కేకేఎన్ అన్బురాజన్
సాక్షి, కడప : జిల్లాలో కరోనా వైరస్‌పై వారం రోజుల్లో పూర్తి గ్రిప్ వస్తుంది. 14 రోజులకు ప్రాబ్లమ్ క్లియరవుతుంది. 28 రోజులు లాక్‌డౌన్ పాటిస్తే నూటికి నూరు శాతం కరోనా వైరస్‌ను జిల్లా నుంచి పారదోలుతామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.ప్రజల సహకారంతోనే లాక్‌డౌన్ విజయవంతమవుతోందని చెప్పారు. శుక్రవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలనుంచి ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానాలు ఇచ్చారు.
ప్రశ్న : లాక్‌డౌన్ ఆంక్షలు ఎలా అమలు చేస్తున్నారు?
ఎస్పీ : లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేస్తున్నాం. కరోనా పాజిటివ్ ప్రాంతాలు, బయటి ప్రాంతాల్లో టూ వీలర్‌లో ఒకరికి చొప్పున అనుమతి ఇస్తున్నాం. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఉదయం 6 నుంచి 9 గంటల్లోపు మాత్రమే బయటికి వచ్చి వెళ్లాలి. భౌతిక దూరం పాటించాలి. చదవండి: మీ నిస్వార్థ సేవలకు సెల్యూట్
ప్రశ్న : పనులు లేక ఆటోలు, ట్యాక్సీవాలాలు ఇబ్బందులు పడుతున్నారు?
ఎస్పీ : ట్రాన్స్‌పోర్టు ఆగడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే సరుకుల డెలివరీకి ఆటోలు, ట్యాక్సీలు వాడుతున్నాం. బయటి వారికి అనుమతి లేదు. ఎక్కడి ఆటోలు అక్కడ సరుకులు, కూరగాయలు రవాణాకు ఉపయోగిస్తున్నాం. వారికి ఉపాధి కల్పిస్తున్నాం.
ప్రశ్న : కొందరు నేతలు సేవా కార్యక్రమాల పేరుతో మాస్క్‌లు లేకుండానే గుంపులుగా వస్తున్నారు?
ఎస్పీ : ఇది మా దృష్టికీ వచ్చింది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు మాస్క్‌లు ధరించాలని, జాగ్రత్తలు తీసుకుని తక్కువమంది వెళ్లాలని సూచించాం.
ప్రశ్న : తండ్రి కేన్సర్ పేషంట్. ప్రతి నెలా హైదరాబాదు వెళ్లాలి. వెహికల్‌కు అనుమతి ఇస్తారా?
ఎస్పీ : వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోరు. తగిన ఆధారాలు తప్పకుండా చూపించాలి.
ప్రశ్న : కూరగాయల మార్కెట్లలో అమ్మకందారులు మాస్క్‌లు ధరించడం లేదు?
ఎస్పీ : అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాస్క్‌లు ధరించేలా చర్యలు తీసుకుంటాం. చదవండి: మరో 18 కరోనా పాజిటివ్ కేసులు
ప్రశ్న : మందుల షాపులు, కిరాణా దుకాణాల వద్ద చాలామంది భౌతిక దూరం పాటించడంలేదు? పోలీసులు పట్టించుకోవడం లేదు?
ఎస్పీ : ఇక నుంచి అలా జరగకుండా చూస్తాం. పోలీసులకు ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటించాలి. అప్పుడే కరోనా నుంచి బయట పడగలం.
ప్రశ్న : అధికారులు పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నా కొందరు పోలీసులు అడ్డుకుంటున్నారు?
ఎస్పీ : అలా జరగకుండా చూస్తాం. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులకు పూర్తి అనుమతులు ఇచ్చాం. పోలీసులు ఎవరూ అడ్డుకోరు. అలా జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : జిల్లాలో కరోనా బాధితులు ఎంతమంది ఉన్నారు?
ఎస్పీ : ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ తబ్లిక్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారితో కలిపి దాదాపు ఐదు వేల మంది ఉన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 86 మందిలో నేరుగా 17 మందికి, వీరి బంధువులు, మిగిలిన వారు 12 మందితో కలిపి మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ప్రశ్న : కరోనా విస్తరించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఎస్పీ : అందరిపై నిఘా పెట్టాం.వారి సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్‌స్టాల్ చేసి వారి కదలికలను కంట్రోల్‌లోకి తీసుకున్నాం. కరోనా అనుమానితులపై త్రీ బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. మహిళా పోలీసులు, విలేజ్ పోలీసులు, బీట్ కానిస్టేబుళ్లు ఇళ్ల వద్దకు వెళ్లి చెక్ చేస్తున్నారు.
ప్రశ్న : బయటి వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
ఎస్పీ : జిల్లాలో 39 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. బయటి జిల్లాల నుంచి ఎవరినీ జిల్లాలోకి అనుమతించడం లేదు. అలా రావాలనుకునే వారు 14 రోజులు క్వారంటైన్లలో ఉండాల్సిందేనని ఆంక్షలు పెట్టాం.
ప్రశ్న : పెట్రోలు బంకులు ఎప్పటి నుంచి పనిచేస్తాయి?
ఎస్పీ : ఇక నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల కోసం, మధ్యాహ్నం తర్వాత గూడ్స్ వెహికల్స్‌కు పెట్రోలు, డీజల్ అందించేలా ఆదేశాలు ఇచ్చాం.
ప్రశ్న : కరోనా లాక్‌డౌన్‌లో పోలీసుల పాత్ర?
ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది పోలీసులు, అధికారులు లాక్‌డౌన్‌లో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కుటుంబాలను వదిలి ప్రజలకు సేవ చేస్తున్నారు.పోలీసులతోపాటు వైద్యులు, వలంటీర్లు,రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు.
ప్రశ్న : జిల్లా ప్రజల సహకారం ఎలా ఉంది?
ఎస్పీ : కరోనాపై జిల్లా ప్రజలకు అపూర్వమైన అవగాహన వచ్చింది. వారి సహకారంతో లాక్‌డౌన్ విజయవంతమవుతోంది. జిల్లా వాసుల సహకారం ఎన్నటికీ మరువలేనిది.
ప్రశ్న : ప్రజల ఇబ్బందులు ఎలా పరిష్కరిస్తున్నారు?
ఎస్పీ : ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అదనపు మార్కెట్లను అందుబాటులోకి తెచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ కిరాణాషాపులు, మెడికల్ షాపుల వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు రాకుండా కిరాణా, మందులు సరఫరా అయ్యేలా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment