సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫ్రీ వపర్
దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే.. అంటే 2019, జూలై 25న, జీఓ జారీ చేశారు. ఆ విద్యుత్ సబ్సిడీ మొత్తం ప్రభుత్వం భరిస్తుందని అందులో ప్రకటించారు. ఆ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు రూ.2,362 కోట్లు, 4,57,686 గిరిజన కుటుంబాలకు రూ.483 కోట్ల మేర ప్రయోజనం కల్పించారు. అంటే మొత్తంగా 19,86,603 కుటుంబాలకు రూ.2846 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేశారు.
ఉచిత విద్యుత్‌కు చంద్రబాబు సర్కార్ మంగళం
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారన్న కక్షతో, కూటమి ప్రభుత్వం ఒక హేయమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడింది. నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా సరే, బిల్లులు జారీ చేస్తోంది. బకాయిలు కూడా కట్టాలంటూ, వేలకు వేల బిల్లులు ఇస్తూ, కట్టకపోతే, నిర్దాక్షిణ్యంగా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. మీటర్లు తొలగిస్తున్నారు. స్పష్టమైన ఉత్తర్వులు (జీఓ) జారీ చేయకుండా చీకటి ఆదేశాలతో విద్యుత్ సిబ్బందిని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పంపి, అర్థరాత్రి సమయంలో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ప్రశ్నించిన దళిత, గిరిజన కుటుంబాలను, మహిళలను విద్యుత్ అధికారులు మాటల్లో చెప్పలేని విధంగా దూషిస్తూ, హేళన చేస్తూ దౌర్జన్యకాండ ప్రదర్శించారు.
ప్రభుత్వ దమనకాండకు ఉదాహరణలు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపవరంలో కొల్లి విమల అనే గృహిణి ఇంటికి రూ.22 వేల బిల్లు ఇచ్చి, అది కట్టలేదంటూ కనెక్షన్ తొలగించారు. అదే గ్రామంలో మరొకరికి రూ.40 వేల బిల్లు ఇచ్చి చెల్లించాలని, ఈనెల మరో రూ.20 వేల బిల్లు కూడా ఇచ్చి దానిని కూడా కలిపి కట్టాలని చెప్పి కనెక్షన్ కట్ చేశారు. రాఘవాపురంలో ప్రతి ఇంటికి దాదాపు రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లుల బకాయిలు చూపుతూ కనెక్షన్లు తొలగించారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రూ.35 వేల బిల్లు చెల్లించాలంటూ ఓ దళిత కుటుంబాన్ని చీకటిమయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎ.మల్లవరంలో అర్థరాత్రి ఎస్సీ కాలనీలోకి విద్యుత్ అధికారులు చెప్పాపెట్టకుండా వెళ్ళి కూటమి పార్టీలకు మీరు ఓట్లు వేయలేదు, మీకు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తామంటూ వారి కనెక్షన్లు బలవంతంగా తొలగించారు. దీనిపై ప్రశ్నించిన దళిత మహిళలపై దుర్భాషలాడారు. అర్థరాత్రి మొత్తం గ్రామాన్ని చీకట్లో కూర్చోబెట్టారు. విద్యుత్ బిల్లు చెల్లిస్తాం కనీసం రెండు రోజులు గడువు ఇవ్వాలని వారు వేడుకున్నా కూడా పట్టించుకోలేదు.
ఎస్సీ ఎస్టీలు కళ్ళు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుంది
ఎస్సీ, ఎస్టీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై దారుణం. ఒకవేళ వారు కళ్లు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని ఈ పాలకులు తట్టుకోలేరు. ఏ ఉత్తర్వులు ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు? మీ వద్ద దానికి సంబంధించిన లిఖిత ఆదేశాలు ఉన్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇష్టం లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓను రద్దు చేస్తున్నామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి మీరు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కానీ దొంగదారిలో దళిత, గిరిజన కాలనీలపై కక్ష సాధింపులకు పాల్పడటం ఏ మాత్రం తగదని జూపూడి ప్రభాకర్‌రావు తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment