మరపురాని మహానేత గురుతులు | YSR Memoirs In Visakha District | Sakshi
Sakshi News home page

మరపురాని మహానేత గురుతులు

Published Mon, Sep 2 2019 7:45 AM | Last Updated on Mon, Sep 2 2019 7:47 AM

YSR Memoirs In Visakha District - Sakshi

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి శంకుస్థాపన చేస్తున్న మహానేత వైఎస్సార్‌

సాక్షి, విశాఖ సిటీ : మంచితనానికి మరోపేరు..మానవత్వానికి ప్రతిరూపం..చిరునవ్వుకు చిరునామా..తెలుగోడి పౌరుషానికి ప్రతినిధి..అచ్చతెలుగు పంచెకట్టుకు వన్నెతెచ్చిన మగధీరుడు..పేదోడి గుండెచప్పుడు ఇలా ఎన్ని చెప్పుకున్నా ఆ మహనీయుడి కోసమే. వైఎస్సార్‌..ఈ మూడక్షరాలు తలంపుకొస్తే ఓ రైతన్నకు కొండంత ధైర్యం వస్తుంది..అక్కచెల్లమ్మలకు అన్న అండగా ఉన్నాడన్న భరోసా కలుగుతుం ది.. విద్యార్థి లోకానికి నేనున్నానంటూ పెద్దాయన వెన్నుతట్టి ప్రోత్సహించిన అనుభూతి కలుగుతుంది. పేదోడికి రాజన్న రాజ్యంలో ఉన్నానన్న ధీమా ఏర్పడుతుంది. జిల్లాలో ఆయన అందించిన అభివృద్ధి ఫలాలు కళ్ల ముందే కదలాడుతాయి.

జిల్లా అభివృద్ధికి బాట..
జిల్లాలో 2004–2009 మధ్యలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేనంతగా జిల్లా రూపురేఖలు మార్చేసిన ఘనత వైఎస్సార్‌ది. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లకు పునర్జీవం పోయడం..విశాఖ కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చడం..లక్షలాది మంది సొంతింటి కలను సాకారం చేయడం..పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడం..నగరంలో ఉన్న దాదాపు అన్ని పరిశ్రమలకు చేయూతనిచ్చి కార్మికులకు అండగా నిలవడంలో మహానేత తన ముద్ర చూపారు. సాధారణ కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ నగరాన్ని గాజు వాక, మరో 32 పంచాయతీలను విలీనం చేసి 72 వార్డులుగా మార్చి 2005లో జీవీఎంసీగా మార్పు చేశారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ప్రాజెక్ట్‌ ద్వారా రూ.1500 కోట్లతో నగరంలో భూగర్భ డ్రైనేజీ చేపట్టారు. భాగ్యనగరానికి దీటుగా శీఘ్ర రవాణ  వ్యవస్థ కోసం రూ.456 కోట్లు వెచ్చించి బీఆర్‌టీఎస్‌ రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

విస్తరణ వైఎస్‌ చలవే..
ప్రఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్‌ పరమయ్యే స్థితికి చేరుకున్న దశలో వైఎస్సార్‌ ఆ ప్రక్రియను సమర్థవంతంగా ఆపగలిగారు. పరిశ్రమకు చేయూతనివ్వడంతో పాటు ఆనాడు కేంద్రంతో పోరాటం చేసి ప్లాంట్‌ విస్తరణకు శ్రీకారం చుట్టారు. తద్వారా విశాఖ ఉక్కు పరిశ్రము ఉత్పత్తిని రెట్టింపు చేసుకుంది. మూతపడిపోతున్న బీహెచ్‌ఈఎల్‌ను బీహెచ్‌పీవీలోకి వీలీనం చేయించారు. అదే స్థితిలో ఉన్న షిప్‌యార్డును నేవీలో విలీనం చేయించారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ విస్తరణకు పునాదులు వేశారు. అచ్యుతాపురంలో ఇండస్ట్రియల్‌ కారిడార్, భీమిలిలో ఐటీ కారిడార్, పరవాడ ఫార్మాస్యూటికల్‌ కారిడార్, దువ్వాడ ఐటీ సెజ్‌ ఇలా ఎన్నో పరిశ్రమలు వైఎస్సార్‌ పాలనలో విశాఖ సిగలో ఒదిగాయి. లక్షలాది మందికి ప్రత్యక్షంగా..పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించారు. 
విశాఖ ఎయిర్‌పోర్టుకు రూ.100 కోట్లు కేటాయించి అధునాతన టెర్మినల్‌ నిర్మాణం జరిపించారు.

మూడున్నర లక్షల మందికి గూడు..
జిల్లా వ్యాప్తంగా దాదాపు 3,56,115 మందికి సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌ది. ఐదేళ్ల పాలనలో సాచురేషన్‌ పద్ధతిలో పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలతో పనిలేకుండా కేవలం అర్హతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రజలకు ఇళ్లు కట్టించారు. నగరంలో కూడా పునరావాస, పూర్‌సెటిల్‌మెంట్‌ కాలనీలను నిర్మించారు. ఇలా నగరంలో దాదాపు లక్ష మందికి సొంత గూడు కల్పించారు.

అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ..
వైఎస్సార్‌ అధికారం చేపట్టడానికి ముందు డ్వాక్రా రుణాలకు 14 శాతం వడ్డీ వసూలు చేసేవారు. వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో వడ్డీ శాతాన్ని 4 శాతానికి(పావలా) తగ్గించి మహిళల జీవీతాల్లో వెలుగులు నింపారు. ఆయన పాలించిన ఐదేళ్ల కాలంలో సుమారు రూ.1000 కోట్లకు పైగా పావలా వడ్డీ రుణాలను డ్వాక్రా మహిళలు పొందారు.

గోదావరి నీరు మళ్లింపు..
గోదావరి నీటిని విశాఖతో పాటు ఉత్తరాంధ్ర తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే సంకల్పంతో పోలవరం ఎడమకాలువను నిర్మించారు. తాండవ, రైవాడ, పెద్దేరు, కోనాం ప్రాజెక్టుల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. ఏలేరు నీటిని మళ్లింంచి స్టీల్‌ప్లాంట్‌ నీటి సమస్యను తీర్చారు. సబ్బవరం కేంద్రంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనిపై తరువాత పాలకులు శ్రద్ధ వహించలేదు. కానీ తాజాగా వైఎస్సార్‌ తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ పూర్తికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. బడ్జెట్‌లో రూ.170.06 కోట్లు కేటాయించింది.    

ఉచిత విద్యుత్‌ వెలుగులు..
జిల్లా వ్యాప్తంగా 25 వేల వ్యవసాయ సర్వీసులకు ఇప్పటికీ ఉచిత విద్యుత్‌ అందుతుంది అంటే అది కేవలం వైఎస్సార్‌ చలవే. రుణమాఫీ ద్వారా రాష్ట్రంలో 17 జిల్లాల పరిధిలో 77.55 లక్షల మంది రైతులకు రూ.1200 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. మాఫీ వర్తించని జిల్లాలోని 55 వేల మంది రైతులకు రూ.5 చొప్పున ప్రోత్సాహకం అందించి అండగా నిలిచారు.

చెదరని జ్ఞాపకం వైఎస్సార్‌..
అక్కయ్యపాలెం: ప్రజల అవసరాలు, సంక్షేమం కోసం శ్రమించే నాయకుడు ఎన్నటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. దానికి సజీవ సాక్ష్యం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. మహానేత ఈ లోకాన్ని విడిచి దశాబ్దం గడుస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో చెక్కుచెదరలేదు. ఆ మహానేతను దేవుడిలా పూజించే వారు ఎందరో ఉన్నారు. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అల్పాహారం పంపిణీ.. 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ కార్యదర్శి కొణతాల రేవతీరావు ఆదివారం అక్కయ్యపాలెం మెయిన్‌ రోడ్‌లో 500 మంది రోజువారి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. మహానేత చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేమని, వైఎస్సార్‌ వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇండియన్‌ జిమ్‌ రాజేష్, ఆర్పీలు, వలంటీర్లు పాల్గొన్నారు. 

ఆరోగ్యశ్రీ సంజీవనిలా ఆదుకుంది..
ఆరోగ్యశ్రీ పథకం నా కుటుంబాన్ని ఆదుకుంది. పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాను. ఎంతో సంతోషంగా ఉంటున్న సమయంలో నా కుమార్తె షకీలాకు గుండెకు సంబంధించిన అనారోగ్యం చేసింది. నర్సు ఇచ్చిన సలహాతో ఆరోగ్యశ్రీ మా కుటుంబాన్ని సంజీవనిలా ఆదుకుంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా కేర్‌ ఆస్పత్రిలో నా పాపకు ఆపరేషన్‌ చేయింగలిగాను. ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉంది. 
– షేక్‌ మదీనా, పెయింటర్, సీతంపేట

మది మదిలో రాజన్న..
కొయ్యూరు (పాడేరు): అపర భగీరథుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 2005లో మన్యంలో ఎక్కువగా చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. మన్యంలో వందకుపైగా డ్యాంలను ఇస్తే పాడేరు నియోజకవర్గంలో 50కు పైగా కొత్త చెక్‌డ్యాంలను మంజూరు చేశారు. దీని తరువాత జలాశయాలకు నిధులు ఇచ్చారు. దీని మూలంగా రైతుల పొలాలకు నీరు చేరింది. ఒక్క కొయ్యూరు మండలంలోనే 20కిపైగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు. దీంతో వర్షాధారంపై ఉన్న భూములకు నీరు వస్తుంది. కాట్రగెడ్డ, ఆకులపాడు, పోతవరం, గంగవరం, తీగలమెట్టతో పాటు అనేకచోట్ల చెక్‌డ్యాంలను నిర్మాణం చేశారు.అంతవరకు కొత్తగా చెక్‌డ్యాంలను నిర్మాణం చేయాలని ఎవరూ నిర్ణయించలేదు. రైతు క్షేమాన్ని ఆశించిన నాటి ముఖ్యమంత్రి మూలంగా కొన్నిచోట్ల రైతులు చెక్‌డ్యాంల మూలంగా పంటలను పండించుకోగలుగుతున్నారు. వాటిని నిర్మాణం చేసి 14 సంవత్సరాలు కావడంతో కొన్నిచోట్ల చెక్‌డ్యాంలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. వాటికి నిధులు వస్తే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది. 

చెరకు రైతుకు వెన్నుదన్నుగా...
అనకాపల్లి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అనకాపల్లి అంటే ఎంతో మక్కువ. ఈ ప్రాంతంలోని ప్రధాన పంట అయిన చెరకు, చెరకు ఉత్పత్తులైన పంచదార, బెల్లం పండించే రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన ఘనత ఆయనకే దక్కుతుంది. రాజకీయ లబ్ది కోసం తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని టీడీపీ నేతలు వాడుకోవడంతో పాటు 2002లో ఈ కర్మాగారాన్ని మూసివేశారు. వైఎస్‌ హయాంలో తుమ్మపాల చక్కెర కర్మాగారాన్ని నిధులు మంజూరు చేసి తెరి పించారు. బెల్లం రైతులకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతులు చేసిన ఉద్యమానికి వైఎస్‌ మద్దతుగా నిలిచారు. వ్యవసాయ పంటలకు సాగునీటి వనరైన శారదాలో గ్రోయిన్లు, ఆనకట్టల నిర్మాణానికి అప్పట్లోనే రూ.22 కోట్లు మంజూరు చేశారు. గూడు లేని నిరుపేదలకు రాజీవ్‌ గృహకల్ప, శంకరంలో రూ.32 కోట్లతో సమగ్ర మురుగు అభివృద్ధి పథకం, రూ.30 కోట్లతో సంపత్‌పురంలో మెగా రిజర్వాయర్‌తో పాటు ఎన్నో అభివృద్ధి ఫలాలు అందించిన వైనాన్ని ఇక్కడి వాసులు గుర్తు చేసుకుంటారు.

బెల్లంరైతుకు తీపి పంచారు..
మునగపాక (యలమంచిలి): మహానేత రాజశేఖరరెడ్డితో మునగపాక ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేత హోదాలో మునగపాక వచ్చిన రాజన్న స్థానిక రైతుల కష్టాలు అడిగి తెలుసుకోవడంతో పాటు బెల్లం తయారీ పరిశీలించిన సంఘటన ఉంది. ఏప్రిల్‌  2002లో ప్రతిపక్ష నేత హోదాలో పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా అనకాపల్లిలో జరిగిన మహిళా సదస్సుకు రాజశేఖరరెడ్డి వెళుతున్న సందర్భంలో మార్గమధ్యలో మునగపాకలోని ఆడారి పోలయ్య క్రషర్‌ వద్ద కొంతసేపు ఆగారు. రైతులు తయారు చేస్తున్న బెల్లాన్ని ఆసక్తిగా తిలకించడంతో పాటు రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. తాము పడుతున్న ఇబ్బందులను రైతు పోలయ్య ఈ సందర్భంగా రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులతో పాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తాను అధికారంలోకి వస్తే రైతులకు మెరుగైన సేవలందిస్తానంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు వ్యవసాయ రంగానికి 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్‌ సరఫరాతోపాటు బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించారు.

రాజన్న సేవలు ఎన్నటికీ మరువలేం..
ఇచ్చిన మాట తప్పని నాయకుడంటే రాజన్న నే చెప్పుకోవాలి. తమ కష్టాలు నేరుగా తెలుసుకున్న రాజన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. రైతు పక్షపాతిగా రాజన్న నిలిచారు. రాజన్న ఇచ్చిన హామీలు అమలు జరగడంతోపాటు రైతులకు మేలు జరిగేలా పాలన అందించారు. రాజన్న సేవలను ఎప్పటికీ మరువలేం.
– ఆడారి పోలయ్య, రైతు, మునగపాక 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement