
నాలుగు వరుసలుగా విస్తరణ చేయనున్న కడప–రేణిగుంట రహదారి
కడప–రేణిగుంట రహదారికి మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న దీనిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. విస్తరణ బాధ్యతలను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏ)కి అప్పగించారు. రూ. 2 వేల కోట్లతో 138 కిలోమీటర్ల మేర కడప వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట్ల విమానాశ్రయం వరకు నాలుగు వరుసల రహదారిగావిస్తరించనున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇందుకోసం ప్రత్యేక కృషి చేశారు. ఇప్పటికే ఏపీ ఎన్‌హెచ్‌ఐఏ సీజీఎం అజ్మీర్‌సింగ్ కూడా విస్తరణ చేపట్టే రహదారిని పరిశీలించారు. అన్ని సక్రమంగాపూర్తయితే నవంబరులో ఈ పనులకు టెండర్లు
పిలిచే అవకాశం కనిపిస్తోంది.
కడప సిటీ : కడప–రేణిగుంట రహదారి ప్రస్తుతం పది మీటర్లు కలిగి రెండు వరుసలుగా ఉంది. నాలుగు వరుసలు చేసేందుకు 20 మీటర్ల వరకు పెంచనున్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖకు ల్యాండ్ అక్విడేషన్ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఐ అధికారులు విన్నవించారు. డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) కూడా సిద్ధమైంది. గతంలో ఎన్‌ఎస్‌యూలో ఉన్న ఈ రహదారిని ఎన్‌హెచ్‌ఐఏపీకి అప్పగించడంతో ఎన్‌హెచ్ 716 అనే నంబరును కేటాయించారు. కడపజిల్లాతోపాటు కర్నూలు, చిత్తూరు, ఇతర పలు రాష్ట్రాల వాహనాలు ప్రతి నిత్యం ఇదే రహదారిలో తిరుగుతుంటాయి. దీంతో తరుచూ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విస్తరణ బాధ్యతలను ఎన్‌హెచ్ నుంచి ఎన్‌హెచ్‌ఐఏ (జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ)కు అప్పగించారు. జాతీయ రహదారి–716 నంబరును కేటాయిస్తూ విస్తరణకు పూనుకున్నారు. డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. దీంతో రెండు వరుసల రహదారి నాలుగు వరుసలుగా మారనుంది. భూ సేకరణ, నిర్మాణానికి కలిపి రూ. 2000 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనాలు కూడా సిద్దం చేశారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కృషి
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈ రహదారి విస్తరణ అంశంపై అధికారులతో చర్చించారు.. నిధుల విషయంలో కూడా కృషి చేశారు. ప్రారంభంలో ఎన్‌హెచ్‌ఐ అధికారులు రిమ్స్‌రోడ్డు నుంచి రేణిగుంట వరకు నాలుగు లేన్ల రహదారిని విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడి నుంచి అలైన్‌మెంట్ మార్చి వైఎస్సార్ టోల్‌ప్లాజా నుంచి రేణిగుంట విమానాశ్రయం వరకు విస్తరణ చేపట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అధికారులకు సూచించడంతో చివరకు ఆయన నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని అలైన్‌మెంట్‌ను సిద్ధం చేశారు.
బద్వేలు నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు
కడప–రేణిగుంట రహదారి విస్తరణతోపాటు బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు వరకు కూడా నాలుగు వరుసల రహదారిని నాణ్యతతో నిర్మించేందుకు ఎన్‌హెచ్‌ఐఏ అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. రాయలసీమ జిల్లాలతోపాటు బళ్లారి, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల నుంచి ఇనుప ఖనిజం, గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేసేందుకు కృష్ణపట్నం పోర్టు ఎంతో ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం నుంచి కడపజిల్లా బద్వేలుకు వరకు 138 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరణ చేయనున్నారు. ఇందులో కొంత భాగాన్ని ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల విభాగం ఆధ్వర్యంలో నాలుగు వరుసలుగా విస్తరించినప్పటికీ తాజాగా ఎన్‌హెచ్‌ఐఏ తన ప్రమాణాల మేర పూర్తి స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమయ్యారు.
రేపు ఢిల్లీలో సమావేశం
విస్తరణకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్‌హెచ్‌ఐఏ అధికారులతో ప్రత్యేక సమావేశం ఉన్నట్లు ఎన్‌హెచ్‌ఐఏ ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అక్కడ దీని గురించి వివరిస్తామని తెలిపారు. కన్సెల్టెంట్‌గా తాను కూడా వెళుతున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లను పిలిచే అవకాశం ఉంది.