అందరూ అండగా నిలవాలి
27 నుంచి జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలి
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జ్యోతుల నెహ్రూ పిలుపు
జగ్గంపేట :రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పోరాడుతుందని, ఇందులో భాగంగానే తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో గురువారం జరిగిన గ్రామ, మండల కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రాణాలను సహితం లెక్క చేయకుండా జగన్ గుంటూరులో శనివారం నుంచి నిరవధిక దీక్ష చేపడుతున్నారన్నారు. దీనికి మద్దతుగా గ్రామ, నియోజవర్గ నాయకులు సమన్వయంతో జిల్లావ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాలన్నారు.
విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతోందని, ఆర్థిక వనరులు లేక ఇప్పటికే అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిశ్రమలు రాకుంటే నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుందని, యువత భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని జ్యోతుల ఆవేదన వ్యక్తం చేశారు. ‘బాబు వస్తే జాబు’ అన్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆదర్శ రైతులను తొలగించారని, ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించేందుకు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు 2600 ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి ముఖ్య కారకుడైన చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటన, వెంకయ్యనాయుడు హామీ ఏమయ్యాయని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు తమ పార్టీ చేస్తున్న పోరాటానికి అండగా ఉండాలని ప్రజలకు జ్యోతుల విజ్ఞప్తి చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్ మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పే చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్పేలా చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందని, ప్రజాపక్షాన నిలచి పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురామ్, జెడ్పీటీసీ సభ్యులు వీరంరెడ్డి కాశీబాబు, పాలూరి బోస్‌బాబు, ఎంపీపీలు గుడేల రాణి, కంచుమర్తి రామలక్ష్మి, అత్తులూరి సాయిబాబు, మారిశెట్టి భద్రం తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా కోసమే జగన్ నిరవధిక దీక్ష
Published Fri, Sep 25 2015 1:09 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement