క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
సాక్షి, చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.12,500 అందజేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 15వ తేదీ నాటికి రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అందించే నగదుకు సంబంధించి రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. కౌలు రైతుల గుర్తింపును పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న మూడు లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందేలా చూడాలన్నారు.
జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయశాఖ ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అందుకు అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. గ్రామ వలంటీర్ల ద్వారా రైతులకు న్యాయమైన ఎరువులు, విత్తనాలను ఈ ప్రయోగ కేంద్రాల ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో పెద్ద, చిన్న గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసుకుని ఎరువులు, విత్తనాలు పంపిణీ ఏ విధంగా జరుగుతుందో అధ్యయనం చేయాలన్నారు. అధ్యయనంలో వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని జిల్లా అంతా పంపిణీ కోసం మార్గదర్శకాలు రూపొందించుకోవాలన్నారు.
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకం ద్వారా జిల్లాలో రెండు రోజుల్లో జరగనున్న మేళా కార్యక్రమంలో సుమారు 10వేల మంది రైతులు అప్పటికప్పుడు ఈ పథకంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలుగా అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా 1281 హెక్టార్లలోని పంటభూములు పూర్తిగా ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారన్నారు. వీటి కోసం రూ.1.83 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. 4,200 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 53.8 హెక్టార్లలో సెరీకల్చర్ పంటలు దెబ్బతిన్నాయన్నారు.
నవంబరు 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి మత్స్యకారు కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించేలా జాబితా రూపొందించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, మత్స్యశాఖ జేడీ యాకూబ్‌బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వార్డు సచివాలయ కార్యాలయం భవనాలు సిద్ధం చేయండి
వార్డు సచివాలయ కార్యాలయాల కోసం అనువైన భవనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. మచిలీపట్నంలోని ఆయన చాంబర్ నుంచి కమిషనర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబరు 2వ తేదీ నుంచి వార్డు వలంటీర్లు, సెక్రటేరియట్‌ల ఉద్యోగుల కోసం కార్యాలయాలు సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో త్వరలో పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అవసరమైన భవనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటికే మునిసిపాలిటీల్లో వార్డు వలంటీర్ల నియామకం జరిగిందని, ఏయే వార్డుల్లో ఖాళీలు ఉన్నాయో పరిశీలించాలన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం జగ్గయ్యపేట, ఉయ్యూరు, గుడివాడ, తిరువూరు మునిసిపాలిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం కోసం స్థలాలను ఎంపిక చేయాలన్నారు. ఎంత మందికి స్థలాలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారుచేసి అం దుకు తగిన విధంగా స్థలాలను గుర్తించాలన్నా రు. సమావేశంలో జాయింట్ కలెక్టర్–2 మోహ న్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్ పాల్గొన్నారు.
నిబంధనలకు అనుగుణంగా గోశాలలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా గోశాలలు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో శుక్రవారం గోశాలల నిర్వాహకులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాలల నిర్వహణ లోపం కారణంగా ఇటీవల విజయవాడలో సుమారు 100 ఆవులు మృత్యువాతపడ్డాయన్నారు. గోశాలల్లో సరైన సంరక్షణ, పోషణ, వైద్యసేవలు గోవులకు అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 27 గోశాలలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం సహకారాన్ని అందిస్తామన్నారు.
పశుసంవర్థకశాఖ జాయింట్ డైరెక్టర్ భరత్ రమేష్ మాట్లాడుతూ కబేళాకు తరలిస్తున్న గోవులను పట్టుకుని గోశాలలకు అప్పగించాలని చూస్తే వసతికి సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సుమారు 8 ఎకరాల్లో ప్రత్యేక పశువుల వసతి కోసం ఏర్పాటు చేస్తున్నామన్నారు. గడ్డి కోసే యంత్రాలు 50 శాతం సబ్సిడీతో గోశాలల నిర్వహణకు అందించనున్నామన్నారు. గోశాలలకు పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో వెటర్నరీ వైద్యులను నియమించామని, వీరు 15 రోజులకు ఒకసారి గోశాలకు వెళ్లి వైద్యసహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాలని సూ చించామన్నారు. బందరు డీఎస్పీ మహబూబ్‌బాషా మాట్లాడుతూ మచిలీపట్నంలోని రోడ్లపై పశువుల సంచారం ఎక్కువగా ఉందని వీటిని నియంత్రించేందుకు పశువులను తరలించా లంటే గోశాలల్లో భూములు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ మోహనరావు, ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, విజయవాడ అడిషనల్ డీసీపీ–2 చంద్రశేఖర్ ఇతర అధికారులు, గోశాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
మహిళలను, బాలికలను మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్‌లో శుక్రవారం సెక్స్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలనపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాల నిరోధానికి ప్రభుత్వశాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పేదరికం కారణంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి మహిళలను, బాలికలను వ్యభిచారంలోకి దించుతున్నారన్నారు. అటువంటి వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు.
మహిళలపై అత్యాచారాల నిరోధానికి తమిళనాడుకు చెందిన ఐజేఎం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ స్వచ్ఛంద సంస్థ సెక్స్ ట్రాఫికింగ్ నిర్మూలనపై చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మహిలల హక్కులను కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేదలైన అభ్యాగులు, అనాథలు, విభిన్న ప్రతిభావంతులను సరైన సంరక్షణ లేకుండా వదిలేస్తున్నారన్నారు. అటువంటి వారిని బాలకార్మిక నిర్మూలన సంస్థ, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వారిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ–2 మోహన్‌కుమార్, డీఆర్వో ఎ ప్రసాద్, బీసీ సంక్షేమశాఖ డీడీ భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment