వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పిలుపునిచ్చిన సుజయ్‌కృష్ణ రంగారావు, సాంబశివరాజు
పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు పాల్గొనాలని విజ్ఞప్తి
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఆవేదనను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభలో అప్రజాస్వామికంగా ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త సుజయ్‌కృష్ణరంగారావు, విజయనగరం జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియంతృత్వ పోకడలకు నిరసనగా ఆ పార్టీ వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని, పార్టీ శ్రేణులంతా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సమైక్యవాదానికి కట్టుబడిన వారంతా బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. వ్యాపార, కార్మిక, ఉద్యోగ, కర్షక వర్గాలు సహకరించాలని కోరారు. రాష్ట్ర విభజన బిల్లును లోకసభలో ఆమోదించడం దారుణమని పేర్కొన్నారు. విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిపినా, ఎంత మొత్తుకున్నా సోనియాగాంధీ పట్టించుకోలేదన్నారు. రైతుల నోట మట్టికొట్టారని, నిరుద్యోగ యువతకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌కు, దానికి సహకరించిన చంద్రబాబుకు, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు జిల్లా బంద్
Published Wed, Feb 19 2014 2:25 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement