వైఎస్సార్ విద్యార్థి నాయకులనే టార్గెట్ చేస్తున్నారు
► ఆందోళన చేసింది సాధారణ విద్యార్థులే
► మెస్ బిల్లుల భారం తగ్గించండి
► వీసీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వినతి
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 21న సాధారణ విద్యార్థులు మాత్రమే ఆందోళన చేస్తే వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులనే టార్గెట్ చేస్తూ 11 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ అనంతపురం జిల్లా కమిటీ కన్వీనర్ బి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. కేసుల నమోదును నిరసిస్తూ ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ను సోమవారం ఆయన కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.
వర్సిటీ యాజమాన్యంను సంప్రదించకుండా పోలీసులు నేరుగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. వర్సిటీల్లోని హాస్టల్స్‌లో మెస్‌బిల్లుల భారం అధికమవుతోందన్నారు. ఉద్యోగులు అవినీతికి పాల్బడ్డమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అధ్యాపకులకు ఓరియంటేషన్ ప్రోగ్రాంలు ఇప్పించి వారిలో నైపుణ్యాలు పెంపుదల చేయాలన్నారు. వీసీ స్పందిస్తూ గతంలో విద్యార్థి నాయకుల మీద కేసులున్న సంగతి తనకు తెలియదన్నారు. ఎస్కేయూ పురోగతికి ప్రతి విద్యార్థి సహకరించాలని కోరారు. డ లీగల్ సెల్ కమిటీ సభ్యులు ఆదినారాయణ, విద్యార్థి విభాగం నాయకులు లింగా రెడ్డి, సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.