సాక్షి, అమరావతి : వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు రేపు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(శనివారం) తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించనున్నారు.
('బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా')
రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనాలివే...
► రైతులకు అధిక ఆదాయం, ప్రజలకు ఆహార భద్రత ప్రధాన ఉద్దేశం.
► ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు తలలో నాలుకలా ఉండి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు.
► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి.
► భూసార పరీక్షల ఆధారంగా ఏయే పంటలు వేసుకోవచ్చో సలహా ఇస్తారు. నాణ్యమైన విత్తనాలు ఏవో గుర్తించి సూచిస్తారు.
► అనవసరంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారు.
► ఈ కేంద్రాలకు అనుబంధంగా ఉండే అగ్రి షాప్స్ నుంచి వ్యవసాయ పనిముట్లు, పంటల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణోపాయాలు, మార్కెటింగ్ మెళకువలు నేర్పుతారు.
► ఇ–క్రాప్ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు.
► విత్తనం వేసింది మొదలు మార్కెటింగ్, గిరాకీ సరఫరా వరకు ఈ కేంద్రాలు రైతులకు తోడ్పడేలా సిద్దం చేసింది ప్రభుత్వం
► రైతు భరోసా కేంద్రాలు గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్ శాఖ పర్యవేక్షిస్తుంది.
► ఆర్‌బీకేల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా జేసీ నియామకం. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యం చేసుకుని ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం ఆర్బీకే నుంచి ప్రారంభం.
►10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ‘కియోస్క్’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. మార్కెటింగ్ సేవలు రైతులకు అందుతాయి. ఇది దేశ చరిత్రలోనే తొలి ప్రయోగం.దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు.
►రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్‌లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ (ఆర్‌బీకే) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ ‘కియోస్క్’లు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్’లు!
కియోస్క్‌లు ఎలా పని చేస్తాయంటే..
ఈ డిజిటల్ కియోస్క్ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్‌పుట్, యూఎస్‌బీ చార్జింగ్ స్లాట్, ఏ–4 కలర్ ప్రింటర్, ఈ పాస్ మిషన్, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్ రీడర్ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు.
టచ్ స్క్రీన్..
రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కియోస్క్ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్ నంబరును ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరలు కియోస్క్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక క్లిక్ చేస్తే ఆర్డరు తయారవుతుంది. సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి అంటే ‘హబ్’(గోదాము)కు తక్షణమే ఆ రైతు కొనుగోలు చేయదలచిన సరుకుల ఆర్డర్ వెళుతుంది. కియోస్క్ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి.
కియోస్క్‌ల ద్వారా సులువుగా సమస్త సమాచారం...
►మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటవుతున్నందున అక్కడి రైతులకు ఉత్పాదకాలతోపాటు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సులువుగా అందించవచ్చు.
► వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు.
► ఏయే వ్యవసాయోత్పత్తులకు మార్కెట్‌లో మున్ముందు మంచి ధర వచ్చే అవకాశం ఉంది (మార్కెట్ ఇంటెలిజెన్స్), ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఏయే పంటలకు ఎంతెంత ధర పలుకుతోంది? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి ముఖ్యమైన తాజా సమాచారాన్ని రైతులకు అందించవచ్చు.
► వాతావరణ సూచనలు, ఆయా ప్రాంతాల్లోని చీడ పీడల సమాచారాన్నీ అందించవచ్చు.
► భూ రికార్డులను అందుబాటులోకి తేవచ్చు.
► వివిధ పంటల సాగు సాంకేతిక మెళకువలను తెలియజెప్పే వీడియోలను ఈ కియోస్క్‌ల ద్వారా రైతులకు చూపవచ్చు.
ఆర్‌బీకేలతో పాటు సీఎం యాప్ ను కూడా రేపు సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. క్షేత్ర స్థాయిలో పంటలకు దక్కుతున్న ధరలు, మార్కెట్‌లో జోక్యం ద్వారా ధరల స్థిరీకరణకు ఉద్దేశించిన సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్) రూపొందించారు.
(మోదీ, జగన్ మధ్య సత్సంబంధాలు: రామ్‌మాధవ్)
Comments
Please login to add a commentAdd a comment