
సోమవారం గవర్నర్ ను కలిసిన అనంతరం రాజ్ భవన్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. చిత్రంలో పార్టీ ఎమ్మెల
చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ పార్టీ నేతలను కిరాతకంగా హతమారుస్తోందని, ప్రభుత్వ కనుసన్నల్లోనే హింసాకాండ సాగుతోందని, ఈ రాజకీయ హత్యలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్‌కు వినతి
- చంద్రబాబు ప్రమేయంతోనే హింసాకాండ
- డీజీపీ సొంత జిల్లాలోనే 8 హత్యలు
- ప్రభుత్వోద్యోగులే హత్యల్లో భాగస్వాములు
- ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు
- గవర్నర్‌తో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
‘‘ప్రభుత్వాధికారులు, ఉద్యోగులే హత్యల్లో పాలు పంచుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు కావడం దారుణం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ సొంత జిల్లా అనంతపురంలోనే ఎనిమిది రాజకీయ హత్యలు జరిగాయి. చంద్రబాబు దగ్గరుండి రాష్ట్ర డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా? సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారులను ఉద్యోగులను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను ఏరివేసే కార్యక్రమం న్యాయంకాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఇక సామాన్య ప్రజలెలా బతకాలి?’’
హైదరాబాద్: చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ పార్టీ నేతలను కిరాతకంగా హతమారుస్తోందని, ప్రభుత్వ కనుసన్నల్లోనే హింసాకాండ సాగుతోందని, ఈ రాజకీయ హత్యలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ దమనకాండపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని జగన్, ఎమ్మెల్యేలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. గవర్నర్‌తో సమావేశం ముగిసిన తరువాత ఆయన రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దగ్గరుండి రాష్ట్ర డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు సొంత జిల్లా అనంతపురంలోనే ఎనిమిది హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
‘‘మా పార్టీ నేత భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని ఏప్రిల్ 29వ తేదీన రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయానికి పిలిచి మరీ అందరి కళ్లెదుటే దారుణంగా నరికి చంపారు. ఎమ్మార్వో, ఆర్‌ఐ ఇద్దరూ కలిసి ఫోన్ చేస్తే ప్రసాదరెడ్డి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. అక్కడ అప్పటికే దాచి ఉంచిన ఆయుధాలతో కిరాతకంగా హతమార్చారు. ప్రభుత్వాధికారులే హత్యల్లో పాల్గొనే పరిస్థితి రావడం, ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు కావడం ఎంతవరకు సమంజసం? హత్య జరిగిన స్థలంలోనే స్థానిక ఎస్‌ఐ నేమ్‌ప్లేట్ కూడా పడి ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనే ఈ హత్య జరిగిందంటే, ఇంతకంటే కిరాతకం ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో దీనిని బట్టి అర్థం అవుతోంది. ప్రసాదరెడ్డి హత్యకు సరిగ్గా నెల ముందు... అంటే మార్చి 31వ తేదీన కిష్టపాడు గ్రామంలో అక్కడి సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డిని కూడా ఇలాగే చంపారు. విజయభాస్కర్‌రెడ్డి స్కూలు టీచరు కుమారుడు. సింగిల్‌విండో పెయిడ్ సెక్రటరీ ఫోన్ చేసి పిలిస్తే కార్యాలయానికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారు. తిరస్కరించినందుకు ఆఫీసులోనే దారుణంగా కట్టెలతో కొట్టి చంపేశారు’’ అని జగన్ చెప్పారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రంలో టీడీపీ మంత్రులెందుకు ఉన్నారు?
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని చంద్రబాబు అంటున్నపుడు... ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారు? వారిని బయటకు రమ్మనవచ్చు కదా? అని జగన్ ఆంగ్ల మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రయివేటు విమానాల్లో చంద్రబాబు యాత్రలకు వెళ్లడం సమంజసమేనా? అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు.
పదవీకాలాన్ని పెంచి హత్యలు చేయిస్తున్నారు...
రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన డీజీపీ జేవీ రాముడు పదవీకాలం పొడిగించి, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘డీజీపీ అనంతపురం జిల్లా వాసి. తెలుగుదేశం నాయకులందరూ ఆయనను ‘అన్నా’, ‘మామా’, ‘చిన్నాన్నా’... అని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆయన వారి ఇళ్లకు కూడా పోతారు. అనంతపురం జిల్లాకు వస్తే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లేది జిల్లా మంత్రి గారి ఇంటికే. ఆయన అండ చూసుకునే జిల్లాలో ఎనిమిది హత్యలు జరిగాయి. ప్రసాదరెడ్డి హత్య జరిగాక ఎస్‌ఐని, సీఐని జిల్లా ఎస్‌పీ వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు బదిలీ చేస్తే ఒక్క రోజైనా తిరక్కముందే వారిని మళ్లీ వెనక్కి తీసుకువచ్చారంటే ఏం అర్థం చేసుకోవాలి. శాంతిభద్రతల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ప్రజలెలా బతకాలి?’’ అని ప్రశ్నించారు.
ఈ విషయాలన్నీ గవర్నర్‌కు వివరించామనీ, ఈ రాజకీయ హత్యలన్నింటి మీదా సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అదుపుతప్పిన శాంతి భద్రతలపై తాము ఇదివరకే ఒకసారి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని, అయితే ఆ తరువాత పరిస్థితులు మరింత దిగజారాయని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలను ప్రజల దృష్టికి ప్రముఖంగా తేవడం ద్వారా ఈ దారుణ హింసాకాండకు ముగింపు పల కాలని మీడియాకు కూడా విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతులను ఆయన మీడియాకు అందించారు.