సాక్షి, తాడేపల్లి : ' గత టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ రుణాలకు 1150 రూపాయల కోట్లు వడ్డీ బకాయిలు పెట్టింది. 57 లక్షల మంది రైతులకు ఆ బకాయిలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. సున్నా వడ్డీ పథకంపై రైతులకు బకాయిలంటిన్నీ పూర్తిగా చెల్లిస్తున్నాం. మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఈరోజున గర్వంగా చెబుతున్నా' అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం 96.50 కోట్ల రూపాయలను విడుదల చేసింది. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సి బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది.
దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. దీంతో పాటు విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్ రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు. (రాష్ట్ర వ్యాప్తంగా మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి)
'రైతులకు మంచి చేసిన నాయకుడు వైఎస్సార్. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఫైల్‌పై వైఎస్‌ఆర్ తొలి సంతకం చేశారు.. రైతుల కరెంట్ బకాయిలను కూడా రద్దు చేసిన ఘనత వైఎస్సార్‌ది. మనం ఇప్పుడు ప్రతి రైతుకు రూ.50వేలకుపైగా లబ్ధి పొందేలా మేలు చేస్తున్నాం. వైఎస్ అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్‌లు గుర్తుకొస్తాయి. వైఎస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. అక్టోబర్‌లో 2019-20కి సంబంధించిన ఖరీఫ్ రుణాల వడ్డీ చెల్లింపులు, మార్చిలో రబీ రుణాల వడ్డీ చెల్లింపు చేస్తాము. (వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్)
రైతుల కోసం 1907 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాలు ఉంటాయి.ఆర్‌బీకేల ద్వారా పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భదారణ సేవలు అందించనున్నాం. సహకారరంగంలోని చక్కెర రైతులకు గత ప్రభుత్వంలోని 88 కోట్ల రూపాయల బకాయిల్లో ఇప్పటికే 34 కోట్ల రూపాయలు చెల్లించాం.. తాజాగా ఇవాళ 54.6 కోట్ల రూపాయలు విడుదల చేశాం. రాష్ట్రంలో నాలుగు కొత్త ఫిషింగ్ హార్బర్‌లకు1300 కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకున్నాయి. కేంద్రప్రభుత్వం, నాబార్డ్‌లతో కలిసి రాష్ట్రప్రభుత్వం ఎంవోయూలు చేసుకుంది. రూ.13500 చొప్పున ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించాం. రూ.10,240 కోట్లు రెండు విడతల్లో రైతుభరోసా అందించాం.10,461 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం.విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా ఉంటాం. ఉద్యానవన పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. పొగాకు రైతులకు కూడా అండగా ఉంటున్నాం. పొగాకును కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టేసిన రూ.960 కోట్ల రూపాయను కూడా మన ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం విత్తన బకాయిలుగా పెట్టిన రూ.384 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించగలిగింది. గత ప్రభుత్వం 2018–19 ఏడాదికి సంబంధించి రబీ బీమా ప్రీమియం ను రూ.120 కోట్లు చెల్లించి , మన ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపి రూ.590 కోట్ల పంటల బీమా డబ్బులు రైతులకు ఇప్పించగలిగాం. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ఇవ్వాలని చెప్పి, ఇప్పటికే 83శాతం ఫీడర్లను మెరుగుపరిచాం. రూ.1700 కోట్ల రూపాయలు కరెంటు సదుపాయాలను మెరుగుపరచడానికి ఇచ్చాం.దేశ చరిత్రలో తొలిసారిగా పంటల బీమా సొమ్మును రైతుల తరఫున కడుతున్న రాష్ట్రం కూడా మనదే. ఆక్వా రైతులకు సరఫరరా చేసేలా రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని ప్రభుత్వం మోస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నా. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశాం.
గత ప్రభుత్వం పెట్టిన రూ.8,655 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను చెల్లించాం. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణకు చెల్లించాల్సిన రూ.960 కోట్లను కూడా చెల్లించాం. రూ.384 కోట్ల విత్తన బకాయిలను కూడా చెల్లించాం. గత ప్రభుత్వం పెట్టిన రూ.122 కోట్ల బీమా ప్రీమియంను కూడా చెల్లించాం. రైతులకు 83శాతం ఫీడర్ల ద్వారా పగటిపూటే 9గంటల విద్యుత్ అందిస్తున్నాం. రబీ నాటికి మిగిలిన ఫీడర్లను అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ ఏడాది రైతు బీమా కింద రూ.1456 కోట్లు చెల్లించాం.ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్సాగు చేశాం. రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధిని కూడా ప్రారంభించాం. రూ.3,050 కోట్లతో రైతుల పంటలు కొనుగోలు చేశాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్‌ట్యాక్స్ కూడా రద్దు చేశాం. జలయజ్ఞం పనులు వేగంగా సాగుతున్నాయి.. ఆరు ప్రాజెక్టులను ఈఏడాదే ఆపరేషన్లోకి తీసుకు వస్తున్నాం' అని వైఎస్ జగన్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment