు ఊరుకోరు. మిమ్మల్ని, మీతో పాటు వచ్చే పార్టీలను తరిమి తరిమి కొడతారు. 

తండ్రీకొడుకులకు పరిపాలనా అర్హతే లేదు
పేదవాడికి , బడుగు బలహీనవర్గాలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని నువ్వంటే.. నీకూ, నీ కొడుకుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకెక్కడిదని చంద్రబాబు, లోకేశ్‌లను అడుగుతున్నాను. నీ కొడుకు ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిన మంత్రిపదవిలో కూర్చొని ఏం చేశాడు..? అతనికి ఉన్న అడ్మినిస్ట్రేషన్‌ స్థాయి ఎంత..? పరిపాలన, పేదల బతుకుల పట్ల అతనికున్న అవగాహనేంటి..? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పరిపాలన ఏంటి..? మీ పరిపాలనలో మీ కులస్తులు, మీకు కొమ్ముకాసే అగ్రవర్ణాలు తప్ప ప్రయోజనాలు పొందిన వారెవరు..? ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే.. 2019లో మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారు.అయినా మీ వైఖరి మారలేదు. అందుకే రాష్ట్రంలో పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా మీపై తిరగబడే రోజులొచ్చాయి. 

అంబేద్కర్, ఫూలే అంటే మీకు నచ్చదా..?
చంద్రబాబు హయాంలో అంబేద్కర్‌ విగ్రహం పెడతానన్నాడు. అది ఎటు పోయిందో ఏం చేశాడో తెలియదు. కానీ, అదే అంబేద్కర్‌ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు విజయవాడ లో నిలబెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఆవిష్కరించా రు. కనీసం, ఏ ఒక్కరోజైనా ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు రెండు పువ్వులు అంబేద్కర్‌ గారి పాదాల దగ్గర పెట్టారా..? అంటే, అంబేద్కర్, ఫూల్‌ గారంటే మీకు నచ్చదా..?   

అంబేద్కర్‌ రాజ్యాంగమంటే మీకు గౌరవం లేదా..?
ఎస్సీలు రెడ్లను పెళ్లి చేసుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్‌లకు వస్తారా.. అంటూ మాట్లాడుతున్నావే.. నీకసలు బుద్ధుందా చంద్రబాబూ..? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానంటావే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా చెప్పుకుంటావే.. మరి, ఇన్నాళ్లలో నువ్వు ఏనాడూ అగ్రవర్ణాలను వివాహమాడిన ఎస్సీలకు సీట్లివ్వలేదా..? అంటే, అంబేద్కర్‌ గారు పెట్టిన కులనిర్మూలనకు, రాజ్యాంగంలో రాసుకున్న దానికి మీరు వ్యతిరేకమా..?

కుల వ్యతిరేక పోరాటంలో వైఎస్‌ఆర్‌ కుటుంబం
కుల నిర్మూలన గానీ.. కులం అనేది ఈ దేశంలోనే ఉండరాదని రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని ఆచరణలో చూపినటు వంటి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడిగారి కుటుంబ గొప్పదనం గురించి నీకు తెలుసా చంద్రబాబూ..? రాజశేఖర్‌రెడ్డి గారి మేనత్తలంతా ఎస్సీలను చేసుకున్నోళ్లు కాదా..? నీ కుటుంబంలో .. నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్‌క్యాస్ట్‌ మ్యారేజ్‌ జరిగిందా..? ఒక ఎస్సీని, ఒక బీసీని పెళ్లి చేసుకున్న చరిత్ర నీదగ్గర ఉందా..? 
ఆయా వర్గాలన్నింటినీ కూలోళ్లుగా మీ ఇళ్లల్లో పనిచేయించుకున్నారే గానీ.. వాళ్లను వివాహమాడి మీ ఇంట్లో భాగస్వామ్యం కల్పించలేని అహంకారివి నువ్వు. అలాంటి నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలు ఏవిధంగా అర్ధమౌతాయి. 

బాబును క్షమించే ప్రసక్తేలేదు.. తరిమి కొడతాం
చంద్రబాబును ఏ విధంగా.. ఎందుకు క్షమించాలి..? ఇదే చంద్రబాబు గతంలో ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని అవమానించాడు. బీసీలనైతే నోరెత్తితే తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇలాంటి నీచమైన భావజాలం ఉన్న నాయకుడ్ని ఊరూరా దళిత వాడల్లో జనం అడుగడుగునా నిలదీయండి. అంబేద్కర్‌ విగ్రహాన్ని తాకనటువంటి నువ్వు.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని నువ్వు.. ఎస్సీ నాయకులపై నోటికొచ్చిన విధంగా మాట్లాడే నువ్వు.. ఈ రాష్ట్ర పరిపాలనకు అర్హుడివి కాదు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు.

రాష్ట్రంలోనే గొప్ప సంస్కరణవాదిగా మా నాయకుడు జగన్‌ ఉన్నారు గనుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఆయన పక్షాన నిలుస్తున్నారు. అందువల్ల ఆయనే తిరిగి సీఎం అవుతారని జూపూడి స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement